భారత జాతీయోద్యమంలోనే ఒక విలక్షణమైన ఉద్యమం 'తెలంగాణా విమోచనోద్యమం'
అది పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దినం సొంతగడ్డపైనే పరాయివారిగా బతుకులీడుస్తున్న ప్రజలు జరిపిన యుద్ధం భూస్వాముల దౌర్జన్యాలు, నిజాం...
అది పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దినం సొంతగడ్డపైనే పరాయివారిగా బతుకులీడుస్తున్న ప్రజలు జరిపిన యుద్ధం భూస్వాముల దౌర్జన్యాలు, నిజాం రాజరిక దుర్మార్గ వ్యవస్థ, రజాకర్ల అమానుషాలు తెలంగాణను అణువణువునా పట్టిపీడించిన అన్ని దుర్మార్గాల నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందడానికి జరిగిన మహా సంగ్రామమది భారతదేశంలో హైదరాబాద్ సంస్థాన విలీనం చరిత్రాత్మకమైన ఉదంతం నిజాం నవాబు తోకముడిచి భారత్‌కు లొంగిపోయిన సందర్భం అసలు సెప్టెంబర్ 17న ఏం జరిగింది? హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా విలీనమైంది? ఓసారి గుర్తు చేసుకుందాం.
ఏ ఉద్యమమైనా అణచివేత నుంచి మొదలవుతుంది. బూర్జువా వ్యవస్థలు, భూస్వాముల దోపిడీని, దొరల పెత్తందారీ పోకడలను ఎదిరించి పుడుతుంది తెలంగాణ సాయుధ పోరాటం కూడా అలాంటిదే భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడితే ప్రత్యేక సంస్థానంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రం నిజాం నవాబుల దాష్టీకాన్ని, రజాకర్ల దురాగతాలను ఎదిరించి పోరాడింది.
తెలంగాణ అంటేనే ఉద్యమం. ఈ ఉద్యమ గోస ఈనాటిది కాదు నాడు నైజాం నవాబును తరిమి కొట్టడానికి ఏకంగా సాయుధ పోరాటమే చేసిన చరిత్ర కలిగిన ప్రాంతమిది. భారతదేశం మొత్తం బ్రిటీష్ వారి ఆధీనం నుంచి విడివడి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సాధించుకున్నా తెలంగాణ ప్రాంతానికి మాత్రం అప్పట్లో విమోచన కలగలేదు. నైజాం పాలకుల దాష్టీకం నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి పొందడానికి 1951 వరకూ ఉద్యమాలు జరిగాయి. విద్యార్ధులు, యువకులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు ఇలా సమాజంలో భాగస్వాములైన అన్ని వర్గాలు ఈ ఉద్యమంలో మమేకమైపోయారు. అడుగులో అడుగేశారు.
తెలంగాణ పట్ల ఆలోచన, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వెలికి తీయడంతో పాటూ, సాయుధ ఉద్యమంలో భాగస్వాములైన స్త్రీ మూర్తులలో కనపడిన చైతన్యం అప్పటి సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ, హైదరాబాద్ విమోచనలోనూ ముందుండి పాలుపంచుకున్నారు. తెలంగాణ తనువెల్లా, నిలువెల్లా గాయాలున్నాయి. నిజాం నవాబు రజాకార్ల అండతో హైదరాబాద్‌ను తెలంగాణను ఏలినప్పుడు ప్రజలపై జరిపిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు.. భూస్వాముల ఆగడాలు, పెత్తందారీ పోకడలను అన్నింటినీ భరించింది తెలంగాణ గడ్డ సత్యాగ్రహాల నుంచి సాయుధ పోరాటం వరకూ తెలంగాణ పోరాట గతిలో ఎన్నెన్నో ఆయుధాలు. మరెన్నో అస్త్రాలు మట్టి మనుషుల నుంచి మహావీరుల వరకూ అందరూ కదలి వచ్చారు. నిరుపేద సైతం పెత్తందారీ పోకడలపై పోరుసల్పి మహా వీరుడయ్యాడు. సామాన్య మానవులు, తమ అసాధారణమైన పోరాటగతితో మహానాయకులుగా రూపొందారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఉద్యమించారు. లెక్కలేనన్ని త్యాగాలు చేశారు. ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు.
అందుకే భారత జాతీయోద్యమంలోనే ఒక విలక్షణమైన ఉద్యమంగా తెలంగాణ సాయుధ పోరాటం కీర్తి పొందింది నిర్భంధాలను మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారు. నాయకులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. పిల్లా, పాపలనుంచి, మహిళలు, వృద్ధుల వరకూ చేతికి దొరికిన ఆయుధంతో శత్రువులను చీల్చి చెండాడారు. అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారు. నిజాం మిలటరీని, రజాకార్ మూకలను మట్టి కరిపించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 13 నెలలకు ఈ చీకటి సంస్థానానికి విమోచనం దొరికింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి స్వయంప్రతిపత్తి కలిగి ఉన్న రాజ్యం హైదరాబాద్ సంస్థానం నిజాం రాజుల పాలన కింద ఉన్న ఆ రాజ్యాన్ని భారత పాలకులు సైనిక చర్య ద్వారా 1948లో సెప్టెంబర్ 17న ఇండియన్ యూనియన్లో విలీనం చేసుకున్నారు. దీనికోసం అయిదురోజులు, వందగంటల పాటూ యుద్ధం జరిగింది. చివరకు నిజాం రాజు లొంగిపోయాడు ఇండియన్ యూనియన్ చేతుల్లో అధికారాన్ని అప్పగించాడు.
ఆ తర్వాత ఈప్రాంతం కొన్నాళ్లు మద్రాస్ రాష్ట్రంలో ఉండి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌తో కలసి కొత్త రూపు సంతరించుకుంది. కులీకుతుబ్‌షాహీలు రూపు దిద్దిన ఈ ప్రాంతం 200 ఏళ్లకు పైగా నిజాం రాజుల పాలనలో ఉండి ఇప్పుడు అస్తిత్వం కోసం ఆరాటపడుతోంది. మళ్లీ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతోంది. హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో విలీనం అవడాన్ని కొందరు విమోచన దినంగా పరిగణిస్తుండగా, మరికొందరు దీనిని విద్రోహమని, ఆక్రమణ అనీ అంటున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వేళ స్వతంత్ర్య రాజ్యంగా ప్రకటించుకుని, అంతర్జాతీయ సంస్థల గుర్తింపు పొందిన హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత ప్రభుత్వం బలవతంగా యుద్ధం చేసి, ఓడించి దురాక్రమించిందని ఇది విద్రోహమనీ మకొందరు వాదిస్తున్నారు. సెప్టెంబర్ 17న జరిపేది తెలంగాణ విమోచన ఉద్యమం కాదని, హైదరాబాద్ రాజ్య విమోచన దినోత్సవమని మరికొందరు అంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలను విలీనం చేసుకున్న ప్రాంతాలు విమోచన దినోత్సవాలను ఆయా రాష్ట్రాల్లో అధికారికంగానే నిర్వహిస్తున్నాయి.
నిజాం నవాబుపై భారత సైన్యం యుద్ధం చేసి హైదరాబాద్‌ను విలీనం చేసుకోవడంతో హైదరాబాద్ దేశంలో అంతర్భాగమైంది. అయితే ఆనాటి చారిత్రకఘట్టంపై ఎన్నో వివాదాలున్నాయి. తెలంగాణ చరిత్రలో ఇది కీలకమైన దినమని దీని ప్రత్యేకతను గుర్తించి ఉత్సవాలు జరుపుకోవడం వల్ల చరిత్రకు ప్రాధాన్యత ఏర్పడుతుందని అందుకే ఇది విలీనదినమని వాదించేవాళ్లూ ఉన్నారు. ఏమైనా 1948, సెప్టెంబర్ 17కు చరిత్రలో ఓ ప్రత్యేకత ఉంది ప్రస్తుత సమాజ పోకడలు ఎలా ఉన్నా ఆనాడు నిజాం నవాబులు, రజాకార్ల దాష్టీకాల నుంచి పొందిన విముక్తికి గుర్తుగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం మన గత చరిత్రను గుర్తించి, అమర వీరుల త్యాగాలకు గౌరవం ఇచ్చినట్లవుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికే హైదరాబాద్ స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్న ప్రత్యేక రాజ్యం విలీనం అయ్యాక ఆనాటి జ్ఞాపకాలు, చారిత్రక ఘట్టాలకు ప్రాధాన్యత ఏర్పడింది. నాటి ఘటనలు, చారిత్రక పరిస్థితులు, అధికార బదలాయింపు నేపధ్యాలు, ఇప్పుడు సుదీర్ఘమైన చర్చకు దారి తీస్తున్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire