Telangana: రేవంత్ సర్కార్ ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’కు, కేసీఆర్ గురుకులాలకు తేడా ఏంటి?
Telangana: తెలంగాణలో 28 యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్టోబర్ 11న శంకుస్థాపన చేసింది. రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు వీటికి భూమిపూజ చేశారు.
Telangana: తెలంగాణలో 28 యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్టోబర్ 11న శంకుస్థాపన చేసింది. రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు వీటికి భూమిపూజ చేశారు. రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.
ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లక్ష్యం ఏంటి?
కులమతాలకు అతీతంగా పేదలందరికీ అంతర్జాతీయ సౌకర్యాలతో, బోధన ప్రమాణాలతో విద్యను అందించాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీటికి శ్రీకారం చుట్టింది.ఇది చరిత్రాత్మక నిర్ణయమని రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఈ స్కూల్స్‌లో 4 నుంచి 12 తరగతుల వరకు చదువుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ ఇలా అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులకు వీటిలో ఆడ్మిషన్ ఇస్తారు. ఒక్కో స్కూలును 20 నుంచి 25 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. తొలి విడతగా నిర్మిస్తున్న 28 స్కూల్స్‌కు ఈ ఏడాది బడ్జెట్ లో రూ. 5,000 కోట్లు కేటాయించారు. వీటి నిర్మాణాలను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు.
విద్యార్థులకు సదుపాయాలు
ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం ప్రతి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో 120 మంది టీచర్లను నియమిస్తారు. ప్రతి స్కూల్‌లో 25,60 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. లైబ్రరీలో 5 వేల పుస్తకాలు, 60 కంప్యూటర్లు, తరగతి గదిలో డిజిటల్ బోర్డులు ఉంటాయి. 900 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేలా డైనింగ్ హాల్ ఉంటుంది. ప్రతి డార్మిటరీ గదిలో పది బెడ్ లు, రెండు బాత్ రూమ్స్ ఉంటాయి. సాంస్కృతిక, విద్య కార్యక్రమాల కోసం ప్రత్యేక ఆడిటోరియం, ఇండోర్, ఔట్ డోర్ ప్లే గ్రౌండ్స్ , ఆసుపత్రి ఉంటాయి. బాల, బాలికలకు వేర్వేరు హాస్టళ్లుంటాయి. అయిదు అంతస్తుల ఈ భవనాల్లో రెండు అంతస్తుల్లో క్లాస్ రూమ్స్ ఉంటాయి.
టీచర్లకు కూడా ఇందులోనే నివాసాలు ఏర్పాటు చేస్తారు. వీటిలో ముఖ్యంగా, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఇక్కడి విద్యార్థులను సిద్ధం చేస్తారు.
విద్యారంగంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది?
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 294 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలున్నాయి. తొమ్మిదిన్నర ఏళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం వీటిని 1092కు పెంచింది. అయితే, వీటిలో 628 స్కూల్స్ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. విద్యారంగంలో మార్పులు తెచ్చే లక్ష్యంతో కేసీఆర్ 2014 జూలై 26న ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. ఆ సందర్భంలో, “కలెక్టర్ పిల్లలు, అటెండర్ పిల్లలు కలిసి చదివేలా ప్రభుత్వ స్కూళ్ళనుం డెవలప్ చేస్తాం” అని కేసీఆర్ అన్నారు.
కానీ, అవేవీ ఆచరణకు నోచుకోలేదు. కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందిస్తామని ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ హామీ ఇస్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు వేరు వేరుగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. విద్యార్థి దశలోనే పిల్లలను ఇలా కులాలు, మతాలవారీగా విడదీయడం ఏమిటనే విమర్శలు అప్పుడు బలంగానే వినిపించాయి. కానీ, కేసీఆర్ వాటిని ఏమాత్రం ఖాతరు చేయలేదు. అదే పంథాలో గురుకులాలను పెంచుకుంటూ పోయారు.
కేసీఆర్ ప్రభుత్వం గొర్రెలు కాసుకునే వారు అదే పనిలో కొనసాగాలని, చేపలు పట్టుకునే వాళ్ళ పిల్లలు అదే పని చేయాలన్నట్లుగా పథకాలు తీసుకొచ్చిందని విమర్శించిన రేవంత్ రెడ్డి, “మా ప్రజా ప్రభుత్వం అందరికీ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తోంది. ఇవి కుల, మత, వర్గాలకు అతీతమైన విద్యాకేంద్రాలు” అని అన్నారు.
సంపన్నులు, పేదల పిల్లలు ఒకే స్కూళ్లో చదవాలి
గత ప్రభుత్వం ప్రాభించించిన గురుకుల పాఠశాలలతో సహా రాష్ట్రంలో చాలా బడులు అరకొర వసతులతో నడుస్తున్నాయని, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్, “గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వాటిని కామన్ స్కూల్స్ గా అభివృద్ది చేయాలి” అని ప్రభుత్వానికి సూచించారు.
ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణంపై స్పందిస్తూ, “సంపన్నులు, పేదల పిల్లలు ఒకే చోట చదువుకోవడం వల్ల సమాజంలో మార్పు వస్తుంది” అని అంటూనే, రాష్ట్రంలో విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఆ కమిషన్ కనీసం మధ్యంతర రిపోర్ట్ కూడా ఇవ్వక ముందే ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ నిర్మాణాలంటూ హడావిడి చేయడం ప్రచారం కోసమేనని విమర్శించారు.
కులాల మధ్య అంతరం తగ్గుతుంది
రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇందులో 6 లక్షల మంది గురుకులాల్లో చదువుతున్నారు. అయితే, చాలా గురుకులాల్ల కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పిన టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, “అలాంటి గురుకులాల్లోని విద్యార్థులందరినీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లోకి తీసుకుంటాం. కేసీఆర్ ప్రభుత్వం కులాల వారీగా గురుకులాలు ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధం. అది సామాజిక అసమానతలను పెంచి పోషించడమే అవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్న ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ కులాల మధ్య అంతరాన్ని చెరిపేసేందుకు తోడ్పడతాయి” అని చెప్పారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire