తెలంగాణలో గొర్రెల కుంభకోణం కథ ఏంటి... ఈడీ ఎందుకు ఎంటరైంది?

What is the story of the sheep scam in Telangana Why did ED get involved?
x

Sheep Scam: తెలంగాణలో గొర్రెల కుంభకోణం కథ ఏంటి... ఈడీ ఎందుకు ఎంటరైంది?

Highlights

తెలంగాణ ప్రభుత్వం 2017 జూన్ 20న గొర్రెల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభానికి కొన్ని రోజుల ముందే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యాదవ సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘాల్లోని సభ్యులకు గొర్రెలు, మేకలను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించేది.

Sheep Scam: ఈడీ అధికారులు తెలంగాణలో గొర్రెల స్కాంపై ఈ నెల 13న కేసు నమోదు చేశారు. ఈ స్కీంలో లబ్దిదారులు, గొర్రెలు విక్రయదారులు, రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ రాశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైద్రాబాద్ పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులను ఈడీ అధికారులు విచారించారు. మరో వైపు ఇదే కేసులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్, పశుసంవర్థక శాఖలో ఎండిగా పనిచేసిన రాంచందర్, కామారెడ్డి వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ ఏడీ ఆదిత్యతో పాటు రఘుపతి రెడ్డి, గణేష్ లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరికొందరికి కోసం గాలింపు చర్యలు చేపట్టారు దర్యాప్తు అధికారులు. ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగింది.


ఉపాధి కల్పన కోసం గొర్రెల పథకం

గొర్రెలు, మేకలను పెంచుకోవడం ద్వారా పేదలకు జీవనోపాధిని కల్పించేందుకే ఈ పథకం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2017 జూన్ 20న గొర్రెల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభానికి కొన్ని రోజుల ముందే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యాదవ సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘాల్లోని సభ్యులకు గొర్రెలు, మేకలను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించేది. ఒక్కో యూనిట్ లో 21 గొర్రెలుంటాయి. ఒక్క యూనిట్ కు 1.25 లక్షల రూపాయాలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ తర్వాతి కాలంలో దీన్ని 1 లక్షా 75 వేలకు పెంచారు. ఈ యూనిట్ కింద లబ్దిదారులు 43 వేల 750 చెల్లిస్తే మిగిలిన 1లక్షా 31వేల 250 రూపాయాలను ప్రభుత్వం సబ్సిడీగా అందించేది. గ్రామ సభలను ఏర్పాటు చేసి ఆ గ్రామసభల్లో లబ్దిదారులను ఎంపిక చేశారు. ఒక్క గ్రామంలోని సంఘంలో 40 మంది సభ్యులుంటే 20 మందికి మొదటి విడతలో, రెండో విడతలో మరో 20 మందిని ఈ పథకం కింద ఎంపిక చేశారు. తొలి విడత 20 మందిని లాటరీ ద్వారా గుర్తించారు.


గొర్రెల పథకం నిబంధనలేంటి...

గ్రామ సభల్లో ఎంపిక చేసిన లబ్దిదారులు కోరుకున్న గొర్రెలను పశుసంవర్ధక శాఖ అధికారులు కొనుగోలు చేసి ఇచ్చేవారు. కొనుగోలు చేసిన గొర్రెలను లబ్దిదారుడి గ్రామానికి తరలించేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వం భరించేది. లబ్దిదారుల ఇంటికి చేరిన గొర్రెలకు వారం రోజుల పాటు అవసరమైన ఫీడ్, మందులను కూడ ప్రభుత్వం అందించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలంగాణ అధికారులు ఎక్కువగా గొర్రెలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన గొర్రెల చెవులకు అక్కడే ట్యాగ్ లు వేసి ఇందుకు సంబంధించిన యాప్ లో ఈ ఫోటోలను అప్ లోడ్ చేసేవారు. గొర్రెలను విక్రయించిన వారి బ్యాంకు ఖాతా వివరాలు, వారి ఆధార్ కార్డు వివరాలను తీసుకొని నగదును బదిలీ చేయాలి. ఈ పథకం ప్రారంభంలో నిబంధనల మేరకు అధికారులు నడుచుకున్నారు. అయితే మద్యదళారులు, ఉన్నతస్థాయిలో అధికారులు కుమ్మక్కైన తర్వాత పథకం స్వరూపమే మారిపోయిందని ఈ పథకాన్ని గ్రౌండింగ్ చేసిన పశువైద్యాధికారి ఒకరు తెలిపారు.


గొర్రెల పథకంలో అవకతవకలు

గొర్రెల కొనుగోలు కోసం ఇతర రాష్ట్రాల్లో మధ‌్య దళారులను పశు వైద్యులు సంప్రదించేవారు. అయితే కొంతకాలానికి మధ్య దళారులు పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులతో కుమ్మక్కయ్యారు. తమ నుండే గొర్రెలను కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుండి ఆయా జిల్లాలకు ఫలానా వారి వద్ద నుండే గొర్రెలను కొనుగోలు చేయాలని క్షేత్రస్థాయి వైద్యులకు మౌఖికంగా ఆదేశాలు వెళ్లాయి. ఇది ఈ కుంభకోణానికి పునాది వేసింది. ఒక్కరి నుండి 10 లేదా 12 గొర్రెల యూనిట్లు మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. 12 యూనిట్లు అంటే 252 గొర్రెలు. అయితే నిబంధనలకు విరుద్దంగా ఒక్కరి నుండి 100 నుండి 200 యూనిట్ల గొర్రెలను కొనుగోలు చేశారు.

గొర్రెల కొనుగోలు సమయంలో లబ్దిదారుల వివరాలను మధ్య దళారులు తీసుకొనేవారు. వారం రోజుల తర్వాత వారి వద్దకు వెళ్లి తాము అమ్మిన గొర్రెలను కొనుగోలు చేసేవారు. 21 గొర్రెలకు లబ్దిదారుడు ప్రభుత్వానికి 43 వేల 750 రూపాయాలు చెల్లించేవారు. అయితే వారం రోజులకే మధ్య దళారులు 90 నుండి లక్ష రూపాయాలు చెల్లిస్తామని ముందుకొస్తే వాటిని విక్రయించేవారు. లబ్దిదారునుండి గొర్రెలను తీసుకెళ్లే ముందు చెవులకు ఉన్న ట్యాగ్ ను తొలగించేవారు. ఇవే గొర్రెలను తిరిగి మరో లబ్దిదారుడికి విక్రయించేవారు. ఇలా ఒక్క యూనిట్ గొర్రెలు వందలాది మంది లబ్దిదారులకు రీసైక్లింగ్ రూపంలో చేరాయని పశువైద్యాధికారి ఒకరు చెప్పారు.



అధికారులు ఏం చేశారు?

ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలను కొనుగోలు చేసేందుకు వెళ్లే సమయంలో పశుసంవర్ధక శాఖాధికారులు ట్రాన్స్ పోర్ట్ సర్టిఫికెట్ ను జారీ చేస్తారు. అయితే మధ్య దళారులు లబ్దిదారుడి నుండి తాను అమ్మిన గొర్రెలను తిరిగి కొనుగోలు చేసి తీసుకెళ్లే సమయంలో చెక్ పోస్టులు, రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసులు పట్టుకొనేవారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.

ఈ విషయమై పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి పోలీసులు లోతుగా విచారిస్తే గొర్రెల యూనిట్లు రీసైక్లింగ్ అంశం బయటకు వచ్చేది. కానీ, పశుసంవర్థకశాఖ ఉన్నతాధికారులు, మధ్యదళారులతో కుమ్మకైనందున ఈ అంశం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకొన్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ సమయంలో ఈ పథకం అమల్లో ఇష్టానుసారంగా వ్యవహరించారనే విపక్షాలు ఆరోపణలు చేశాయి. ఉప ఎన్నికల సమయంలో ఈ పథకం కింద లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేశారని కూడా విపక్షాలు విమర్శలు చేశాయి.


కాగ్ రిపోర్ట్ లో ఏముంది?

గొర్రెల పథకం స్కాంకు సంబంధించి కాగ్ రిపోర్ట్ కీలక అంశాలను ప్రస్తావించింది. లాజిక్ లేకుండా అధికారులు తప్పుడు బిల్లులు సృష్టించారని ఈ నివేదిక వివరించింది. ఒక్క వాహనం 24 గంటల వ్యవధిలో వేలాది కిలోమీటర్ల దూరం తిరిగినట్టుగా బిల్లులు పెట్టిన అంశాన్ని కాగ్ ఎత్తిచూపింది. గొర్రెల రవాణ కోసం వాహనాలను సమకూర్చుకొనేందుకు కలెక్టర్ నేతృత్వంలో కమిటీ తక్కువ కోట్ చేసిన కాంట్రాక్టర్ కు టెండర్ ను ఇచ్చింది. ఈ కాంట్రాక్టరే జిల్లా వ్యాప్తంగా గొర్రెల యూనిట్ల రవాణ కోసం వాహనాలను సమకూరుస్తారు. గొర్రెల యూనిట్ ను లబ్దిదారులకు అందించినట్టుగా యాప్ లో పశువైద్యాధికారులు ప్రొసీజర్ ను పూర్తి చేసిన తర్వాత ఈ డబ్బులు విడుదల చేస్తారు.

టూ వీలర్, కార్లు, అంబులెన్స్ వంటి వాటిలో కూడా గొర్రెలను లబ్దిదారు ఇంటికి చేర్చినట్టుగా బిల్లులు సమర్పించిన విషయాన్ని కాగ్ తన నివేదికలో ఎత్తి చూపింది. సంగారెడ్డి జిల్లాలో హీరో హోండా బైక్ పై 126 గొర్రెలు, ఖమ్మంలో అంబులెన్స్ లో 84 గొర్రెలు, మహబూబ్ నగర్ లో ఇండికా కారులో 168 గొర్రెలను తరలించినట్టుగా బిల్లులు పెట్టారు కాంట్రాక్టర్లు. ఏడు జిల్లాల్లోనే 253 కోట్ల 93 లక్షలు దుర్వినియోగమైనట్టుగా నివేదిక చెబుతోంది.

అయితే కొన్ని జిల్లాల్లో వాహనాల బిల్లులు సమర్పించే సమయంలో ఒక్క వాహనాల నెంబర్లలో ఒక్క నెంబర్ పొరపాటున రాసిన సందర్భాల్లో బిల్లులను నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయని నల్గొండ జిల్లాకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. జిల్లాలో సుమారు 1100 యూనిట్లకు డబ్బులను ప్రభుత్వం మంజూరు చేయలేదని ఆయన గుర్తు చేశారు. పొరపాటున వాహనాల నెంబర్లు వేసినట్టుగా ఆధారాలతో కూడా పంపినా ఈ బిల్లులు మంజూరు కానీ విషయాన్ని ఆయన ప్రస్తావించారు.


గొర్రెల పథకంలో అవినీతి ఎలా బయట పడింది?

గొర్రెల పథకంలో భాగంగా గొర్రెలను విక్రయించిన వారికి కాకుండా మధ్యదళారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం వల్ల విషయం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన 18 మంది గొర్రెల పెంపకందారులు హైద్రాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఈ ఏడాది జనవరి 26న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఐపీసీ 406, 409, 420 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ఈ కేసు నమోదు కావడానికి ముందే పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కీలక ఫైళ్లు మాయం చేశారని ఆ శాఖ అధికారులు అప్పట్లో నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాంపల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఈ సమయంలోనే రంగారెడ్డి జిల్లాలో ఈ స్కీంలో అవకతవకలు జరిగాయనే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ స్కాంపై రేవంత్ రెడ్డి సర్కార్ ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేషీలో ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ ఇప్పటికే అరెస్టయ్యారు. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని కీలక ఫైళ్లను దొంగిలించారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో కూడా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది .


రంగంలోకి దిగిన ఈడీ

గొర్రెల పథకంలో మనీలాండరింగ్ జరిగిందని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసును విచారించాలని ఈడీని ఏసీబీ కోరింది. దీంతో ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. జూన్ 13న ఈసీఐఆర్ ను నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో ఏసీబీ అరెస్టు చేసిన అధికారులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

మరో వైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విదేశాల్లో ఉన్నారని ఏసీబీ గుర్తించింది. వీరిని హైద్రాబాద్ కు రప్పించేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ ఇద్దరు హైద్రాబాద్ కు రప్పిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

గొర్రెల పథకం స్కాంలో ఈడీ దర్యాప్తులో ఇంకా ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయనే అంశం సర్వత్రా ఉత్కంఠగా మారింది. దీని వెనుక కీలకపాత్రధారులు, సూత్రధారులు బయటపడతారా అనే చర్చ సాగుతుంది. రాజకీయంగా తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని కొందరు బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. విచారణలో దోషులుగా తేలిన వారిని శిక్షిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories