గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది?

గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది?
x
Highlights

దుబ్బాక అసెంబ్లీ సీటు బీజేపీకి కోల్పోవడంతో గ్రేటర్‌ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బీజేపీ హైదరాబాద్‌ నగరంలో మరింత పుంజుకోకముందే ఎన్నికలు జరిపించాలని భావించారు.

కారు స్పీడ్‌కు కమలం అడ్డుపడింది. గులాబీ కారు మధ్యలో ఆగిపోయింది. బీజేపీ నేతల సర్జికల్‌ స్ట్రైక్స్‌ కొంతవరకు పనిచేశాయి. కేసీఆర్‌ వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది..? ఊహించని ఫలితాలకు కారణం ఏంటి..? ఢిల్లీ దండు కారణమా? వరద బాధితుల కోపమా.? వేగంగా పరుగులు తీస్తున్న గులాబీ కారుకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. ఏడేళ్ళుగా ఎదురులేకుండా దూసుకుపోతున్న కారు మధ్యలో ఆగిపోయింది. గ్రేటర్‌లో ఎందుకు మొరాయించింది.?

గతంలో కేవలం నాలుగు డివిజన్లే గెలిచిన కమలం ఈసారి కారు విజయానికి ఎలా గండి కొట్టగలిగింది? చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా పరిస్థితి ఎందుకు మారింది.? 150 డివిజన్లు ఉన్న హైదరాబాద్‌ మహానగరంలో గతంలో 99 సీట్లు టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. ఆనాడు బీజేపీ నాయకులు గ్రేటర్‌ సిటీని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఈసారి 100 సీట్లు గెల్చుకుంటామని గులాబీ దళం ప్రకటించింది. అయితే టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఊహించినట్లుగా ఫలితాలు రాలేదు. సొంతంగా మేయర్‌ పీఠం దక్కించుకోలేని పరిస్థితులు వచ్చాయి.

దుబ్బాక అసెంబ్లీ సీటు బీజేపీకి కోల్పోవడంతో గ్రేటర్‌ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బీజేపీ హైదరాబాద్‌ నగరంలో మరింత పుంజుకోకముందే ఎన్నికలు జరిపించాలని భావించారు. అందుకే ప్రతిపక్షాలు సిద్ధం కాకముందే అస్త్రశస్త్రాలన్నీ రెడీ చేసుకుని..ఎన్నికల నగరా మోగించారు గులాబీదళపతి. రెండు నెలలు ముందుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల మేలు జరగడానికి బదులుగా కీడు జరిగిందా.? ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలకు అనేక వందల కాలనీలు నీట మునిగాయి.

ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంత్రుప్తి ఏర్పడింది. వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి పది వేల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆ పరిహారం అందరికీ అందలేదని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మధ్యలో స్వాహా చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఇంతలో ఎన్నికల ప్రకటన వచ్చేసింది. వరద సాయం ఆగిపోయింది. మిగిలినవారికి ఈ నెల ఏడు నుంచి మళ్ళీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వరద సాయం, ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకంగా పనిచేసినట్లు సమాచారం.

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మొదలు...ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్‌...మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌...కర్నాటక ఎంపీలు..బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా..తదితర హేమా హేమీలంతా గ్రేటర్‌ నగరంపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశారు. నగరపాలక సంస్థ ఎన్నికలను జాతీయస్థాయి ఎన్నికలుగా మార్చేశారు కాషాయపార్టీ నాయకులు. పాతబస్తీలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్‌ జాతీయులు, రోహింగ్యాలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన కామెంట్స్‌..ప్రచారాన్ని హీటెక్కించింది. మత విద్వేషాలు రగులుతాయనే ఆందోళనా కనిపించింది. అందుకే ప్రశాంత నగరం కావాలా..? కర్ఫ్యూల నగరం కావాలా అనేది నిర్ణయించుకోండని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

బీజేపీ మూల సిద్ధాంతమైన హిందుత్వ ఎజెండాను గ్రేటర్‌ నగరంలో కూడా ప్రయోగించింది. ఓటర్లను హిందువులుగా..ముస్లింలుగా పరిగణించింది. అందుకే తమకు గ్రేటర్‌ పీఠం అప్పగిస్తే పాతబస్తీలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామన్నారు బండి సంజయ్‌. దీనికి అనుగుణంగానే జాతీయ నాయకులు అనేకమంది హైదరాబాద్‌ ఎన్నికలపై కేంద్రీకరించారు. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో పనిచేశారు. మరోవైపు వరద బాధితుల ఆక్రోశం. ప్రభుత్వం మీదున్న అసంతృప్తి..ఇవన్నీ కలిపి టీఆర్‌ఎస్‌ దూకుడుకు కళ్ళెం వేశాయంటున్నారు విశ్లేషకులు. ఇంకోవైపు కాంగ్రెస్‌కు సీట్లు రావనే ప్రచారంతో...సంప్రదాయక కాంగ్రెస్‌ ఓట్లన్నీ ఈసారి బీజేపీకి వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను దెబ్బతీసిన ఫలితమే...ఆ స్థానాన్ని కమలం పార్టీ భర్తీ చేసిందంటున్నారు. టీఆర్‌ఎస్‌ భవిష్యత్‌కు గ్రేటర్‌ ఫలితాలు ఒక హెచ్చరికగా విశ్లేషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories