KRMB Meeting: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం

Telangana Representatives Walk Out From KRMB Meeting on Water Dispute
x
కేఆర్ఎంబీ (ఫైల్ ఇమేజ్)
Highlights

KRMB Meeting: హైదరాబాద్‌ జలసౌధలో వాడీవేడీగా కేఆర్‌ఎంబీ సమావేశం

KRMB Meeting: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో నిర్వహించిన కేఆర్‌ఎంబీ సమావేశం వాడీవేడీగా సాగింది. బోర్డుల ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో.. సుమారు 7గంటల పాటు సాగిన ఈ భేటీలో కేఆర్ఎంబీ ప్రతినిధులు, ఏపీ, తెలంగాణ అధికారులు పాల్గొన్నారు. ఏపీ తరఫున నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, నీటిపారుదల శాఖ అంతర్రాష్ట జలవిభాగం సీఈ శ్రీనివాస్ రెడ్డి హాజరుకాగా.. తెలంగాణ తరఫున జల వనరుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, అంతర్రాష్ట్ర జలవిభాగం సీఈ మోహన్ కుమార్ పాల్గొన్నారు.

ఇక 2021-22 ఏడాదికి గాను కృష్ణా జలాలపై నీటి కేటాయింపులపై చర్చ జరగ్గా, ఇరు రాష్ట్రాల అధికారులు ఎవరి వాదనలు వారు వినిపించారు. గెజిట్ నోటిఫికేషన్ లోని అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చకు తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కేఆర్ఎంబీ చైర్మన్ ఎమ్.పి.సింగ్ స్పందించారు. నాగార్జున సాగర్, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం కింద సాగు, తాగు నీటి అవసరాలు ఉన్నప్పుడే శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్దేశించారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ ప్రతినిధులు ఇది కరెక్ట్‌ కాదంటూ మీటింగ్‌ నుంచి వాకౌట్‌ చేశారు.

కృష్ణా జలాల్లో 50శాతం వాటా కావాలని కోరగా.. వాటాలు ఖరారు చేసే అధికారం లేదని కృష్ణా బోర్డు స్పష్టం చేసిందని అన్నారు తెలంగాణ జలవనరుల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్. 299, 512 టీఎంసీల చొప్పున నీటి వాటాలు కొనసాగుతాయన్న ఆయన.. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించకుండా చూడాలని బోర్డును కోరారు. విద్యుత్‌ విషయంలో బోర్డు వైఖరికి నిరసనగా వాకౌట్‌ చేశామన్నారు. అలాగే శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామన్న ఆయన.. గోదావరి జలాలకు బదులుగా 45 టీఎంసీల కృష్ణా జలాలు తీసుకుంటామని చెప్పారు రజత్‌ కుమార్.

ఇక చెరి సగం వాటాను అంగీకరించలేదని, ట్రైబ్యునల్‌ ఒప్పందం ప్రకారమే వెళ్లాలని బోర్డును కోరామని అన్నారు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు. ఈ సమావేశంలో ఏపీకి 70 శాతం నీటి వాటా కావాలని కోరామని, కానీ.. గత నిష్పత్తి 66:34నే కొనసాగించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు నిండి దిగువన అవసరముంటే విద్యుదుత్పత్తి చేయాలని, తెలంగాణ నిబంధనల ఉల్లంఘనతో వంద టీఎంసీల నీరు వృథా అవుతోందని బోర్డు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రోటోకాల్‌కు విరుద్ధంగా విద్యుదుత్పత్తి చేయరాదని బోర్డు నిర్ణయించిందని చెప్పారు శ్యామలరావు.


Show Full Article
Print Article
Next Story
More Stories