మారుతీరావు భార్య ఏం చెయ్యబోతున్నారు?

మారుతీరావు భార్య ఏం చెయ్యబోతున్నారు?
x
మారుతీరావు భార్య ఏం చెయ్యబోతున్నారు?
Highlights

ఒక హత్య. మరో ఆత్మహత్య. ఇద్దరు చనిపోయారు. ముగ్గురు మిగిలారు. ప్రణయ్‌, మారుతీరావు చనిపోతే, ఇప్పుడు మిగిలింది అమృత, మారుతీరావు భార్య గిరిజ,...

ఒక హత్య. మరో ఆత్మహత్య. ఇద్దరు చనిపోయారు. ముగ్గురు మిగిలారు. ప్రణయ్‌, మారుతీరావు చనిపోతే, ఇప్పుడు మిగిలింది అమృత, మారుతీరావు భార్య గిరిజ, అమృత-ప్రణయ్‌ల‌ కుమారుడు. కులం రేపిన కల్లోలం, చివరికి కుటుంబాలనే ఛిన్నాభిన్నం చేసింది. అయితే, మారుతీరావు అంతిమ సంస్కారం సాక్షిగా, అమృత, ఆమె బాబాయ్‌ శ్రవణ్ సంధించుకున్న ఆరోపణలు, లేవనెత్తిన ప్రశ్నలు, ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. మరి 'తల్లీ అమృతా.. అమ్మ దగ్గరికెళ్లిపో...అంటూ మారుతీరావు ఆఖరి కోరిక నెరవేరుతుందా...? తల్లీబిడ్డా ఏకమవుతారా...? అమృత, బాబాయ్‌ శ్రవణ్‌లు ఎందుకింతగా ఆరోపణలు చేసుకుంటున్నారు? వీరిద్దరి వెలిబుచ్చిన అనుమానాలకు బలముందా?

'తల్లీ అమృతా.. అమ్మ దగ్గరికెళ్లిపో...ఇదీ మారుతీరావు ఆఖరి మాట. ఈ మాటే, ఇప్పుడు, అందరిలోనూ ప్రతిధ్వనిస్తోంది. భవిష్యత్‌‌‌లో ఏం జరగబోతోందంటూ, ఆలోచనలే రేకెత్తిస్తోంది. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న కూతురు అమృతకు, ప్రాణం తీసుకుంటూ ఆఖరి ఊపిరిలోనూ మారుతీరావు ఆఖరి మాటలివి. కానీ మారుతీరావు ఆఖరి కోరిక మాత్రం నెరవేరలేదు. అమృతను ఆఖరి చూపు చూడనివ్వలేదు బంధువులు.

నాన్న ఆఖరి కోరిక అనో, లేదంటే నాన్న మీద ప్రేమతోనో, అవీకాదంటే బిడ్డగా ఆఖరి సంస్కారాలు చేయాలన్న బాధ్యతనో ఇవెవీకావనుకుంటే ఒక మనిషిలా, మరో మనిషిని ఆఖరి సారిగా చూడాలనో మొత్తానికి అమృత పోలీసుల బందోబస్తు మధ్య, తండ్రిని కడసారి చూడాలని వెళ్లారు. కానీ చివరి చూపు చూడకుండానే వెనుదిరిగారు.

'తల్లీ అమృతా.. అమ్మ దగ్గరికెళ్లిపో అంటూ ఆఖరి మాటలోనూ, బిడ్డపై ప్రేమ వదులుకోలేదు మారుతీరావు. కూతురుపై చంపేంత ప్రేమ, చివరికి చచ్చేంత ప్రేమ. ఆఖరి మాటల్లోనూ కూతురును తల్లి దగ్గరకు చేర్చుకోవాలన్నదే ఆలోచనగా అర్థమవుతోంది. మంచో, చెడ్డో జరిగిపోయింది నీకు భర్తలేడు తానిప్పుడు చనిపోతూ మీ అమ్మకు భర్తలేకుండా చేస్తున్నానని అనుకున్నాడేమో మారుతీరావు, ఇద్దరూ ఒంటరి కాకుండా, ఒకరికొకరుగా వుండాలని ఆఖరి ఆలోచన చేశారు. కానీ ఆఖరి చూపయితే, దక్కలేదు. మరి రానున్నకాలంలోనైనా మారుతీరావు చివరి కోరిక మేరకు, అమృత, ఆమె తల్లి ఒక్కటవుతారా?

మారుతీరావు ఆఖరి కోరికను భార్యగా గిరిజ నెరవేరుస్తారా? తండ్రి చివరి మాటను బిడ్డగా అమృత పాటిస్తారా? అన్న అంతిమ కోరికను తమ్ముడిగా శ్రవణ్‌ సాధిస్తారా?ఇలాంటి ప్రశ్నలన్నింటికీ మరిన్ని చిక్కుముడులు పడుతున్నాయి అమృత, ఆమె బాబాయ్‌ శ్రవణ్‌ మాటలను చూస్తే. ఒకరిపై మరొకరివి తీవ్రమైన ఆరోపణలు.

బాబాయ్‌పై అమృత అమృతపై బాబాయ్‌. తీవ్రస్థాయిలో ఆరోపణలేంటి? ఒకరిపై మరొకరికి ఎందుకిన్ని అనుమానాలు?

మారుతీరావు చనిపోయారు. అంత్యక్రియలు ముగిశాయి. అయితే, అమృత, ఆమె బాబాయ్‌ శ్రవణ్‌, పరస్పరం చేసుకున్న ఆరోపణలు, మొత్తం వ్యవహారంలో మరో మలుపు. తన తండ్రి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్న అమృత, బాబాయ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన అమ్మకూ బాబాయ్‌ నుంచి ప్రాణహాని వుందన్నారు. అయితే, ఆస్తికోసమే అమృత కొత్త డ్రామాలాడుతున్నారని శ్రవణ్‌ ఆరోపించడం చర్చనీయాంశాలుగా మారాయి. ఇంతకీ ఇరువురు పరస్పరం ఎందుకిలాంటి సంచలన ఆరోపణలు చేసుకున్నారు? అనుమానాలు ఎందుకు వ్యక్తం చేశారు?

తన కుమారుడిని ఎత్తుకుని, మీడియా సమావేశానికి వచ్చిన అమృత, చాలాసేపు బిడ్డను ఒల్లో కూర్చోబెట్టుకునే మాట్లాడారు. ఒకవైపు భర్తను కోల్పోయిన బాధ, మరోవైపు ప్రణయే తన కడుపులో జన్మించాడనుకున్నట్టుగా కొడుకు రూపంలో కాస్త ఆనందం. ఎలాగైనా న్యాయం గెలిచి, హంతకులకు శిక్షపడాలన్న ఆరాటం. ఇలాంటి సమయంలోనే, తండ్రి మారుతీరావు చనిపోయారు. తన తండ్రి మరణాన్ని ఆమె ఎలా చూస్తున్నారన్న సంగతి పక్కనపెడితే, అమృత చేసిన ఆరోపణలు, సంధించిన ప్రశ్నలు మాత్రం, చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా బాబాయ్‌ శ్రవణ్‌ కేంద్రంగా అమృత సంచలన ఆరోపణలు చేశారు.

మనిషిని చంపించిన మారుతీరావు, చంపేంత పిరికివాడు కాదన్నారు అమృత. భర్త ప్రణయ్‌ హత్య కేసులో శిక్ష తప్పదన్న కారణంతోనే సూసైడ్‌కు పాల్పడ్డారన్నది కరెక్ట్ కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేయడం ఆసక్తి కలిగిస్తోంది. ఇదే సమయంలో బాబాయ్‌ శ్రవణ్‌పై, అమృత సెన్సేషల్ ఆరోపణలు చేశారు. బాబాయ్ నుంచి అమ్మకు ప్రాణహానీ ఉందన్నారు.

మారుతీరావు కుటుంబంలో ఆస్తి తగాదాలున్నాయన్నారు అమృత. మారతీరావును శ్రవణ్‌ కొట్టినట్లు తెలిసిందన్నారు. ప్రణయ్‌ హత్యకు ముందు ఆస్తులు పంచుకోలేదని, తాను బయటికొచ్చాక ఆస్తులు పంచుకున్నారని అన్నారు. కరీంతో పాటు చాలా మంది పేర్లపై బినామీ ఆస్తులున్నాయని, తన పేరుపై ఎలాంటి ఆస్తులు లేవన్నారు. తనకు చిల్లిగవ్వ కూడా అవసరంలేదని వ్యాఖ్యానించారు అమృత. బాబాయ్‌ రెచ్చగొట్టడం వల్లే, మారుతీ రావు ప్రణయ్‌ను హత్య చేయించారని ఆరోపించారామె.

అమృత ఆరోపణలపై బాబాయ్‌ శ్రవణ్‌ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఆమె చెబుతున్నవన్నీ అబద్దాలన్నారు. తన అన్నయ్యతో తనకు ఎలాంటి విబేధాలు లేవని, చాలా రోజులుగా తామిద్దరి మధ్య మాటల్లేవని చెప్పారు. తమ కుటుంబంలో ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని, ప్రణయ్‌ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా జైలు శిక్ష అనుభవించానని చెప్పుకొచ్చారు శ్రవణ్. కేసు విషయంలోనే మారుతీరావు ఆందోళనగా ఉన్నారని, కేసు ట్రయిల్ దశకు వచ్చిందని దాని వల్లే ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు శ్రవణ్. ఆస్తి కోసమే, అమృత కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.

అమృత, శ్రవణ్‌ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు సరే. మరి మారుతీరావు భార్య గిరిజ ఆలోచనేంటి? ఆమె ఏం చెయ్యబోతున్నారు? భర్త ఆఖరి కోరిక మేరకు కూతురును దగ్గరకు తీసుకుంటారా?

జరిగిందేదో జరిగిపోయింది ప్రణయ్‌ హత్య కేసులో మిగిలిన దోషులకు కోర్టు శిక్ష ఖరారు చేస్తుంది. ఇక జరగాల్సింది ఏంటి? అసలు మారుతీరావు భార్య, అమృత తల్లి గిరిజ ఆలోచనేంటి? మారుతీరావు ఆఖరి కోరిక మేరకు భార్యా-బిడ్డ ఏకమవుతారా?

కులం ఎంతటి రావణకాష్టం మిగులుస్తుందో, మారుతీరావు కుటుంబం విషాదమే నిదర్శనం. తక్కువకులం వాడనో, తన గారాల కూతురు ఇక తన దక్కదనో, ప్రణయ్‌ను హత్య చేయించారు మారుతీరావు. తర్వాత కోర్టులు, విచారణలు, శిక్ష ఖరారు అవుతుందన్న భయం, సమాజంలో బంధువులు, సన్నిహితులు నేరస్తుడిగా చూడటం, ఇలా కారణం ఏదైనా మారుతీరావు తన ప్రాణం తాను తీసుకున్నారు. పోతూపోతూ, అమృతా అమ్మ దగ్గరకు వెళ్లూ అంటూ ఆఖరి కోరిక కోరారు. మరి మారుతీరావు కోరిక మేరకు తల్లీ-బిడ్డ ఒక్కటవుతారా అన్నదే ప్రశ్న.

అయితే, అమృత మాత్రం తన అమ్మ దగ్గరకు తానైతే వెళ్లనని, తనే వస్తే బాధ్యతగా చూసుకుంటానని అన్నారు. అమ్మ దగ్గరకు ఇప్పుడెళితే, ఆస్తి కోసమే వచ్చిందని అనుకుంటున్నారని అమృత ఆలోచన కావచ్చు. అయితే, భర్తను కోల్పోయిన బాధ తనకు తెలుసన్న అమృత, త్వరలో అమ్మను కలుస్తాను, ధైర్యం చెబతాను అని అన్నారు. ఈ మొత్తం విషాదంలో ఇప్పటి వరకూ నోరు మెదపని వ్యక్తి మారుతీరావు భార్య గిరిజ. భర్త మృతదేహాన్ని చూడగానే కుప్పకూలిపోయారు.

అయితే, భర్త ఆఖరి కోరిక మేరకు కూతురు అమృతను ఆమె కలుస్తారా ఇద్దరూ కలిసి వుండటానికి అంగీకరిస్తారా ప్రణయ్‌ను అల్లుడిగా ఒప్పుకోని ఆమె, వారిద్దరికీ జన్మించిన కుమారున్ని మనవడిగా అంగీకరిస్తారా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఇటు అమృతను, అటు తల్లిని మాత్రం, మారుతీరావు ఆఖరి కోరిక నిత్యం గుర్తుకురావడం ఖాయం. వెంటాడటం ఖాయం. మరి కాలమే అన్ని గాయాలకు మందంటారు. మరి వీరిద్దరూ గతమంతా మరిచిపోతారా? తల్లీకూతుళ్ల మధ్య గాయం మానుతుందా? ఇద్దరూ కలిసి, మరో జీవిత ప్రస్థానం మొదలుపెడతారా? చూడాలి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories