Bandi Sanjay: హైడ్రామా మధ్య బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం, అరెస్ట్ చేసి..

TS Police Stopped the Bandi Sanjay Jagarana Deeksha and Arrested Him | Telangana News
x

Bandi Sanjay: హైడ్రామా మధ్య బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం, అరెస్ట్ చేసి..

Highlights

Bandi Sanjay: పోలీస్ స్టేషన్‌లోనే దీక్ష కొనసాగించిన బండి సంజయ్...

Bandi Sanjay: అర్ధరాత్రి హైడ్రామా మధ్య తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కరీంనగర్‌లోని కార్యాలయంపై దాడి చేసి బండి సంజయ్‌తోపాటు పలువురిని పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. పోలీసులను అడ్డుకున్న కార్యకర్తలపై లాఠీ ఝుళిపించారు. దీంతో బీజేపీ కార్యాలయం దగ్గర హైటెన్షన్ వాతావారణం కనిపించింది.

ఈ క్రమంలో బండి సంజయ్‌ తలకు గాయమై రక్తం కారుతున్నా పట్టించుకోకుండా ఆయనను తీసుకెళ్లి పోలీసులు వ్యాన్‌ని ఎక్కించారు. అరెస్టు చేసిన బండి సంజయ్‌ను మానకొండూర్ పోలిస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు.. అరెస్ట్ తర్వాత బండి సంజయ్ మానకొండూర్‌ పోలీస్ స్టేషన్‌లోనే దీక్ష కంటిన్యూ చేశారు. తనను అరెస్ట్ చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బండి సంజయ్. పోలీసులు.. ప్రభుత్వ గుండాల్లా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు.

తన క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి దాడి చేసే పర్మిషన్ ఎవరిచ్చారన్నారు. కోవిడ్ నిబంధనల పేరుతో అడ్డుకుంటున్నారని, కరోనా రూల్స్ అధికార పక్షానికి వర్తించవా అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బండి సంజయ్. ఇక.. బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. అరెస్టును తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. పార్టీ కార్యాలయంలో కూర్చుని, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు కూడా.. ప్రతిప‌క్షాల‌కు లేదా అని ప్రశ్నించారు.

బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందన్నారు. ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఈటల హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. బండి సంజయ్ అరెస్ట్.. పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్‌ను నిరసిస్తూ ఇవాళ అన్ని మండలాల్లో బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించినట్టు ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తెలిపారు.

మరోవైపు.. బండి సంజయ్ దీక్షపై మంత్రి గంగుల ఫైర్ అయ్యారు. బండి సంజయ్‌ది జాగరణ దీక్ష కాదని, కోవిడ్ వ్యాప్తి చేసే దీక్ష అని మండిపడ్డారు. గొడవలు సృష్టించి, రాజకీయ లబ్ధి పొందడానికే బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారన్నారని ఆరోపించారు. కోవిడ్ నిబ్ధనలు పాటించే బాధ్యత బీజేపీ నేతలకు లేదా అని ప్రశ్నించారు. కరీంనగర్‌లో కోవిడ్ వ్యాప్తి చెందితే బండి సంజయ్‌దే బాధ్యత అన్నారు. ఎవరైనా కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు.

ఇదిలా ఉంటే.. బండి సంజయ్‌ దీక్షకు సంబంధించి మొత్తం 170 మందిని అరెస్ట్‌ చేసినట్లు కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. కొవిడ్‌ నిబంధనలకు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కల్పించినందుకు అరెస్ట్‌ చేసినట్లు సీపీ తెలిపారు. పోలీసులపై ఎదురుదాడి చేసినందుకు సంజయ్‌పై కేసు నమోదు చేసినట్లు సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories