ఆదిలాబాద్ జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు

Viral Fevers Spread in Adilabad District
x

ఆదిలాబాద్ జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు

Highlights

Adilabad: డెంగ్యూ, మలేరియాతో ఏజెన్సీ విలవిల

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వీటికి తోడు ఏజెన్సీలో డెంగ్యూ, మలేరియాతో జనం విలవిల్లాడుతున్నారు. దీంతో వైద్యఆరోగ్య శాఖ ఉక్కరి బిక్కిరవుతోంది. ఇటీవల తీవ్ర జ్వరంతో ఒక విద్యార్థి మృతిచెందడం పరిస్థితికి అద్దం పడుతోంది.

ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా జిల్లాలో ఒక్కసారిగా విజృంభించడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రభలడంతో.. గిరిజనులు జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇక ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా విషజ్వరాలతో విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల్లోని స్టూడెంట్స్ డయేరియాతో ఆసుపత్రిలో చేరగా.. ఒక విద్యార్థి జ్వరంతో మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది. బావుల్లోకి వరదనీరు చేరడంతో, ఆ నీరు కాస్తా కలుషితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత లోపించడం, మిషన్ భగీరథ పైపులైన్లు అస్తవ్యస్తంగా మారడంతో... ప్రజలకు మంచినీరు అందక బావులు, బోరు బావులలోని కలుషితనీరు సేవించడంతో, రోగాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు సకాలంలో స్పందించక పోవడంతో జిల్లాలోని ఏజెన్సీ వాసులకు తిప్పలు తప్పడం లేదు.

ఆదిలాబాద్ జిల్లాలో మలేరియా, టైఫాయిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో వైద్యఆరోగ్యశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. రెండేళ్ల క్రితం జిల్లాలో డెంగీ విజృంభించి వందలాది మంది ఆసుపత్రి పాలు కాగా.. పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడిన సందర్భాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో మరోసారి డెంగీ విజృంభిస్తుండడంతో జిల్లా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికపై పారిశుధ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. అయితే వైద్యఆరోగ్యశాఖ నిపుణులు మాత్రం వాతావరణ మార్పులు, నీటి కారణంగా ప్రజలు డయేరియా బారిన పడుతున్నారని చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం అనారోగ్య కారణాలతో ప్రతి రోజు సగటున 500నుంచి 600 మంది వివిధ ఆస్పత్రి పాలవుతున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా వ్యాధులు చుట్టుముట్టడంతో జిల్లాలోని ఆస్పత్రులపైన ఒత్తిడి పెరిగింది. జిల్లాలో వరదల కారణంగా అంటువ్యాధులు ప్రభలడంతో అధికారులు అప్రమత్తమం అయ్యారు.


Show Full Article
Print Article
Next Story
More Stories