Warangal: వరంగల్‌లో గవర్నర్‌కు మరోసారి అవమానం.. ప్రోటోకాల్ పాటించని గులాబీ శ్రేణులు

TRS Leaders Insulted Governor Tamilisai Soundararajan at Warangal Cultural Festival | Live News
x

Warangal: వరంగల్‌లో గవర్నర్‌కు మరోసారి అవమానం.. ప్రోటోకాల్ పాటించని గులాబీ శ్రేణులు

Highlights

Warangal: బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా కల్చరల్ మీట్...

Warangal: ఓరుగల్లు వేదికగా మరోసారి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అవమానం జరిగింది. జాతీయ సాంస్కృతిక ఉత్సవంలో TRS ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ పాటించకపోవడం విమర్శలకు దారితీసింది. ఇటీవల మేడారం జాతరలో గవర్నర్ ను స్వాగతించని మంత్రుల వైఖరినే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే, మేయర్ లు ఫాలో కావడంతో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ వివాదం మరింత హీటెక్కింది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవ ఆహ్వానంపై ఆ శాఖ ప్రోటోకాల్ పాటించినా పొలిటికల్ వార్ ముందు కల్చర్ లెస్ అయింది.

వరంగల్ లో జాతీయ సాంస్కృతిక ఉత్సవం జరుగుతోంది. కేంద్ర సాంస్కృతిక శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను గవర్నర్ తమిళ సై ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమాలలో వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు విచ్చేసి తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. తొలిసారిగా తెలంగాణలో జరుగుతున్న ఈ ఉత్సవం రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణమే అయినా.. ప్రభుత్వపరంగా ఎటువంటి స్పందనా లేకుండానే ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. గవర్నర్ తమిళసై ఉత్సవాలను ప్రారంభించడానికి వరంగల్ కు వచ్చిన నేపథ్యంలో ఆమెకు జిల్లా కలెక్టర్, సీపీలు స్వాగతం పలికారు తప్ప స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం ఆ దరిదాపులకైనా రాలేదు.

మంగళవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరైనా.. జాతీయస్థాయి కల్చరల్ మీట్ కు రావడానికి మాత్రం వారికి మనసొప్పలేదట. మేడారం జాతర సమయంలోనూ గవర్నర్ తమిళసై పర్యటనలో కలెక్టర్, ఎస్పీతో సహా అధికారపార్టీ ప్రజాప్రతినిధులెవరూ లేకపోవడం అప్పట్లో పెద్ద దుమారం లేపింది. ఈ విషయంలో అటు బీజేపీ, ఇటు టీఆరెస్ పోటాపోటీగా విమర్శించుకున్నారు. తిరిగి జాతీయ ఉత్సవాలను ప్రారంభించడానికి వరంగల్ కు వచ్చిన గవర్నర్ ను కనీస మర్యాదకైనా పలకరించడానికి అధికారపార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధానంగా మేయర్ గుండు సుధారాణి, స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇద్దరూ ఈ ప్రోగ్రామ్ కు రావలసి ఉండగా.. వారిద్దరూ రాజకీయ పరమైన వ్యవహారంతో కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వినయ్ భాస్కర్ కు స్వల్పంగా అనారోగ్యం కారణంగా రాలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతుంటే.. మేయర్ కు మాత్రం అధిష్టానం నుంచే సూచనలు ఉన్నాయట. ఈ కార్యక్రమం మొత్తం బీజేపీ కార్యక్రమంగా సాగుతున్నది తప్ప ఎక్కడా అధికారికంగా జరగడం లేదని, శోభాయాత్ర సైతం బీజేపీ నేతలే నిర్వహించారు తప్ప అధికార పార్టీని ఆహ్వానించలేదని టీఆర్ఎస్ నేతలు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో కల్చరల్ మీట్ బీజేపీ వర్సెస్ టీఆరెస్ గా జరుగుతున్న రచ్చకు మరోసారి వేదికైందనే చెప్పాలి. అంతేకాకుండా గవర్నర్ విషయంలోనూ వారు పార్టీ పరంగా చూశారు తప్ప ప్రథమ మహిళగా గుర్తించలేదన్న విమర్శలూ లేకపోలేదు. మరి ఈ వ్యవహారానికి టీఆర్ఎస్ నేతలు ఎలా సంజాయిషీ ఇచ్చుకుంటారో లేక తాము వ్యవహరించిన తీరును ఎలా సమర్థించుకుంటారో వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories