KTR about Building Permissions: నూతన పద్ధతిలో భవన నిర్మాణ అనుమతులు..
KTR about Building Permissions | భవన నిర్మాణాలను గతంలో మాదిరి అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పారదర్శక పద్ధతిని అమల్లోకి తెస్తున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
KTR about Building Permissions | భవన నిర్మాణాలను గతంలో మాదిరి అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పారదర్శక పద్ధతిని అమల్లోకి తెస్తున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆన్ లైన్ విధానంలో ధరఖాస్తు చేసిన 21 రోజుల్లో అనుమతులు వచ్చేలా నిబందనలు మార్చామన్నారు. వీటికి సంబంధించి అధికారులు సైతం ఖచ్చితంగా వ్యవహరించాలని సూచించారు.
భవన నిర్మాణ అనుమతులను సరళీకృతం చేస్తూ కొత్తగా తీసుకొస్తున్న తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతులు, ఆమోద స్వీయ ధ్రువీకరణ విధానం(టీఎస్ బీ–పాస్)తో దళారుల పాత్ర లేని పూర్తి పారదర్శక పద్ధతి అందుబాటులోకి రానుందని పురపాలక మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే అన్ని అనుమతులు వచ్చేస్తాయని, ఏదైనా కారణంతో సకాలంలో అధికారులు అనుమతులు ఇవ్వని పక్షంలో 22వ రోజున అనుమతి వచ్చినట్టుగానే అప్రూవల్ పత్రం వస్తుందని పేర్కొన్నారు.
75 గజాలలోపు స్థలం అయితే అసలు అనుమతులతో ప్రమేయమే లేదని, ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో ఇలాంటి విధానం అందుబాటులో లేదని, కొన్ని విదేశీ నగరాల్లోనే ఇది అమలులో ఉందని స్పష్టం చేశారు. నిర్మాణ అనుమతులను సరళీకృతం చేయడంతోపాటు పూర్తి పారదర్శకతకు వీలు కల్పించేలా ప్రభుత్వం పేర్కొంటున్న టీఎస్ బీ–పాస్ బిల్లుకు సోమవారం శాసనసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు మంత్రి కేటీఆర్ బిల్లును సభలో ప్రవేశపెట్టి దాని ప్రత్యేకతలను వివరించారు.
21 రోజుల్లోనే అనుమతులు..
కొత్తగా తీసుకొస్తున్న ఈ చట్టం 95 శాతం మందికి ఉపయుక్తంగా ఉండనుందని మంత్రి చెప్పారు. నిర్మాణ వైశాల్యం 75 గజాల లోపు ఉంటే నిర్మాణ అనుమతులే అవసరం లేదని, ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రాజముద్రతో సంబంధిత పత్రం జారీ అవుతుందని చెప్పారు. 75 గజాల నుంచి 600 గజాలలోపు (500 చదరపు మీటర్ల లోపు) ఉంటే ఆన్‌లైన్‌లో స్వీయ ధ్రువీకరణ పత్రాలు జత చేస్తూ దరఖాస్తు చేసుకుంటే.. వెంటనే (ఇన్ స్టాంట్) అనుమతులు జారీ చేస్తారని చెప్పారు. 600 గజాలకు పైన ఉన్న స్థలానికి సంబంధించి నిర్మాణ అనుమతులుగాని, లే–అవుట్ అనుమతులుగాని 21 రోజుల్లో జారీ అవుతాయన్నారు.
సరైన దరఖాస్తులకు సంబంధించి 21 రోజుల్లో అనుమతి రాని పక్షంలో 22వ రోజు అనుమతి వచ్చినట్టుగానే భావించవచ్చని(డీమ్డ్ టూ అప్రూవల్), ఇందుకు సంబంధించి రాజముద్రతో సంబంధిత పత్రం జారీ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. 15 రోజుల్లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని తెలిపారు. దరఖాస్తుదారులే స్వీయ ధ్రువీకరణ దాఖలు చేసే వెసులుబాటును దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ, ఇతరుల భూముల్లో నిర్మాణాలకు దరఖాస్తు చేసినా, తప్పుడు పత్రాలు సమర్పించినా చర్యలు కూడా అంతే కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. సరైన పత్రాలు లేని పక్షంలో పది రోజుల్లోపే అధికారులు తిరస్కరిస్తారని, ఎక్కడైనా నిర్మాణాలు జరిగితే ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే సిబ్బంది వచ్చి నిర్మాణాలను కూల్చేస్తారని హెచ్చరించారు. ఇన్ స్టాంట్‌గా వచ్చే అనుమతులు పూర్తి షరతులకు లోబడే ఉంటాయని గుర్తించాలని మంత్రి పేర్కొన్నారు.
కలెక్టర్ల ఆధ్వర్యంలో మానిటరింగ్ సెల్..
ఈ చట్టం సరైన విధంగా అమలు జరిగేలా, లోటుపాట్లను గుర్తించేలా జిల్లా కలెక్టర్లు చైర్మన్‌లుగా జిల్లా స్థాయిలో మానిటరింగ్ సెల్‌లు పనిచేస్తాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అయితే జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు ఆ పాత్ర పోషిస్తారన్నారు. ఇక రాష్ట్రస్థాయిలో పురపాలక శాఖ సంచాలకులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో ఛేజింగ్ సెల్ ఉంటుందన్నారు.
చట్టం అంటే భయం ఉండాలి..
అక్రమ నిర్మాణం అంటూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చడం సరికాదని, ఒకవేళ అది అధికారుల తప్పువల్ల జరిగిందని తెలిస్తే తర్వాత చేసేదేమీ ఉండదని భట్టి పేర్కొన్నారు. అయితే దీన్ని కేటీఆర్ ఖండించారు. చట్టంపై భయం, గౌరవం లేకపోవటంతోనే ఇబ్బడిముబ్బడిగా అక్రమ నిర్మాణాలు వస్తున్నాయని, ఇది ఆగిపోవాలంటే కూల్చడమే సరైందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇక నోటరీలకు సంబంధించిన స్థలాలకు కూడా ఈ అవకాశం ఇవ్వాలన్న సూచనపై సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు వన్‌టైమ్ రిలీఫ్ ఇచ్చే వెసులుబాటు ఉంటుందన్నారు.
ఆ పత్రం చెల్లుబాటు..
గతంలో కొన్ని చట్టాల్లో ఈ తరహాలో, నిర్ధారిత సమయంలోగా అనుమతులు రాని పక్షంలో ఆటోమేటిక్‌గా అనుమతులు వచ్చినట్టు భావించే విధానం అమలు చేశారని, అయితే అలాంటి పత్రాలపై సంబంధిత స్టాంప్స్ లేనందున చెల్లుబాటు కాలేదని, వాటికి విలువే లేకుండాపోయిందని కాంగ్రెస్ సభా పక్ష నేత భట్టి విక్రమార్క సందేహాన్ని వెలిబుచ్చారు. కొత్త చట్టం ప్రకారం.. ఇన్‌స్టాంట్ అనుమతి పత్రాలపై సంబంధిత అధికారుల సంతకం, రాజముద్ర ఉంటుందని, అది అన్ని చోట్లా చెల్లుబాటు అవుతుందని మంత్రి స్పష్టతనిచ్చారు. అలాగే నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వ విభాగాల అనుమతులు కూడా అవసరముంటే సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడతానని కేటీఆర్ అన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire