Telangana Tornadoes: ములుగు అడవుల్లో గంటలో దాదాపు లక్ష చెట్లను నేలకూల్చిన టోర్నడోలు

Tornado Like Storm Ravages Medaram Forest Over 1 lakh Trees Uprooted
x

Telangana Tornadoes: ములుగు అడవుల్లో గంటలో దాదాపు లక్ష చెట్లను నేలకూల్చిన టోర్నడోలు

Highlights

టోర్నడోలు అంటే తీవ్రస్థాయిలో వచ్చే సుడిగాలులు. వీటిని సుడి గాలి తుపాన్ అని కూడా అంటారు.

టోర్నడోలు ములుగు జిల్లాలో బీభత్సం సృష్టించాయి. మేడారం అటవీ ప్రాంతంలో 50 వేలకు పైగా చెట్లు టోర్నడోల దెబ్బకు నేలకూలాయని మంత్రి సీతక్క ప్రకటించారు. ఆగస్టు 31 సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. 15 కి.మీ. పరిధిలోని 150 హెక్టార్ల విస్తీర్ణంలో తీవ్రమైన సుడిగాలులు చెలరేగడంతో చెట్లు విరిగిపడ్డాయని అటవీశాఖాధికారులు చెప్పారు. నల్లమద్ది, తెల్లమద్ది,జువ్వి, నేరేడు, మారేడు వంటి చెట్లు నేలకూలినట్టుగా అధికారులు గుర్తించారు.

టోర్నడోలు ఎలా ఏర్పడుతాయి?

టోర్నడోలు అంటే తీవ్రస్థాయిలో వచ్చే సుడిగాలులు. వీటిని సుడి గాలి తుపాన్ అని కూడా అంటారు. దట్టమైన మేఘాల నుంచి ఇవి దూసుకొస్తుంటాయి. ఆకాశంలో రెండు భిన్నమైన ద్రవ్యరాశులు డీకొంటే టోర్నడోలు ఏర్పడుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూమిపై ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తేమతో కూడిన గాలి పైకి వెళ్తుంది. అయితే పైన ఉన్న చల్లటి, పొడి గాలిని తాకినప్పుడు థండర్ క్లౌడ్స్ ఏర్పడుతాయి. ఇవి గాలిలో పైకి కదులుతాయి. దీన్ని అప్ డ్రాప్ట్ అంటారు. విభిన్న ఎత్తుల్లో గాలుల వేగం, దిశల్లో మార్పులతో ఈ అప్ డ్రాప్ట్ సుడి తిరగడం మొదలుపెడుతుంది. దిగువ వాతావరణంలో కొన్ని వేల అడుగుల పాటు ఉన్న ఈ వైరుద్యం గణనీయ స్థాయిలో ఉంటే టోర్నడోను కలిగించే సూపర్ సెల్ థండర్ క్లౌడ్స్ ఏర్పడుతాయి.

టోర్నడోలు గంటకు 180 కి.మీ లోపు గాలులతో 250 అడుగుల వైశాల్యంతో ఇవి ఉంటాయి. ఇవి గంటకు 480 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. ఏకధాటిగా టోర్నడో 100 కి.మీ దూరం వెళ్తాయి. ఇది ఏ మార్గంలో ప్రయాణిస్తే ఆ మార్గంలో తీవ్ర విధ్వంసం సృష్టిస్తాయి.

అమెరికాలోనే టోర్నడోలు ఎందుకు ఎక్కువగా వస్తాయి?

అమెరికాలో చుట్టుపక్కల సముద్రాలపై టోర్నడోలు ఏర్పడతాయి. అవి భూమిపైకి వస్తాయి.అక్కడ విశాల మైదానాలు ఎక్కువ . టోర్నడోలు వేగంగా తిరగడంతో పాటు బలం పెంచుకొనేందుకు వీలు కల్పిస్తుంది. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో చదునైన భూభాగం ఉంటుంది. ఇక్కడ ఉన్న గడ్డిభూములు, పొలాలు చాలా త్వరగా వేడెక్కుతాయి. దీంతో వెచ్చని గాలి పుడుతోంది. ఈ ప్రాంతాలకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి తేమ వస్తుంది. కెనడా నుంచి చల్లగాలి వస్తుంది. రాకీ పర్వతాలు, నైరుతిలోని ఎత్తైన ఎడారుల నుంచి వచ్చే పొడిగాలితో తీవ్రమైన తుఫానులు ఏర్పడుతాయి. ఇవే టోర్నడోల పుట్టుకకు కారణమౌతాయి.

ఇండియాలో టోర్నడోలు ఎందుకు రావు?

ఇండియాలో భారీగా పర్వతాలు, కొండలున్నాయి. ఇవి టోర్నడోలు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తాయి. టోర్నడోలు సాధారణంగా చల్లని గాలులు ఉండే ప్రాంతాల్లో ఏర్పడుతుంటాయి. మన దేశంలోని హిమాలయ పర్వతాలు ఇలాంటి గాలులను అడ్డుకుంటాయి. ఇండియాలో వాతావరణం వేడిగా, ఉక్కపోతగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో టోర్నడోలు రావు. ఏ ప్రాంతంలోనైతే వాతావరణ మార్పులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలతో పాటు వాతావరణంలో అస్థిరత ఎక్కువగా ఉండే చోట సుడిగాలులు వచ్చే అవకాశాలుంటాయి. ఇండియాలో ఆ పరిస్థితి లేదు. అందుకే టోర్నడోలు ఏర్పడవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

మేడారం అటవీ ప్రాంతంలో గంట వ్యవధిలో వచ్చిన తీవ్రమైన సుడిగాలులకు కారణాలు ఏమై ఉంటాయని అధికారులు పరిశీలిస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ గాలులు వచ్చాయ, లేక ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయమై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories