పోలీసు శాఖలో పోస్టుల నియామకానికి అధికారుల చర్యలు..జనవరి నెలలో ప్రకటన విడుదలయ్యే అవకాశం..

పోలీసు శాఖలో పోస్టుల నియామకానికి అధికారుల చర్యలు..జనవరి నెలలో ప్రకటన విడుదలయ్యే అవకాశం..
x
Highlights

రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యువతకు కొంత ఊరటనిచ్చింది. అన్ని శాఖల్లో ఉద్యోగాల...

రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యువతకు కొంత ఊరటనిచ్చింది. అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో పోలీసుశాఖలో పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. జనవరి నెలలో ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సారి నియామక పద్ధతిని మరింత సరళం చేసేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందించాలని యోచిస్తున్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు.

పోలీసు శాఖలో ప్రస్తుతం 20వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు అధికారులు. 2018లో దాదాపు 16వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేశారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉద్యోగాల భర్తీ చేయాల్సి రావడంతో అందుకు తగ్గట్టుగా టెక్నాలజీ వినియోగంపై దృష్టిసారించారు. గత రెండు నియామకాల నుంచి పోలీసు ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశాక తమ పేరు తప్పుగా నమోదయిందని, కులం పేర్కొనలేదని చెబుతూ రకరకాల ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందించే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

అభ్యర్థులంతా ప్రత్యేక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌ నింపిన తర్వాత ఏమైనా తప్పులు దొర్లినా వెంటనే అక్కడే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అలాగే పోలీసు ఉద్యోగాల నియామకాలపై ఎలాంటి నిర్ణయాలున్నా ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి మేసేజ్‌ల రూపంలో తెలియజేయవచ్చు. అంతేకాకుండా అభ్యర్థులకు అవసరమయ్యే మరెన్నో విషయాలను యాప్‌లో పొందుపర్చొచ్చు. ఈ విధంగా ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసి దాని ద్వారా నియామక ప్రక్రియ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

మిగతా ఉద్యోగాల భర్తీతో పోల్చుకుంటే పోలీసు నియామక ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. టైమూ ఎక్కువ పడుతుంది. రాత పరీక్షలతో పాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలి. అన్నింటిలోనూ ఉత్తీర్ణత సాధించి ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. జనవరి నెలాఖరుకల్లా ప్రకటన విడుదల చేయగలిగితే నియామకాలు పూర్తిచేయడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత సంవత్సరం పాటు శిక్షణ కొనసాగుతుంది. ఈ లెక్కన చూసుకుంటే 2021 జనవరిలో ప్రకటన విడుదలైతే అర్హత పొందిన వారు 2022 ఏప్రిల్‌ తర్వాతే ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంటుంది. దీంతో వీలైనంత త్వరలోనే నియామక ప్రకటన జారీ చేయాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories