బల్దియాలో ఎవరి నినాదం హిట్టయ్యింది.. టీఆర్ఎస్-బీజేపీ సంధించిన వెపన్స్ ఏంటి?
అభద్రత-భద్రత....కూల్చడం-నిర్మించడం....హిందూత్వం-భిన్నత్వం....పదివేలు-పాతికవేలు...రాష్ట్రం విజ్తప్తులు-కేంద్రం విదిలింపులు....సింపుల్‌గా చెప్పాలంటే ఇవీ...
అభద్రత-భద్రత....కూల్చడం-నిర్మించడం....హిందూత్వం-భిన్నత్వం....పదివేలు-పాతికవేలు...రాష్ట్రం విజ్తప్తులు-కేంద్రం విదిలింపులు....సింపుల్‌గా చెప్పాలంటే ఇవీ గ్రేటర్ ఎన్నికల్లో యుద్ధ నినాదాల తీరు. స్థానిక ఎన్నికలు-సైద్దాంతిక సమరంగా మారిపోయాయి. మరి ఎవరి అస్త్రం హిట్టయ్యింది ఎవరి ఆయుధం ఫట్ అయ్యింది? ఫలితాల పాఠం ఎవరికి...గుణపాఠమెవరికి?
స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణంగా స్థానిక సమస్యల ప్రాతిపదికగానే జరగాలి. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికలు అలాకాదు. రాష్ట్ర ఎన్నికలు దాటి, జాతీయస్థాయి ఎలక్షన్స్‌లా బిల్డప్ ఇచ్చాయి. బీజేపీ అదే పనిగా పాకిస్తాన్ బూచి, సర్జికల్ దాడులు, రోహింగ్యాలు, మతతత్వం అంటూ తన పాత అస్త్రాలనే ప్రయోగించింది. ఎంఐఎంను దెయ్యంగా చూపించే ప్రయత్నం చేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్ తరహాలో హిందువుల ఓట్లన్నీ గంపగుత్తగా తమకు పడతాయని లెక్కలేసింది. కానీ ఇక్కడే కేసీఆర్, కేటీఆర్ తమ చాణక్యాన్ని ప్రదర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఘట్టాన్ని ఒక సైద్ధాంతిక పోరుగా మార్చేశారు. ప్రాంతీయ అస్తిత్వం, తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మత రాజకీయాలపై, జనంలో చర్చను రేకెత్తించారు.
బీజేపీ వస్తే, హైదరాబాద్ అల్లకల్లోలమే అన్న భయాన్ని క్రియేట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యారు గులాబీ నేతలు. మత ఘర్షణలు, కర్ఫ్యూలతో ఉద్రిక్తంగా వుండే హైదరాబాద్ కావాలా, ప్రశాంతంగా వుండే ప్రస్తుత హైదరాబాద్ కావాలా అంటూ జనానికి పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంపై కోపంగా వున్న చాలామంది, ఈ ఒక్క పిలుపుతో మనసు మార్చుకున్నారు. బీజేపీ అధికారంలోకి రాకూడదన్న ఏకైక ఆలోచనతో, ఈసారికి కేసీఆర్ పార్టీకి పట్టంకట్టాలనుకున్నారు. సెక్యులరిస్టులు, మేధావులు మీటింగ్‌లు పెట్టుకుని మరీ జనాలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యాంటీ బీజేపీ క్యాంపెయిన్‌ను, ఎవరికివారే మేధావులు నడిపారు. సర్జికల్ దాడులు, మతపరమైన విభజన నినాదాలు, ఉత్తరాదిలో సక్సెస్ అయినా, హైదరాబాద్‌లో మాత్రం ఫెయిల్ అయ్యాయి అనడానికి, జనం నుంచే స్పందనే నిదర్శనం. కేసీఆర్ సర్కారుకు, కమలనాథులే అస్త్రాలు అందిచ్చినట్టయ్యింది.
దుబ్బాక బైపోల్ విజయాన్ని మతపరమైన విజయంగా భ్రమించింది బీజేపీ. ఇదే సూత్రాన్ని బల్దియాలోనూ ఫాలో అయ్యింది. మతపరంగా ప్రజలను విభజించేందుకు ఉపయోగించుకుంది. కానీ కేసీఆర్, కేటీఆర్‌లు వీటిని బలంగా తిప్పికొట్టారు. సామరస్యానికి నిలయమైన చార్ సౌ షహర్‌లో మత ఘర్షణలకు తావులేదన్నారు. ఆ రకంగా బీజేపీ హిందూత్వ అస్త్రం బూమరాంగ్ అయ్యింది.
రాష్ట్రం విజ్తప్తులు-కేంద్రం విదిలింపులు. ఇది కూడా గ్రేటర్‌లో పెద్ద చర్చనే రైజ్ చేసింది. హైదరాబాద్ అభివృద్దికి కేంద్రం పైసా కూడా అదనంగా ఇవ్వడంలేదని, ఎల్బీ స్టేడియంలో బలంగా చెప్పారు సీఎం కేసీఆర్. వరదల్లో మునిగిన హైదరాబాద్‌కు సాయం చెయ్యాలని ఉత్తరాల మీద ఉత్తరాలు పంపితే, కనీసం కనికరించలేదన్నారు. అదే బీజేపీ అధికారంలో వున్న కర్ణాటకకు మాత్రం ఆఘమేఘాల మీద నిధులు విడుదల చేశారన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, అమిత్ షాలు ఎన్ని చెప్పినా, ఎన్ని నిధులిచ్చామన్నా, అంతగా విశ్వసించలేదు జనం.
పదివేలు-పాతికవేలు. వరద బాధితులకు పదివేల రూపాయల సాయం చేస్తామని టీఆర్ఎస్ చెప్పడం, వెంటనే అమల్లోకి తేవడంతో, బీజేపీ ఒకరకంగా ఇబ్బందిపడింది. దీంతో తాము ఏకంగా పాతికవేలు ఇస్తామంది. కానీ సాయం చెయ్యొద్దని, బండి సంజయ్ ఈసీకి లెటర్ రాశారు, అందుకే నిలిపివేశారని టీఆర్ఎస్ అటాక్ చేసింది. ఆ లేఖ తనదికాదని బండి ఎన్నిసార్లు చెప్పినా, నోటి కాడ కూడు లాగేశారంటూ, బీజేపీ మీద కారాలు మిరియాలు నూరారు గ్రేటర్ వాసులు. పదివేలు ఆపినవాళ్లు, పాతికవేల ఎలా ఇస్తారంటూ గులాబీ నేతలు చేసిన ప్రచారాన్ని జనం నమ్మారు. ఫలితాల్లో అదే ప్రతిఫలించింది. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మారుస్తామన్న అమిత్ షా మాటనూ లెక్క చెయ్యలేదు. ఐటీఆర్‌ను రద్దు చేసి, ఐటీ హబ్ చేస్తామంటే నమ్మే మాటలా అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు.
మొత్తానికి గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అస్త్రాలపై, టీఆర్ఎస్ ఆయుధాలే పైచేయి సాధించాయనుకోవాలి. కమలం వస్తే హైదరాబాద్‌లో కర్ఫ్యూలేనంటూ గులాబీ చేసిన నినాదాలే జనం విశ్వసించారు. కొంత పుంజుకున్నట్టు బీజేపీ కనిపించినా, మేయర్ పీఠం మాత్రం దక్కించుకోలేకపోయింది. ఈ ఫలితాలతోనైనా బీజేపీకి పాఠాలు నేర్వాలంటున్నారు విశ్లేషకులు. అన్ని చోట్లా సర్జికల్ దాడులు, పాకిస్థాన్ బూచి, హిందూత్వ వంటి పాత చింతకాయ పచ్చడి మంత్రాలు పని చెయ్యవని గ్రహించాలంటున్నారు. అభివృద్ది మంత్రంతోనే ఎన్నికలను ఎదుర్కోవాలంటున్నారు పొలిటికల్ పండితులు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire