పుట్టింటికీ రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి అంటూ, బీజేపీలో కొత్త సాంగ్ యమ జోరుగా వినిపిస్తోంది. పాటను పసందుగా వింటున్న ఆ మహిళా నాయకురాలు కూడా,...
పుట్టింటికీ రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి అంటూ, బీజేపీలో కొత్త సాంగ్ యమ జోరుగా వినిపిస్తోంది. పాటను పసందుగా వింటున్న ఆ మహిళా నాయకురాలు కూడా, ఎప్పుడెప్పుడు పుట్టింటికి వెళదామా అని తెగ ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఘర్‌వాపసీ గురించి ఆరాటపడుతున్న ఆ వుమన్ లీడర్ ఎవరు?
ఆమె మాట సంచలనం. ఆమె బాట సంచలనం. ఆమె చూపు సంచలనం. ఆమె రాజకీయ మలుపు సంచలనం. ఫైర్ బ్రాండ్‌కే బ్రాండ్ అంబాసిడర్ ఆమె. ఆమె మౌనం కూడా సంచలనమే. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్-బీజేపీ హోరాహోరి సాగుతున్న టైంలో, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి-విజయశాంతిల భేటి కూడా సంచలనమవుతోంది.
కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు విజయశాంతి. పార్టీ నాయకులతో అంటిముట్టనట్టుఉంటున్నారు. ఇటు గాంధీభవన్ కు కూడా రావడము లేదు. పీసీసీ రేసు జోరుగా సాగుతున్న టైంలోనూ, రాములమ్మ అలికిడి అస్సల్లేదు. దుబ్బాక ప్రచారంలోనూ ఆమె కనపడ్డం లేదు. కాంగ్రెస్ నాయకుల తీరుపట్ల అలిగినట్టు కనిపిస్తున్న రాములమ్మ, ఇలాంటి టైంలోనే బీజేపీ నేతలతో భేటి కావడం చర్చనీయాంశమవుతోంది.
రాజకీయాల్లో చేరి తనదైన పంథాలో గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పని చేయడమే కాదు సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని కూడా స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. కేసీఆర్‌కు చెల్లెలుగా పేరు తెచ్చుకున్న ఆమె, కొన్నాళ్లకు ఆయనతో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. అయితే, అప్పటి ప్రచారంలో కొన్ని సభల్లో మాత్రమే పాల్గొని టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత విజయశాంతి రాజకీయాల్లో సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన విజయశాంతి, మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరుతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో విజయశాంతి నటనకు ప్రశంసలు లభించాయి.
అయితే, సరిలేరు నీకెవ్వరు సక్సెస్ ఊపు మీదున్న విజయశాంతికి, కాంగ్రెస్‌లో మాత్రం తనపట్ల అలాంటి జోష్ మాత్రం కనపడలేదు. తనకు ఏమాత్రం గౌరవం లేదన్నది ఆమె బాధ. కనీసం పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానంలేదన్నది రాములమ్మ రుసరుస. గ్రూపు రాజకీయాలతో తనను సైడ్‌ట్రాక్ చేస్తున్నారన్నది ఆరోపణ. కొత్త ఇంచార్జీ ఠాకూర్ వచ్చిన తర్వాత కూడా ఆయనతో మీటింగ్ కాలేదు. మొత్తానికి ఒకటి క్లియర్. విజయశాంతికి కాంగ్రెస్‌లో ఉండటం ఇష్టంలేదు. ఈ నేపథ్యంలోనే, కిషన్ రెడ్డి-విజయశాంతిల సమావేశం ఆసక్తి కలిగిస్తోంది.
విజయశాంతి రాజకీయ ఆరంగేట్రమే బీజేపీ. ఇప్పటికీ జాతీయస్థాయి నేతలతో ఆమె పరిచయాలు చెక్కుచెదరలేదు. గతంలోనే ఆమె కాషాయతీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగినా, తమిళనాడులో తన స్నేహితురాలు శశికళను బీజేపీ ఇబ్బందిపెడుతోందని, అందుకే ఆ పార్టీలోకి వెళ్లనని చెప్పారు. అయితే, రేపోమాపో శశికళ జైలు నుంచి విడుదలకాబోతున్నారు. రాజకీయం మారుతోంది. ఇదే సమయంలో, తెలంగాణ కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన డీకే అరుణ సైతం బీజేపీలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షురాలయ్యారు. డీకే అరుణ-విజయశాంతిలు చాలా క్లోజ్. దీంతో విజయశాంతిని సైతం కమలంలోకి రావాలని అరుణ ఆహ్వానిస్తున్నారట. కానీ రాములమ్మలో సందిగ్దమే వుందట. ఈ సందిగ్దాన్ని క్లియర్ చేసేందుకే అన్నట్టుగా, కిషన్ రెడ్డి స్వయంగా విజయశాంతితో చర్చలు జరిపారట. దుబ్బాక ఎన్నికల టైంలోనే, రాములమ్మను కిషన్ రెడ్డి కలవడం, ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే, మెదక్ ఎంపీగా నాడు చక్రంతిప్పారామె. మొత్తానికి విజయశాంతి కమలం గూటికి వెళ్లడం ఖాయమని అర్థమవుతోంది. కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు వేగలేక, ఘర్‌వాపసీనే మేలని భావిస్తున్నట్టున్నారు విజయశాంతి. చూడాలి ఏమవుతుందో.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire