Telangana Congress: భట్టి మాటలా.. వట్టి మాటలా?

Telangana Senior Congress Leaders Took a Crucial Decision | Off The Record
x

Telangana Congress: భట్టి మాటలా.. వట్టి మాటలా?

Highlights

Telangana Congress: వచ్చే ఎన్నికలకు ఆ వ్యూహాలు ఫలిస్తాయా?

Telangana Congress: అది అసలే కాంగ్రెస్‌. ఒకరు ఎడ్డెం అంటే ఇంకొకరు తెడ్డం అంటారు. ఒకరు కాదు అంటే మరొకరు ఎందుకు కాదంటూ నిలదీస్తారు. కాంగ్రెస్‌ అంటేనే అంత! వ్యక్తిగత ప్రజాస్వామ్యం, పార్టీగతమైన స్వేచ్ఛ ఎక్కువ అంటారు. అలాంటి హస్తం పార్టీ ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. చింతన్‌ శిబిరంలో చింతల్లేని తీర్మానం చేసింది. సమాంతర పట్టాలపై కాంగ్రెస్‌ రైలు నడవడం కష్టమేనని తెలిసినా సీరియస్‌ డెసిషనే తీసుకుంది. అసలు హస్తం పార్టీలో అది సాధ్యమయ్యే పనేనా? ఇంతకీ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి?

ఆరునెలల ముందే అభ్యర్థుల ప్రకటన. అవును మీరు విన్నది నిజమే. ఆరునెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు. కీసరలో జరిగిన చింతన్‌ శిబిర్‌ తీర్మానాల సదస్సులో సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పైకి ఏదో అందరూ ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు కనిపిస్తున్నా అది ఎంత వరకు సాధ్యమన్న చర్చ జరుగుతోంది.

వచ్చే ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయటమే లక్ష్యంగా రెండు రోజుల పాటు సాగిన నవ సంకల్ప మేధోమధన సదస్సును దిగ్విజయంగా ముగించింది కాంగ్రెస్‌ పార్టీ. ఈ సదస్సుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరు కమిటీల్లో ఉన్న సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నివేదిక సిద్దం చేస్తున్నామన్న భట్టి విక్రమార్క ఉదయ్​పూర్​లో తీసుకున్న నిర్ణయాలను బూతుస్థాయికి తీసుకుపోడానికి రోడ్​మ్యాప్​ సిద్ధం చేశారు. అందుకోసం జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ట్రైనింగ్​ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా ఆరు నెలల ముందు అభ్యర్థుల ప్రకటనే ఎంత వరకు సాధ్యమన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే, ఇందాకా చెప్పుకున్నట్టు అదసలే కాంగ్రెస్‌ పార్టీ. ఒక్కరు ఒక్క అభిప్రాయం మీద ఉండరు. ఇంకొకరిని ఉండనీయరు. చిన్న విషయాలకే పెద్ద పెద్ద రచ్చ చేస్తూ రాద్ధాంతం చేసే హస్తం నేతలు ఆరునెలల ముందే అభ్యర్థుల ప్రకటనను ఒప్పుకుంటారా? అన్నదే అసలు ప్రశ్న.

ఇంకో విషయం. మాములుగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేతల హడావిడే కానివ్వండి గాంధీభవన్‌లో జరిగే గడబిడే కానివ్వండి సదరు పార్టీ కార్యకర్తలకు కూడా విసుగు పుట్టిస్తుంది. ఇక అభ్యర్థుల వేట విషయంలో కూడా అంతే. ఒక్కోసారి ఫలానా నాయకుడే ఫలానా నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించి ప్రచారమంతా జరిపించుకొని, తీరా నామినేషన్‌ వేసేందుకు కూడా రెడీ అవుతున్న టైమ్‌లో అభ్యర్థులను మార్చిన సందర్భాలు కోకొల్లలు. అలాంటిది ఆరునెలలకు ముందుగా అభ్యర్థులను ప్రకటించడం, మూడు నెలలకు ముందుగా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించడం అంటే అబ్బే అంత ఈజీ కాదంటున్నారు ఆ పార్టీ సీనియర్లు. మరి పాత సంప్రదాయాన్ని అటకెక్కించి, కొత్త సంస్కృతికి పట్టం కడుతారో, లేక పాత మూసధోరణినే కంటిన్యూ చేస్తారో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories