Raj Gopal Reddy: రాజీ వెనక రహస్యం..?.. అన్న బలవంతం చేశారా..? అధిష్టానం ఆహ్వానించిందా..?

What Happened Behind The Rajgopal Resign?
x

Raj Gopal Reddy: రాజీ వెనక రహస్యం..?.. అన్న బలవంతం చేశారా..? అధిష్టానం ఆహ్వానించిందా..?

Highlights

Raj Gopal Reddy: కాంగ్రెస్‌లో ఆశించిన పదవులు వస్తాయని రాజగోపాల్ అనుకుంటున్నారా..?

Raj Gopal Reddy: తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏ పెద్ద తలకాయ... ఏ పార్టీలోకి చేరిపోతుందో అర్థం కాని పరిస్థితి... ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పెద్దసంఖ్యలో ముఖ్యనేతలు కారు దిగి హస్తం గూటికి చేరిపోయారు. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటే బీఆర్ఎస్‌లో ఎలాంటి పరిస్థితి ఉందనేది తెలిసిపోతుంది.

బీజేపీ విషయానికొస్తే.. ఏ క్షణాన బండి సంజయ్‌ను అధిష్టానం పక్కన బెట్టి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి కట్టబెట్టిందో.. అప్పుడే దాదాపు కమలం వాడిపోయింది... ఆ మరుసటి రోజు నుంచే బీజేపీ నేతల్లో అసంతృప్తి.. మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్పేయడం మొదలుపెట్టారు. నాటి నుంచి నేటి వరకూ అదే పంథా కొనసాగుతోంది. ఆ మధ్య అసంతృప్తులంతా రహస్యంగా సమావేశం కావడం.... లాంటి వ్యవహారాలు చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా బీజేపీ మొదటి అభ్యర్థుల జాబితా రావడంతో ఇందులో పలువురు ముఖ్యనేతల పేర్లు లేకపోవడం.. ఆశావాహుల పేర్లు అస్సలే లేకపోవడంతో రాజీనామా పర్వం కొనసాగుతూనే ఉంది. సరిగ్గా ఈ టైమ్‌లోనే బీజేపీ బిగ్ షాట్... మాజీ ఎమ్మెల్యే, కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేసి సొంతగూటికి చేరుతున్నానని మీడియాకు ఓ పత్రికా ప్రకటన పంపారు. ఇప్పుడిది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

కాంగ్రెస్ అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్.. అని టక్కున గుర్తొస్తుంది. అలాంటిది కొంతకాలంగా అన్నదమ్ములు ఇద్దరూ చెరోదారిన నడిచారు. బిజినెస్, ప్రాజెక్టు పనుల విషయంలో వేల కోట్ల రూపాయిలకు బిల్లులు రావట్లేదని.. ఇదంతా ఎందుకు ప్రశాంతంగా బీజేపీలో చేరితే జరగాల్సినవన్నీ జరుగుతాయని 10 నెలల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం కండువా కప్పేసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం... మునుగోడు నుంచి పోటీచేయడం.. ఓడిపోవడం ఇవన్నీ జరిగాయి. ఆ మరుసటి రోజు నుంచే ఇక బీజేపీలో ఉండరని.. ఆయన కావాల్సినవి.. రావాల్సినవన్నీ వచ్చాయనే ప్రచారం మొదలైంది. ఇలా ప్రచారం, వార్తలు వచ్చిన ప్రతిసారీ ఖండించడమే అన్నదమ్ముల పనయింది.

అయితే ఇప్పుడు ఎన్నికల ముందు.. అది కూడా అభ్యర్థుల ప్రకటన తర్వాత రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటానని మీడియాకు లేఖ రాయడం సంచలనమే... దీంతో ఇప్పుడే కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ మొదలైంది. అయితే రాజగోపాల్ రెడ్డి వస్తే మంచిదేనని ముఖ్యనేతలు సైతం ఆహ్వానించారట.... కాగా... ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ వేదికగా అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతారని తెలుస్తోంది... ఈయన కోరుకుంటున్న అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వడానికి కూడా అధిష్టానం రెడీగా ఉందట. మునుగోడుతోపాటు హైదరాబాద్‌లో కీలక నియోజకవర్గమైన ఎల్బీనగర్‌ను కూడా పరిశీలిస్తున్నట్లుగా కోమటిరెడ్డి అనుచరులు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ - కమ్యూనిస్టుల పొత్తుల్లో భాగంగా మునుగోడు నుంచి సీపీఐ బరిలో ఉంటే... తాను పోటీ చేస్తానని రాజగోపాల్‌రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది. లేదంటే.. తాను ఎల్‌బీ నగర్‌ నుంచి, మునుగోడులో తన సతీమణికి టికెట్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్‌కు చెప్పినట్లు సమాచారం.... అయితే.. ఇందుకు కమలం పార్టీ అధిష్టానం ఒప్పుకోలేదని టాక్ నడుస్తోంది. నేటి వరకు ఈ రెండు డిమాండ్లపై ఎలాంటి క్లారిటీ రాకపోవడం.. మొదటి జాబితాలో తన పేరు గానీ.. భార్య పేరు గానీ రాకపోవడంతో రాజగోపాల్ హర్ట్ అయ్యారట... అందుకే సొంతగూటికి చేరాలని కోమటిరెడ్డి ఫిక్సయ్యాడని.. ఇక్కడైతే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్పినా నడుస్తుందని.. కచ్చితంగా అనుకున్న స్థానం నుంచి పోటీ చేయవచ్చని రాజా భావించి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని టాక్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం బీజేపీకి బిగ్ షాకేనని చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి తనకు, తన భార్యకు టికెట్లు ఇవ్వాలని కేసీ వేణుగోపాల్ ముందు ప్రతిపాదన ఉంచారు. మునుగోడుతోపాటు గజ్వేల్ నుంచి కూడా పోటీ చేసేందుకు తాను సిద్ధమని అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories