Top 6 News Of The Day: కవితకు బెయిల్.. కండిషన్స్ అప్లై.. మరో 5 టాప్ హెడ్‌లైన్స్

Top 6 News Of The Day: కవితకు బెయిల్.. కండిషన్స్ అప్లై.. మరో 5 టాప్ హెడ్‌లైన్స్
x
Highlights

1) కవితకు బెయిల్.. కండిషన్స్ అప్లై ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ, సీబీఐ కేసుల్లో మంగళవారం సుప్రీంకోర్టు...

1) కవితకు బెయిల్.. కండిషన్స్ అప్లై

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ, సీబీఐ కేసుల్లో మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈడీ తరపున ఏఎస్ జీ వాదించారు. గంటన్నరపాటు ఇరువర్గాలు వాదనలు వినిపించాయి. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం కవితకు బెయిల్‌ను మంజూరు చేశారు. రూ. 10 లక్షల పూచీకత్తుతో కోర్టు ఆమెకు బెయిల్‌ను మంజూరు చేసింది. 166 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న కవితకు, బీఆర్ఎస్ వర్గాలకు సుప్రీం కోర్టు తీర్పు ఎంతో ఊరటనిచ్చింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) హైడ్రా కమిషనర్ ఇంటికి భద్రత

హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసినా హైడ్రా పేరే వినిపిస్తోంది. అక్రమ కట్టడాలు, చెరువుల ఆక్రమణపై ఉక్కుపాదం మోపిన హైడ్రా.. ఇప్పటికే ఎన్నో నిర్మాణాలు కూల్చేసింది. మున్ముందు ఇదే పంథాలో ముందుకు వెళ్లేందుకు పక్కాగా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోహైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇంటివద్ద పోలీసులు భద్రత పెంచారు. ఈ మేరకు వెంగళ్‌రావునగర్‌ డివిజన్‌ మధురానగర్‌ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద సోమవారం ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు. నగరంలో చెరువులు, కుంటల్లో అక్రమ కట్టడాల తొలగింపును వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయనకు ఏమైనా ముప్పు ఏర్పడవచ్చనే అనుమానంతో ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది. ఇటీవల సినీనటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్‌- కన్వెన్షన్‌ కూల్చివేత తర్వాత బడా రాజకీయ నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రంగనాథ్‌ ఇంటి వద్ద భద్రత పెంచినట్లు తెలుస్తోంది.

3) సెప్టెంబర్‌ 17 నుంచి ప్రజాపాలన కార్యక్రమం

సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించనున్నారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాల సేకరిస్తారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు అందించనున్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

4) బండి సంజయ్‌కి ఎక్స్‌లో కేటీఆర్ కౌంటర్

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి కేటీఆర్ కౌంటరిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి.. సుప్రీం కోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది మీ స్థానానికి తగినది కాదని సూచించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణనలోకి తీసుకోవాలని కేటీఆర్ ఎక్స్‌ ద్వారా కోరారు. కవితకు బెయిల్ రావడంపై కాంగ్రెస్ పార్టీకి, న్యాయవాదులకు అభినందనలు అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ సెటైర్లు వేశారు. మీ అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయంటూ బీఆర్ఎస్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. దీంతో బండి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ట్వీట్ చేశారు కేటీఆర్.

5) పశ్చిమ బెంగాల్‌లో హై టెన్షన్

పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోల్‌కతాలోని ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఘటనను నిరసిస్తూ పశ్చిమబంగా ఛాత్రో సమాజ్ విద్యార్థి సంఘం నిరసనకు దిగింది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నబన్నా అభియాన్ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి విద్యార్థులను నియత్రించేందుకు యత్నించారు. హౌరా బ్రిడ్జి వద్ద విద్యార్థులు బారికేడ్లను బద్దలు కొట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు, వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. కోల్‌కతాలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

6) తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. వచ్చే 3 రోజులు వానలే వానలు

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని... దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం పేర్కొంది. పార్వతీపురం మన్యం జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలోని పలు చోట్ల మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లా, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories