Venkaiah Naidu About Mother Tongue: మన సంస్కృతి-సంప్రదాయాలకు మన అస్తిత్వానికి మాతృభాషే పట్టుకొమ్మ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్...
Venkaiah Naidu About Mother Tongue: మన సంస్కృతి-సంప్రదాయాలకు మన అస్తిత్వానికి మాతృభాషే పట్టుకొమ్మ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం, తెలుగు అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం 'జ్ఞానసముపార్జన మాధ్యమం: మాతృభాష' ఇతివృత్తంతో జరిగిన వెబినార్‌ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యలో తెలుగు తప్పనిసరిగా ఒక విషయంగా ఉండటం వల్ల విద్యార్థుల్లో మాతృభాషపై ఆసక్తిని, ప్రాథమిక విద్యాభ్యాసం కచ్చితంగా మాతృభాషలోనే జరగడం, వివిధ విషయాల గ్రహణశక్తిని పెంపొందింపజేయవచ్చన్నారు. మాతృభాషతోపాటు ఇతర భాషలు ఎన్నయినా నేర్చుకోవచ్చు. ఎన్ని భాషలు ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువ మంచిది అని ఆయన అన్నారు. 2017 వరకు నోబెల్ బహుమతి (శాంతి బహుమతి మినహా) పొందినవారిలో 90 శాతానికి పైగా మాతృభాషలో విద్యనభ్యసించే దేశాల వారేనని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. చిన్నారుల్లో సృజనాత్మకత పెరగడానికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విజ్ఞానశాస్త్రాన్ని (సైన్స్) మాతృభాషలో బోధించాలని చెప్పారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
విద్యారంగంతోపాటు పరిపాలన, న్యాయ, పరిశోధన ఇతర రంగాల్లో మాతృభాష వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం, కొత్త పదాల సృష్టి జరిగినపుడే తల్లిభాషను పరిరక్షించుకోగలమని ఆయన తెలిపారు. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేల ఫలితాలను గమనిస్తే ఈ విషయం మనకు బాగా అవగతమవుతుంది'అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఆంగ్లభాషలో విద్యాభ్యాసం ద్వారానే అభివృద్ధి జరుగుతుందని అనుకోవడం సరికాదు. వివిధ దేశాధినేతలు మన దేశానికి వచ్చినపుడు వారు వారి మాతృభాషలోనే సంబాషిస్తారని, పక్కనున్న అనువాదకులు దీన్ని అనువాదం చేస్తారని, వారికి ఆంగ్ల భాషలో పరిజ్ఞానం ఉన్నప్పటికీ వారి భాషకు వారు గౌరవం ఇస్తారని ఆయన గుర్తుచేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వివిధ దేశాల ఆవిష్కరణల సామర్థ్యాన్ని అత్యంత శాస్త్రీయంగా విశ్లేషిస్తుందన్నారు. ఆ తరువాత ఏటా నివేదిక ఇచ్చే 'గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్', 'బ్లూమ్‌బర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్' జాబితాల్లోనూ ఉన్నతస్థానాల్లో ఉన్న దేశాల్లో 90 శాతానికి పైగా మాతృభాష మాధ్యమం ద్వారానే చదువుకుంటాయన్నారు. 'అన్ని భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా'అన్న కాళోజీ నారాయణరావుగారి మాటను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు.
మాతృభాషకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గౌరవానికి ఇది నిదర్శనమన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా విదేశాల్లోనూ హిందీలోనే సంభాషిస్తారని ఆయన అన్నారు. అయినా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆదరణ పొందిన నేతల్లో ఒకరిగా నిలిచారని ప్రస్తావించారు. ఇస్రో చంద్రయాన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న మేల్‌స్వామి అన్నాదురై విజ్ఞానశాస్త్రం, సాంకేతిక అంశాలపైన లోతైన అవగాహన పెంచుకోవడానికి తన మాతృభాష తమిళంలో ఇంటర్మీడియట్ వరకు చదివడం వల్లనే సాధ్యమైందన్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
ప్రసార, ప్రచార మాధ్యమాలు కూడా మాతృభాషకు వీలైనంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. పాత పదాలను పునర్వినియోగంలోకి తీసుకురావడంతోపాటు కొత్త పదాలను సృష్టించడంపై దృష్టిపెట్టాలన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఉపరాష్ట్రపతి సూచించారు. ఇలాంటి ప్రయోగాల ద్వారానే భాషతోపాటు పత్రికల మనుగడ సాధ్యమవుతుందన్నారు. కాశీనాథుని నాగేశ్వరరావు.. నైట్రోజన్‌ను నత్రజని అని, ఆక్సీజన్‌ను ప్రాణవాయువని, ఫొటో సింథసిస్‌ను కిరణజన్య సంయోగక్రియ అనే అద్భుతమైన పదాలను సృష్టించి తెలుగు ప్రజలకు పరిచయం చేశారని పేర్కొన్నారు. భావాన్ని వ్యక్తపరిచేందుకు భాష అవసరమని అందులోనూ మాతృభాషలోనైతే భావాన్ని మరింత స్పష్టంగా వ్యక్తపరచగలమన్నారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు 'జ్ఞాన సముపార్జనకు మాతృభాష ఎంతటి గొప్ప మాధ్యమమో'వివరిస్తాయన్నారు. భాషాభివృద్ధికి, కొత్త పదాల సృష్టికి వర్సిటీలు వేదికగా నిలిచి మిగిలిన వారిని ప్రోత్సహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య పొదిలి అప్పారావు, తెలుగు భాషాభిమాని కేఎల్ వరప్రసాద్ రెడ్డి, తెలుగు అకాడమీ డైరెక్టర్ ఎ.సత్యనారాయణ రెడ్డి, డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి, విశ్వవిద్యాలయ తెలుగు విభాగం అధిపతి ఆచార్య అరుణ కుమారి, తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న భాషాకోవిదులు, విషయ నిపుణులు, శాంతా బయోటెక్ ఫార్మా కంపెనీ చైర్మన్, తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు, ఈ సదస్సు నిర్వాహకురాలు ఆచార్య డి.విజయలక్ష్మితోపాటు విశ్వవిద్యాలయ తెలుగు విభాగం ఆచార్యులు, విద్యార్థులు, భాషాభిమానులు పాల్గొన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire