TS High Court: ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లేకున్నా ఆసుపత్రుల్లో అడ్మిట్

Telangana High Court
x
తెలంగాణ హై కోర్ట్  ఫైల్ ఫోటో 
Highlights

TS High Court: కోవిడ్ లక్షణాల ఆధారంగా అడ్మిట్ చేసుకోవాలని హైకోర్టు ఆదేశం

TS High Court: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ విధంగా ప్రభుత్వానికి అక్షింతలు వేయడంతో పాటు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లేకున్నా కోవిడ్ లక్షణాలను ఆధారంగా చేసుకుని పేషెంట్లను హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు రోజుకు 30 నుంచి 40 వేలు చేస్తున్నామని ప్రభుత్వం తెలపగా.. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 3 లక్షలు 47 వేలు మాత్రమే టెస్టులు చేశారని.. లెక్కలు ప్రకారం 8 లక్షల 40 వేలు చేయాలి కదా అని న్యాయస్థానం ప్రభుత్వాని నిలదీసింది.

కరోనా కేసుల వివరాలు ప్రతిరోజూ మీడియా బులెటిన్ విడుదల చేయాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. యాదాద్రి భువనగిరి, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో చాలా కేసులు నమోదు అవుతున్నాయని, కాబట్టి ఈ ప్రాంతాలలో టెస్టులు పెంచాలని సూచించింది. అలాగే, వలస కార్మికులు ఇబ్బందులు పడకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక కమిటీ వేయాలని ఆదేశించిన హైకోర్టు నైట్ కర్ఫ్యూ విధించడంతో సరిపోదని, ప్రజలను బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకుండా చూడాలని తెలిపింది. ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు విధించాలని ధర్మాసనం పేర్కొంది. వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, సినిమా థియేటర్ల దగ్గర పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో భౌతిక దూరం పాటించేలా చూడాలని, ఎన్నికల ర్యాలీలలో జనాభా అధికంగా ఉండకుండా చూడాలని పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్, నేషనల్ హైవే ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపింది.

కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారిని ప్రత్యేక క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశించింది. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్‌లో నోడల్ అధికారిని నియమించాలని హైకోర్టు సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్సులు 1350 ఉన్నాయని, అందులో కాల్స్ రాగానే 450 వెళ్తున్నాయని ధర్మాసనానికి ప్రభుత్వం తెలపగా.. 108,104 టోల్ ఫ్రీ నెంబర్స్ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని హైకోర్టు సూచించింది. ఆర్టీసీఆర్ టెస్ట్ రీపోర్టు 24 గంటల్లో ఇచ్చే విధంగా చూడాలని చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్, మైక్రో కంటైన్మెంట్ జోన్ వివరాలు సమర్పించాలని కోరింది. అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories