What is the controversy between Jogu Ramanna and Indrakaran: ఇంద్రకరణ్-జోగు మధ్య ఓ చిత్రం పెట్టిన చిచ్చేంటి?

What is the controversy between Jogu Ramanna and Indrakaran: ఇంద్రకరణ్-జోగు మధ్య ఓ చిత్రం పెట్టిన చిచ్చేంటి?
x
Highlights

What is the controversy between Jogu Ramanna and Indrakaran: వాళ్లిద్దరూ మొక్కలు చక్కగా నాటారు. హరితహారంలో నందనవనానికి తపించారు....

What is the controversy between Jogu Ramanna and Indrakaran: వాళ్లిద్దరూ మొక్కలు చక్కగా నాటారు. హరితహారంలో నందనవనానికి తపించారు. చెల్లాచెదురైన స్నేహపు తీగలను అంటుకట్టినట్టుగా కట్టారు. నారుతో పాటు నీరూ పోశారు. మొక్కల పక్కన ముసిముసి నవ్వులతో ఫోటోకు ఫోజులిచ్చారు. సీన్‌ కట్‌ చేస్తే....ఇద్దరి నడుమ యుద్ధం మొదలైంది. ఎందుకంటే, ఓ చిత్రం, వారి మధ్య చిచ్చుపెట్టింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ ప్లెక్సీ వివాదం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగురామన్న విభేదాలను తారాస్థాయికి చేర్చింది. ఆదిలాబాద్ జిల్లా మావలలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. దీనికి అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. లోలోపల విభేదాల మంటల రగులుతున్నా, బయటకు మాత్రం ముసిముసినవ్వులు రువ్వారు. ఇద్దరు కలిసి మొక్కలు నాటి, తమ స్నేహం కొత్తగా అంటుకట్టిందన్నట్టుగా అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. సీన్‌ కట్‌ చేస్తే, అదే హరితహారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, ఇద్దరి నడుమ పగలు సెగలు ఆరలేదనడానికి సాక్షిగా నిలిచింది.

హరితహారానికి హాజరవుతున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి స్వాగతం పలుకుతూ అటవీ అధికారులు హరితవనం ముందర ఓ ప్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో సీఎం కేసీఆర్ ఫోటో, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఫోటో వుంది. కానీ స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న ఫోటో మాత్రం లేదు. ఇదే వివాదాగ్ని రాజేసింది. ప్రోటోకాల్ పరంగా చూసినా స్థానిక ఎమ్మెల్యేకు ప్లెక్సీలో చోటు కల్పించాలి. కాని అటువంటి రూల్స్‌ పక్కనపెట్టిన అటవీ అధికారులు, అనుకునో, అనుకోకుండానో, ఫ్లెక్సీలో రామన్నకు చోటు కల్పించలేదు. అదే జోగురామన్న అనుచరులకు సర్రున మండేలా చేసిందట. ఎందుకంత నిర్లక్ష్యం, లెక్కలేనితనమంటూ రగిలిపోయారట.

అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలో మంత్రి ఫోటో ఉండి, స్థానిక ఎమ్మెల్యే చిత్రం ఏర్పాటు చేయకపోవడంపై జోగురామన్న అభిమానులు రచ్చరచ్చ చేశారట. దీన్ని అవమానంగా భావించారట. కొంతమంది జోగురామన్న అనుచరులు, అటవీ అధికారులను ప్రశ్నించారట. ఆఫీసర్ల పొంతనలేని సమాధానాలతో మరింత ఆగ్రహంతో ఊగిపోయారట.

అయితే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వల్లనే ఫెక్సీలో రామన్నకు చోటు లభించలేదని, ఎమ్మెల్యే ఫాలోవర్స్‌ కళ్లెర్రజేస్తున్నారట. సీఎం కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలే నియోజకవర్గానికి సుప్రీం అని చెప్పినా, అధినేత మాటను పట్టించుకోవడం లేదట. అయితే అటవీ అధికారుల తీరుపై రామన్న అనుచరులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతున్నారట. అందర్నీ కలుపుకోవాల్సిన మంత్రి చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇంద్రకరణ్‌పైనా కంప్లయింట్ ఇస్తామంటున్నారట. మొత్తానికి ఫ్లెక్సీ వివాదం మంత్రి, మాజీ మంత్రి మధ్య పాత పగల సెగలను మళ్లీ మండించింది. అటు తిరిగి ఇటు తిరిగి ఇంద్రకరణే అందుక్కారణమంటూ జోగురామన్న వర్గం సీరియస్‌ అవుతోంది. పార్టీ పెద్దలు రంగంలోకి దిగి ఇరువురి నడుమ సయోధ్య కుదర్చాలంటూ, కార్యకర్తలు కోరుకుంటున్నారట.


Show Full Article
Print Article
Next Story
More Stories