Top 6 News of The Day: సిద్ధిపేటలో బీఆర్ఎస్ vs కాంగ్రెస్ హైటెన్షన్.. మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News of The Day: సిద్ధిపేటలో బీఆర్ఎస్ vs కాంగ్రెస్ హైటెన్షన్.. మరో 5 ముఖ్యాంశాలు
x
Highlights

రుణమాఫీ అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కారు ఘోరంగా విఫలమైందని హరీష్‌ రావు ఆరోపించారు. రాష్ట్రం నలుమూలలా లక్షలాది మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదని హరీష్ రావు అన్నారు.

100 శాతం రైతుల రుణాలు మాఫీ చేసేవరకు పోరాడుతాం :

Harish Rao: రుణమాఫీ అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కారు ఘోరంగా విఫలమైందని హరీష్‌ రావు ఆరోపించారు. ఆగస్ట్ 15వ తేదీలోగా 100 శాతం రుణాలు మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చారని.. కానీ ఇప్పటికీ రాష్ట్రం నలుమూలలా లక్షలాది మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదని హరీష్ రావు అన్నారు. రైతులు అందరికీ రుణమాఫీ చేయకుండానే నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అని చెబితే ఎలా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు.

మంత్రి జూపల్లికి సొంత పార్టీ నేతల నుంచే చేదు అనుభవం :

గద్వాల జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్‌ని గద్వాల నియోజకవర్గం పరిధిలోని చింతలపేట వద్ద కాంగ్రెస్ పార్టీ గద్వాల జిల్లా ఇంచార్జ్ సరిత తిరుపతి వర్గీయులు అడ్డుకుని కాన్వాయ్‌పైకి రాళ్లు రువ్వారు. తాము కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్నామని.. అలాంటిది తమకు చెప్పకుండా నిర్లక్ష్యం వహించి, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌కి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని మంత్రి జూపల్లిని నిలదీశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ వారు మాట వినకపోవడంతో చివరకు మంత్రి జూపల్లి సరిత తిరుపతి ఇంటికి వెళ్లి వారిని సముదాయించాల్సి వచ్చింది.

రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు .. నిలదీస్తే బెదిరింపులా ?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతుల రుణమాఫీ అవలేదు.. రైతుల బతుకు మారలేదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో రూ. 49,500 కోట్ల వరకు లెక్కలేసుకుని, కేబినెట్ భేటీలో రూ. 31 వేల కోట్లు అనుకుని, బడ్జెట్లో రుణమాఫీ కోసం రూ. 26 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు 3 విడతల్లోనూ కలిపి రైతులకు రూ. 17933 కోట్లు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. ఒకే విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు .. నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గేదే లేదు అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆడియెన్స్ థియేటర్స్‌కి రాకుండా మేమే తప్పు చేశాం అంటున్న దిల్ రాజు :

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు సినీ నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడియెన్స్ థియేటర్స్‌కి రాకపోవడానికి తమ వైఖరే కారణం అని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. సినిమా సక్సెస్ రేటుతో సంబంధం లేకుండా విడుదలైన నాలుగు వారాలకే ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడమే తాము చేసిన తప్పు అని దిల్ రాజు వ్యాఖ్యానించారు. అంత త్వరగా ఓటీటీలో సినిమాలు విడుదల చేయడం వల్ల మీరు థియేటర్ కి వచ్చే పని లేదు మేమే మీ ఇంటికి సినిమాకు తీసుకొస్తాం అనే సందేశం ఇచ్చామని.. అదే ఇప్పుడు సినిమాల థియేట్రికల్ రన్ పై దెబ్బ కొట్టిందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. రేవు మూవీ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొని మాట్లాడుతూ దిల్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు కనిపించే ట్రెండ్స్‌పై తన మనసులో మాటను చెప్పే దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.

విచారణకు సిద్ధం కానున్న సిద్ధరామయ్య :

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలాల కేటాయింపు విషయంలో భారీ కుంభకోణం జరిగింది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ కేసు విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రశ్నించేందుకు గవర్నర్ థావర్చంద్ గెహ్లట్ అనుమతి ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను మాత్రం సీఎం సిద్ధరామయ్య గతంలోనే ఖండించారు. కేవలం తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ప్రతిపక్షాలు తనకు ముడా స్కామ్‌కి లింకు పెడుతున్నాయని.. కానీ ఆ ఆరోపణలకు తాను భయపడే రకం కాదు అని స్పష్టంచేశారు. మరోవైపు సీఎం సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అభివృద్ధి పనుల కోసం ముడా చేపట్టిన భూసేకరణలో భాగంగా సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి కూడా తన స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. అందుకు నష్టపరిహారంగా పార్వతి స్థలం కోల్పోయిన ఏరియా కంటే అత్యంత ఖరీదైన ప్రాంతంలో అత్యంత ఖరీదైన స్థలాన్ని ఆమెకు ముడా కేటాయించిందనేది ప్రతిపక్షాల ఆరోపణ. సిద్ధరామయ్య తన పలుకుబడితో పావులు కదపడం వల్లే ఇది సాధ్యపడింది అని బీజేపి, జేడీ(ఎస్) ఆరోపిస్తున్నాయి.

సిద్ధిపేటలో బీఆర్ఎస్ vs కాంగ్రెస్ ఫ్లెక్సీల వార్ :

సిద్ధిపేటలో బీఆర్ఎస్ vs కాంగ్రెస్ జరుగుతున్న ఫ్లెక్సీ వార్ తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నందున హరీష్ రావు తాను చేసిన సవాల్ ప్రకారమే రాజీనామా చేయాలి అంటూ మైనంపల్లి అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిందే. అయితే, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ ఫ్లెక్సీలను చించేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధిపేటలో హరీష్ రావు క్యాంప్ ఆపీసుపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ ఏర్పాటు చేసిన కేసీఆర్ ఫ్లెక్సీలను సైతం చించేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్న ఇరువర్గాలను అదుపు చేసేందుకు భారీ సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories