TRS party's Plan on BJP: కమలసేనపై సమరానికి పదునెక్కుతున్న గులాబీ అస్త్రాలేంటి?

TRS partys Plan on BJP: కమలసేనపై సమరానికి పదునెక్కుతున్న గులాబీ అస్త్రాలేంటి?
x
Highlights

TRS party's Plan on BJP: బండి రయ్యిన వెళుతోంది. గమ్యం చేరాలని దూకుడుగా సాగుతోంది. బండే కదా అని, మొన్నటి వరకు పెద్దగా ఆలోచించని కారు, కాస్త అలర్ట్‌...

TRS party's Plan on BJP: బండి రయ్యిన వెళుతోంది. గమ్యం చేరాలని దూకుడుగా సాగుతోంది. బండే కదా అని, మొన్నటి వరకు పెద్దగా ఆలోచించని కారు, కాస్త అలర్ట్‌ అవుతోంది. సర్రున వెళ్తున్న కాషాయ బండిని నిలువరించాలని డిసైడయ్యింది. గేరు మార్చి, తన స్పీడ్‌ను పెంచాలని గట్టి నిర్ణయమే తీసుకుంది కారు. కాషాయ స్పీడ్‌కు బ్రేకులేసేందుకు, గులాబీ కారు సిద్దం చేస్తున్న వ్యూహం ఏంటి?

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మామూలు హీటుగా లేవు. ఆరోపణలు సెగలు, మాటల మంటలతో మండుతున్నాయి తెలంగాణ పాలిటిక్స్. ఎలాగైనా టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని, బీజేపీ కంటే ఒక అడుగు ముందుకే వుండాలని, అటు కాంగ్రెస్ వీరోచితంగా నిరసనలు చేస్తోంది. ఇటు కాషాయమైతే, కేంద్రంలోని పవర్‌‌తో మరింతగా అస్త్రాలు సంధిస్తోంది. అయితే, కాంగ్రెస్‌ కంటే తనకు బీజేపీతోనే కాస్త కయ్యం పెరుగుతోందన్నట్టుగా గులాబీదళం ఆలోచిస్తోంది.

కరోనాకు ముందు కూడా టీఆర్ఎస్‌ సర్కారుపై ఓ రేంజ్‌లో విమర్శనాస్త్రాలు సంధించింది బీజేపీ. ఇక బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత, దూకుడు మరింత పెరిగింది. కరోనా టెస్టులు, పీపీపీ కిట్ల కొరత, ఆక్సిజన్ సిలిండర్లు లేక మరణాలు, టెస్టులపై పీఐబీ రిపోర్టు, సచివాలయం కూల్చివేత, కరోనాను ఆరోగ్యశ్రీ లేదా ఆయుష్మాన్‌ భారత్‌లో చేర్చాలంటూ, ఇలా ఒకదాని తర్వాత ఒక అంశంలో స్టేట్ బీజేపీ, గులాబీ సర్కారును ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సమరంలో, ఏకంగా కేంద్ర బీజేపీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఆయుధాలు విసురుతోంది. కేంద్రమంత్రులతో పాటు జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం, టీఆర్ఎస్‌ సర్కారును విమర్శిస్తున్నారు. దీంతో కమలాన్ని అంత ఈజీగా తీసుకోకూడదని భావిస్తున్న గులాబీదళం, చాలా సీరియస్‌గా కత్తులకు పదునుపెడుతోంది. రానున్నవి గ్రేటర్ ఎన్నికలు కాబట్టి, ఇలాగే బీజేపీని చూసీచూడనట్టు వదిలేస్తే, మొదటికే మోసమని ఆలోచిస్తున్న టీఆర్ఎస్, కాషాయాన్ని ఇరుకునపెట్టేందుకు వ్యూహాలను సిద్దం చేస్తోంది.

కరోనా కట్టడికి కేంద్రం ఏడువేల కోట్లు ఇచ్చిందని, స్టేట్ బీజేపీ నేతలు అదే పనిగా మాట్లాడుతున్నారు. ఇదే మాటను రివర్స్‌‌గా సంధించాలనుకుంటోంది గులాబీదళం. ఎప్పుడిచ్చారో, ఎంతిచ్చారో, లెక్కలు చెప్పాలని, ఆధారాలు చూపాలని గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. రానున్న రోజుల్లో ఈ మాటలకు మరింత మంటలు రగిలించాలనుకుంటోంది. కరోనా టెస్టింగ్ కిట్లు కూడా, గులాబీదళానికి అస్త్రాలవుతున్నాయి. తాము ఆర్డర్ చేసిన టెస్టింగ్ కిట్లను, పశ్చిమ బెంగాల్‌కు తరలించారని, అందుకే టెస్టులు తక్కువ అవుతున్నాయన్న పాయింట్‌లో, కాషాయాన్ని కార్నర్ చెయ్యాలనుకుంటోంది. వెంటిలేటర్ల విషయంలో కూడా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తోంది టీఆర్ఎస్. ఇలా రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కరోనాను కేంద్రంగా చేసుకుని, కాషాయం విరుచుకుపడాలని భావిస్తున్న తరుణంలో, అదే కరోనా అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టి, స్టేట్ బీజేపీని కార్నర్‌ చెయ్యాలన్నది టీఆర్ఎస్‌ వ్యూహంగా అర్థమవుతోంది.

మొత్తానికి రాబోయే రోజుల్లో గులాబీదండు, కాషాయదళం మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరే అవకాశముందని మాత్రం అర్థమవుతోంది. చూడాలి, గ్రేటర్ ఎన్నికల వరకు, వీరి సమరం ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో.


Show Full Article
Print Article
Next Story
More Stories