బంగ్లాకు ఇందురు పసుపు..పెరిగిన పసుపు ధర

బంగ్లాకు ఇందురు పసుపు..పెరిగిన పసుపు ధర
x
Highlights

పచ్చ బంగారానికి ఆదరణ పెరిగింది. పసుపు ధర క్రమంగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా పసుపుకు డిమాండ్ పెరగటంతో పంట ఎగుమతి మొదలైంది. ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో...

పచ్చ బంగారానికి ఆదరణ పెరిగింది. పసుపు ధర క్రమంగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా పసుపుకు డిమాండ్ పెరగటంతో పంట ఎగుమతి మొదలైంది. ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో రైళ్ల ద్వారా పసుపును విదేశాలకు తరలిస్తున్నారు. దీంతో వాణిజ్య పరంగా పసుపు వ్యాపారానికి ఊతం లభించనుండగా..అటు రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పసుపు ఎగుమతులకు ఇందూరు కేంద్రంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో పండిన పసుపు విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఎగుమతి దారులు పరిసర జిల్లాల ట్రేడర్లు నుంచి సేకరించిన పసుపును బంగ్లాదేశ్ కు తరలిస్తున్నారు. నిజామాబాద్ నుంచి పసుపును రైళ్లో తరలించేలా రైల్వే శాఖ అనుమతి ఇవ్వటంతో వ్యాగన్లలో పసుపు తరలిస్తున్నారు. ఈనెల 21 నుంచి 84 వ్యాగన్లలో రెండు రైళ్ల ద్వారా పసుపు ఎగుమతి చేశారు.

మరో రెండు రైళ్లలో పసుపు తరలించేందుకు సిద్ధమవటంతో వ్యాపారులు బుకింగ్‌ చేసుకున్నారు. ఇక అంతర్జాతీయంగా పసుపుకు డిమాండ్ పెరగడంతో పసుపు క్రయ విక్రయాలు పుంజుకున్నాయి. పసుపు ధర కూడా క్వింటాల్ కు 500 నుంచి 1000 రూపాయల వరకు పెరిగింది.

నిజామాబాద్ జిల్లాలో గతేడాది 36వేల ఎకరాలకు పైగా పసుపు సాగవగా జగిత్యాల, నిర్మల్ లో 50వేల ఎకరాలు దాటింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఏటా 8 నుంచి 10లక్షల క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే గతంలో ఈ పసుపును ఎగుమతి చేయాలంటే ముంబై, కోల్‌కతాకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడి నుంచి రైళ్లో ఎగుమతి చేసేవారు. ఈ విధానంలో అధిక వ్యయంతో పాటు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటం శుభపరిణామమంటున్నారు అధికారులు.

పసుపు పంట బంగ్లాదేశ్ కు ఎగుమతి కావడంతో రేట్లు పెరిగాయి. ఐతే రైతులు ఈ పాటికే పంట మొత్తం అమ్ముకోవడంతో కొద్ది మంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరనుంది. అయితే రాబోయే కాలంలో పసుపు పంటకు మరింత డిమాండ్ పెరిగేందుకు ఎగుమతులు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు.



Show Full Article
Print Article
Next Story
More Stories