తెలంగాణలో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్.. ఢిల్లీలో గవర్నర్‌ తమిళిసై మంతనాలు...

Telangana Govt vs TS Governor Tamilisai Soundararajan | Live News
x

తెలంగాణలో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్.. ఢిల్లీలో గవర్నర్‌ తమిళిసై మంతనాలు...

Highlights

Tamilisai Soundararajan: సీఎం కేసీఆర్‌ తరహాలో వ్యవహరించి ఉంటే.. అసెంబ్లీ రద్దయ్యేది - తమిళిసై

Tamilisai Soundararajan: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎక్కడైనా అధికారం, ప్రతిపక్షాల మధ్య వివాదాలు ఉంటాయి. కానీ.. తెలంగాణలో అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌కు మధ్య గ్యాప్‌ పెరుగుతోంది. అది కాస్త.. చిలికి చిలికి గాలివానలా మారింది. ఇక.. ఇదే విషయమై ఢిల్లీకి వెళ్లిన గవర్నర్‌ తమిళిసై.. ప్రధాని మోడీతో పాటు, కేంద్రమంత్రి అమిత్‌షాను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. తనను తమిళిసైలా కాకపోయినా.. కనీసం ఒక మహిళగా కూడా గౌరవించడంలేదని బీజేపీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం.

గత 10 నెలలుగా సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌ సైడే రాలేదని అన్నారు తమిళిసై. తాను కోవిడ్‌ సమయంలో ఆస్పత్రులను సందర్శించడం, రాజ్‌భవన్‌ ముందు ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేయడం, ఎమ్మెల్సీ పదవికి కౌశిక్‌ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమోదించకపోవడం వంటి కారణాలతోనే ప్రభుత్వ వర్గాలు ఇలా వ్యవహరిస్తున్నాయని అనుకుంటున్నానని చెప్పారు తమిళిసై. గవర్నర్‌ కోటాలోని సేవారంగానికి చెందిన ఆ ఎమ్మెల్సీ పోస్టుకు కౌశిక్​రెడ్డికి బదులు కరోనా వారియర్స్​ కనిపించలేదా అని ప్రశ్నించారు. దాదాపు 10 నెలలుగా రాజ్ భవన్‌‌‌‌ను తెలంగాణ సీఎం అవమానిస్తున్నారని, కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్​ నుంచి పరిస్థితి మరింత దిగజారిందని అభిప్రాయపడ్డారు.

సీఎం కేసీఆర్‌ తరహాలో తాను కూడా వ్యవహరించి ఉంటే.. శాసనసభ ఇప్పటికే రద్దయ్యేదని అన్నారు తమిళిసై. నిబంధనల ప్రకారం ఆరు నెలలకోసారి సమావేశాలు జరపాలి. గవర్నర్‌ ప్రసంగం లేకుండా జరపొచ్చు. కానీ గవర్నర్‌ సంతకం లేకుండా ప్రారంభించకూడదని, తన ప్రసంగం లేకుండా చేసినా సరే తాను సమావేశాల ప్రారంభానికి సంతకం చేశానన్నారు. అప్పటికి సమావేశాలు జరిగి ఆరు నెలల కాలం ముగియడానికి కేవలం 15 రోజుల వ్యవధే ఉంది. ఆ పదిహేను రోజులు శాసనసభ సమావేశాల అనుమతి దస్త్రాన్ని తొక్కిపెట్టి ఉంచినట్లయితే సభే రద్దయ్యేదని, కానీ తాను హుందాగా వ్యవహరించానన్నారు.

తన తల్లి చనిపోతే.. సీఎం కేసీఆర్‌ కనీసం పరామర్శించలేదని, ఆమె భౌతిక కాయాన్ని తమిళనాడు చేర్చేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటుగా తీసుకెళ్లామన్నారు. అమ్మ చనిపోయిన వార్తను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయాలకు తానే స్వయంగా ఫోన్‌ చేసినట్టు చెప్పారు. రాష్ట్రపతి వెంటనే ఫోన్‌ చేసి ఓదార్చారని, విదేశాల్లో ఉన్న ప్రధాని ఫోన్‌లో మాట్లాడారని, కానీ.. భౌతికకాయాన్ని చూసేందుకు కేసీఆర్‌ మాత్రం రాజ్‌భవన్‌కు రాలేదన్నారు. కనీసం ఫోన్‌లో కూడా పరామర్శించలేదని తెలిపారు.

అన్నదమ్ముల్లా కలిసిపోయే గొప్ప సంస్కృతి తెలంగాణలో ఉందని, అలాంటి చోట ఒక మహిళను అవమానించడం, విస్మరించడం కరెక్టేనా అంటూ నిలదీశారు తమిళిసై. రాష్ట్ర గవర్నర్ హోదాలో కాకపోయినా.. ఒక సాధారణ వ్యక్తిగా, అందులో మహిళగా, తెలంగాణ సోదరిగా తనకు గౌరవం ఇవ్వాలా.. వద్దా? అంటూ ప్రశ్నించారు. వారికి ఏదైనా సమస్య ఉంటే.. దానిని చర్చించేందుకు రాజ్‌భవన్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. సీఎం, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వచ్చి సమస్య ఏంటో చెప్పాలని సూచించారు. సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తాను చాలా స్నేహపూర్వక వ్యక్తినని, తెలంగాణ ప్రజలకు మంచి పనులు చేయాలనుకుంటున్నానన్న గవర్నర్‌.. ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా ప్రజల కోసం తన విధిని నిర్వహిస్తానన్నారు.

ఇక.. ఈ నెల 10, 11 తేదీల్లో భద్రాచలానికి రైలు, రోడ్డు మార్గాల్లో వెళ్తున్నట్టు స్పష్టం చేశారు తమిళిసై. శ్రీరామ పట్టాభిషేకం, కల్యాణానికి హాజరవుతానన్నారు. ఈ సందర్భంగా మరోసారి ప్రభుత్వానికి చురకలు అంటించారు ఆమె. తెలంగాణలో తాను ఎక్కడికి వెళ్లాలనుకున్నా.. కేవలం రోడ్డు లేదా రైలు మార్గంలోనే ప్రయాణించాల్సి వస్తోందని చెప్పారు. మేడారం జాతరతో పాటు నాగర్‌కర్నూలుకు కూడా రోడ్డు మార్గంలోనే ప్రయాణించానన్నారు. తెలంగాణలో గవర్నర్‌ రవాణా పద్దతులు ఇవేనంటూ గతంలో ప్రభుత్వం తనకు హెలికాప్టర్‌ ఇవ్వడానికి నిరాకరించడాన్ని గుర్తుచేస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు తమిళిసై. యాదాద్రికి బీజేపీ ప్రతినిధిగా వెళ్లానని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారని, బీజేపీ కార్యకర్తలను వెంటేసుకొని వెళ్లానా అంటూ ఫైర్‌ అయ్యారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తూ ఎందుకు అవమానిస్తున్నారంటూ నిలదీశారు.

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వినియోగం పెరిగిందని, దీనివల్ల యువత చెడుదార్లు పడుతోందని అమిత్‌షాకు నివేదించినట్లు తమిళిసై తెలిపారు. గవర్నర్‌ రాజకీయం చేస్తున్నారని మంత్రులు మాట్లాడడం సరికాదని, వారిని పలు కార్యక్రమాలకు ఆహ్వానించినా రాలేదని గుర్తుచేసుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళితే బీజేపీ మనిషినని తనపై ముద్ర వేశారని, తాను ఇప్పటివరకు బీజేపీ నేతలకు కేవలం ఒకటి, రెండు సార్లు మాత్రమే అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్టు చెప్పారు. ఇక.. గవర్నర్‌కు గౌరవం ఇస్తున్నామన్న మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించిన తమిళిసై.. అదే నిజమైతే రిపబ్లిక్‌ డే వేడుకలకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు రాలేదని, సమ్మక్క, సారక్క జాతరకు తనను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఇదేనా గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవమంటూ నిలదీశారు. గవర్నర్‌కు అన్ని విధాలా ప్రొటోకాల్‌ కల్పిస్తున్నట్లు మంత్రులు ఎలా చెబుతారని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories