Maha Shivaratri 2021: శివపూజకు ముస్తాబైన వరంగల్ ఏకశిలానగరం..

Warangal Ekasila Nagaram Ready to Maha Shivaratri Pooja 2021
x

ఇమేజ్ సోర్స్: మనతెలంగాణవర్డ్.కం

Highlights

Maha Shivaratri 2021: కాకాతీయులు నిర్మించిన శివాలయాలన్నీ శిల్పకళారంజితంగా, ఇటు పర్యాటకంగాను ప్రసిద్దికెక్కాయి.

Maha Shivaratri 2021: ఓరుగల్లు.. కాకతీయ చక్రవర్తులు ఏలిన అద్వితీయమైన ఏకశిలానగరం. చెప్పాలంటే తమ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటూ అడుగడుగునా జలాశయాలు తవ్వించారు. అదే సమయంలో ప్రతీచోటా శివాలయాలు కట్టించారు. శివాలయాలే కాదు.. శివకేశవులకు బేధం లేకుండా త్రికూటాలయాలు, పంచకూటాలయాలు నిర్మించారు. తమ ఆరాధ్యదైవమైన పరమేశ్వరుడిని పూజించడానికి ఎక్కడ ఉంటే అక్కడ అనువుగా శివాలయాలు నిర్మించుకోవడంతో ఓరుగల్లులో వీధికోశివాలయమన్నట్లుగా శివాలయాల నిర్మాణం జరిగింది.

వరంగల్‌ని పాలించిన కాకతీయులు, చాణుక్యులు...

వరంగల్‌ రాజధానిగా చేసుకుని పాలించిన కాకతీయులు, చాణుక్యులు తమ ఏలుబడిలో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు 11వేల దేవాలయాలు నిర్మించారు. అందులో.. ఒక్క వరంగల్‌లోనే మూడు వేలకుపైగా దేవాలయాలున్నట్లుగా అంచనా. ఇన్ని దేవాలయాలు ఉన్న ప్రాంతం ఇదే కావడం బహుశా దేశంలోనే ఇదొక్కటే కావచ్చంటారు చరిత్రకారులు. అయితే ఈ 3వేల దేవాలయాల్లో ఇప్పటివరకు మనుగడలో ఉన్నవి 2వేల 162 కాగా.. దేవాదాయశాఖ ఆధీనంలో 108 దేవాలయాలు ఉన్నాయి.

వేయిస్తంభాల గుడి, సిద్ధేశ్వరాలయాల్లో శివరాత్రి జాగారం...

కాకతీయులు నిర్మించిన వేయిస్తంభాల దేవాలయం, ఐనవోలు మల్లన్న, సిద్ధేశ్వరాలయం, కాశీవిశ్వేశ్వరాలయం, రామప్పగుడి, జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వరస్వామి ఆలయం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో చారిత్రక కట్టడాలన్నీ నేటికి అద‌్భుత కళాఖండాలుగా దర‌్శనమిస్తున్నాయి. కొన్ని ప్రత్యేక దేవాలయాల్లో మాత్రం చిన్నచిన్న లింగాలు ఉండి పరమపవిత్రంగా, మహిమాన్వితంగా చెప్పుకోవడం కనిపిస్తుంది. అయితే భక్తులు ఎక్కువగా వేయిస్తంభాల గుడి, సిద్ధేశ్వరాలయాల్లో శివరాత్రి జాగారం చేస్తుంటారు.

దాదాపు 8 నుండి 10 అడుగుల ఎత్తులో శివలింగాలు

కాకతీయులు ప్రతిష్ఠించిన శివలింగాలన్నీ దాదాపు 8 నుండి 10 అడుగుల ఎత్తులో గంభీరంగా కనబడతాయి. పానవట్టాలు చతురస్రాకారంలో ఉంటాయి. గర్భాలయం పైకప్పుమీద ఓ చక్రాన్ని చిత్రించడం ప్రత్యేకం. కాకాతీయులు నిర్మించిన శివాలయాలన్నీ శిల్పకళారంజితంగా ఉండడమే కాకుండా అటు ఆధ్యాత్మికంగా.. ఇటు పర్యాటకంగా ప్రసిద్దికెక్కాయి. శివరాత్రి వేళ శివాలయాలకు వెళ్లి అభిషేకాలు చేయడంతో పాటు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు.

ఐనవోలు మల్లికార్జున స్వామి, కొమురవెల్లి మల్లన్న..

ముఖ్యంగా ఐనవోలు మల్లికార్జున స్వామి, కొమురవెల్లి మల్లన్న, గట్టు మల్లన్న, కొత్తకొండ వీరభద్రస్వామి.. ఇలా అన్నీ జాతరలు శివరాత్రి వేళ జానపదుల సంచారంతో ఘల్లుఘల్లుమంటాయి. పెద్దపట్నాలు, చిన్నపట్నాలతో ఒగ్గు పూజారాలు బిజీగా గడుపుతారు. మూడు నెలలపాటు కొన్నిచోట్ల జాతరలు జరిగితే.. శివరాత్రి జాతరలు ప్రతీచోట నిర్వహిస్తారు. శివరాత్రి వేళ ఏకాదశరుద్రాభిషేకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.

హన్మకొండ గుట్ట చుట్టుపక్కల కొలువుదీరిన అష్టభైరవులు...

హన్మకొండ గుట్ట చుట్టుపక్కల ప్రాంతంలోనే అష్టభైరవులు కొలువుదీరారు. అంతేకాదు.. అనేకమంది మైలార్‌ దేవుళ్లు, వీరభద్రస్వామి ప్రతిమలు కాకతీయుల ఆలయాల్లో అడుగడుగునా దర్శనమిస్తుంటాయి. ప్రధానంగా కాకతీయుల ఆలయాలు బహుదేవతలకు నిలయాలై, భిన్నవర్గాలను ఏకం చేసే సందేశాన్ని అందించాయి. వర్గాల మధ్య పరస్పర గౌరవాన్ని పెంపొందించడానికి ఇవి ప్రధాన కేంద్రాలుగా పనిచేశాయి. మొత్తానికి కాకతీయలు నిర్మించిన ఆలయాలు జాతి వారసత్వ వైభవానికి పెట్టనికోటలు. చరిత్ర మిగిల్చివెళ్లిన విశిష్ట సంపదలు.

Show Full Article
Print Article
Next Story
More Stories