Nagarjuna Sagar: ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్‌ సరికొత్త వ్యూహాం

TRS New Strategy for Nagarjuna Sagar By-Elections
x

తెరాస (ఫైల్ ఫోటో)

Highlights

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్‌ సరికొత్త వ్యూహానికి పదునుపెడుతోంది. 30వ తేదీన నామినేషన్ల దాఖలుకు గడువు కావడంతో అదే రోజు అభ్యర్థి పేరును బయటపెట్టాలని చూస్తోంది. రాజకీయంగా నువ్వా? నేనా? అనే రీతిలో తలపడుతున్న అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సాగర మథనం చేస్తున్నాయి.

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎలాగైనా తమ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. నాగార్జున సాగర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా జానారెడ్డి బరిలోకి దిగుతున్నారు. 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య విజయం సాధించారు. నోముల హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని తిరిగి తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్, తమ సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకోవాలని టీఆర్‌ఎస్‌ వ్యూహాలకు పదునుపెట్టాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి జానారెడ్డి అభ్యర్థిత్వం మాత్రమే తేలగా.. టీఆర్‌ఎస్, బీజేపీలు ఇంకా తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు.

నామినేషన్ల దాఖలుకు ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. రాజకీయ కారణాలు, సామాజిక కోణాలను పరిగణలోకి తీసుకుంటున్న అధికార టీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థిని అదే రోజు ప్రకటించాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. టీఆర్‌ఎస్‌ ప్రకటించే అభ్యర్థిని బట్టి.. దానికి అనుగుణంగా తమ క్యాండెట్‌ను ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలూ చివరి రోజు వరకు వేచి చూస్తాయేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌ నుంచి పలువురు ఆశావహులు టికెట్‌ కోసం క్యూలో ఉన్నారు.

నోముల నర్సింహయ్య తనయుడితో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు కూడా టికెట్‌ ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డితో పాటు అదే సామాజిక వర్గం నుంచి మరొకరు లైన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్‌ ఇస్తుందో చూసి దానికి భిన్నంగా మరో సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తే తమకు లాభిస్తుందని బీజేపీ ఎదురు చూస్తోంది. దీంతో ఇరు పార్టీల అభ్యర్థుల ఖరారు, పేర్ల ప్రకటన చివరి రోజు వరకూ తేలేలా కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు.

అయితే టికెట్‌ ఆశించి భంగపడిన వారు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయకుండా అసంతృప్తులకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కూడా అభ్యర్థి ప్రకటనను ఆలస్యం చేయాలన్న వ్యూహంతోనే టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఉందని తెలుస్తోంది. టికెట్‌ రాని వారు బీజేపీ వైపు చూడకుండా అడ్డుకోవడంతోపాటు నామినేషన్‌ దాఖలు తర్వాత కేవలం రెండు వారాల సమయమే ప్రచారం మిగిలి ఉండడంతో రెబల్‌గా బరిలోకి దిగి అన్ని ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చేయాలన్న ఎత్తుగడతోనే ఆలస్యం చేస్తారని పేర్కొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories