26న హైదరాబాద్ కు ప్రధాని నరేంద్రమోదీ.. ట్రాపిక్ దారి మళ్లిస్తున్నట్లు ప్రకటన...

Traffic Diversion in Hyderabad due to PM Narendra Modi Tour | Live News
x

26న హైదరాబాద్ కు ప్రధాని నరేంద్రమోదీ.. ట్రాపిక్ దారి మళ్లిస్తున్నట్లు ప్రకటన...

Highlights

Narendra Modi - Hyderabad: గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌, విప్రొ జంక్షన్ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు...

Narendra Modi - Hyderabad: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్‎‎కు రానున్నారు. ఇందులో భాగంగా ఆయన గచ్చిబౌలి ఐఎస్‌బీ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.

సెక్యూరిటీ ఏర్పాట్లలో భాగంగా ప్రధాని పర్యటన ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు.. గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ నుంచి విప్రొ జంక్షన్‌, ట్రిపుల్‌ ఐటీ నుంచి గచ్చిబౌలి మార్గంలో ఉన్న ఐటీ కంపెనీలు, ఇతర కార్పొరేట్‌ సంస్థల రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈరూట్లలో వచ్చే వారి కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.

ప్రధాని పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలపై వివారాలు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద మలుపు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక బొటానికల్‌ గార్డెన్‌ వద్ద ఎడమ వైపు మలుపు తీసుకుని కొండాపూర్‌ ఏరియా దవాఖాన, మసీద్‌ బండ, మసీద్‌ బండ కమాన్‌, హెచ్‌సీయూ డిపో రోడ్డు, లింగంపల్లి రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు.

అటు లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చే వాహనాలు హెచ్‌సీయూ డిపో, మసీద్‌ బండ కమాన్‌, మసీద్‌ బండ, కొండాపూర్‌ ఏరియా బొటానికల్‌ దవాఖాన, బొటానికల్‌ గార్డెన్‌, గచ్చిబౌలి జంక్షన్‌ మీదుగా మల్లించారు. విప్రో నుంచి లింగంపల్లి వైపు వచ్చే వాహనాలు.. విప్రొ జంక్షన్‌, క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపనపల్లి ఎక్స్‌ రోడ్డు, హెచ్‌సీయూ వెనుకాల గేటు, నల్లగండ్ల, లింగంపల్లి రోడ్డుకు డైవర్ట్ చేశారు. కేబుల్‌ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలు.. కేబుల్‌ బ్రిడ్జిపై ర్యాంపు, రోడ్డు నం.45 రత్నదీప్‌, మాదాపూర్‌ పీఎస్‌, సైబర్‌ టవర్స్‌, హైటెక్స్‌, కొత్తగూడ, బొటానికల్‌ గార్డెన్‌, గచ్చిబౌలి జంక్షన్‌ మార్గం మీదుగా దారి మల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో భారీ వాహనాల రాకపోకలను సిటీలోకి పూర్తిగా నిషేధం విధించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాని భద్రత దృష్ట్యా అమలు చేస్తున్న ఈఆంక్షలకు ప్రజలు, వాహనదారులు సహకరించాలని సూచించారు. ప్రధాన మంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు సిటీ పోలీసులు.. ముఖ్యంగా ఐఎస్‌బీ, గచ్చిబౌలి స్టేడియం వద్ద డ్రోన్‌ల నిషేధంతోపాటు 5 కిలోమీటర్ల వరకు డ్రోన్‌లు ఎగురవేయొద్దని సూచించారు. గచ్చిబౌలి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, గచ్చిబౌలి స్టేడియం, పరిసరాల చుట్టూ 5 కిలోమీటర్ల వరకు డ్రోన్‌ కెమెరాలు, మైక్రో లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, పారా గ్లెడర్స్‌ ఎగుర వేయడాన్ని నిషేధించారు.

ఈ మేరకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌/సైబరాబాద్‌ ఇన్‌చార్జి సీపీ సీవీ ఆనంద్‌ ఆంక్షలను విధించారు. ఈ ఆంక్షలు బుధవారం మధ్యాహ్నం 12 నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 188, 121, 121(ఏ), 287, 336, 337, 338 సెక్షన్ల కింద చట్టపరంగా చర్యలు ఉంటాయని సీపీ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories