Private Hospitals in Telangana: ప్రైవేటు ఆస్పత్రులపై వేటు.. ఫీజుల దందాపై విచారణ

Private Hospitals in Telangana: ప్రైవేటు ఆస్పత్రులపై వేటు.. ఫీజుల దందాపై విచారణ
x
Private Hospitals
Highlights

Private Hospitals in Telangana: అందరూ ఒక సామెత చెప్పుకుంటుంటారు... ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.

Private Hospitals in Telangana: అందరూ ఒక సామెత చెప్పుకుంటుంటారు... ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే... పంచ నున్న చుట్ట పీక కాలిపోయిందన్నాడట వేరొకడు... అలానే ఉంది ప్రైవేటు ఆస్పత్రుల తీరు చూస్తుంటే.. కరోనా వైరస్ నుంచి విముక్తి పొందేందుకు తెలంగాణా ప్రజలు అధికస్థాయిలో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటే.. దొరికిందిదే అవకాశమంటూ వారి నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసి దందా నడుపుతున్నారు. ఈ వ్యవహారాన్ని ఇంతవరకు చూసిన ప్రభుత్వం ఇక వదిలేయదలుచుకోలేదు. ఈ ఫీజుల తతంగాన్ని పూర్తిగా పరిశీలించి,. వాటిపై వేటు వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా చికిత్సను ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

కరోనా చికిత్స పేరిట రోగుల నుంచి రూ. లక్షల్లో ఫీజులు గుంజుతున్న ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. ఆయా ఆస్పత్రులకు ఇచ్చిన కరోనా చికిత్స అనుమతులను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. భారీగా ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇలాంటి ఆస్పత్రులపై రెండు, మూడు రోజుల్లో తనిఖీలు నిర్వహించి చికిత్సలు, ఫీజుల రికా ర్డులను పరిశీలించనుంది. అం దుకోసం బృందాలను సిద్ధం చేసింది. కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు సభ్యులు చనిపోయినా మానవత్వం మరిచి ఇంకా రూ. లక్షలు చెల్లించాలంటూ ఒక ఆస్పత్రి డిమాండ్‌ చేసిన విషయం మంత్రి కేటీఆర్‌ దృష్టికి రావడం, దానిపై ఆయన స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కు సూచించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాసుల కక్కుర్తి ప్రదర్శిస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలకు సర్కారు రంగం సిద్ధం చేసింది.

శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు...

రాష్ట్రంలోని చాలా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా వేళ యాజమాన్యాలు కనికరం చూపట్లేదని, అధిక ఫీజు వసూళ్లు, నాసిరకం వైద్యం చేస్తున్నాయని మండిపడుతున్నారు. కరోనా చికిత్సలకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏవైనా సమస్యలుంటే తమకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం గత నెల 16న 9154170960 వాట్సాప్‌ నంబర్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వెయ్యికిపైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా ఫీజుల దోపిడీకి సంబంధించినవే ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే ప్రైవేటు బీమా సౌకర్యం ఉన్నా ఆస్పత్రులు దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా డబ్బులు వసూలు చేస్తున్నాయని మరికొందరు ఫిర్యాదు చేశారు. కరోనా నెగెటివ్‌ వచ్చినా పాజిటివ్‌ అని చెప్పి వైద్యం చేస్తూ రూ. లక్షలు గుంజుతున్నాయని మరికొన్ని ఫిర్యాదులు అందాయి.

విచిత్రమేంటంటే ఒక పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రి అయితే ఒక వ్యక్తికి వైద్యం చేసినందుకు ఏకంగా రూ. 18 లక్షలకుపైగా బిల్లు వేసిందని ఫిర్యాదు అందింది. కొందరికి సాధారణ లక్షణాలున్నా ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి రూ. లక్షల్లో ఫీజు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక కుటుంబానికైతే తీవ్ర ఆవేదన కలిగించేలా ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరించింది. కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని, ఫీజు కింద మొత్తం రూ. 5 లక్షలు చెల్లిస్తే డిశ్చార్జి చేస్తామని చెప్పింది. తీరా ఫీజు కట్టాక ఆ కుటుంబానికి శవాన్ని అప్పగించినట్లు ఫిర్యాదు అందిందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. శవాలపై పేలాలు ఏరుకున్నట్లుగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరిస్తున్నాయని బాధితులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.

ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు నివేదిక...

సర్కార్‌ ప్రవేశపెట్టిన వాట్సాప్‌ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖ జిల్లా డీఎంహెచ్‌వోలను ఆదేశించింది. ఆ ప్రకారం ఇప్పటికే చాలా ఆస్పత్రులపై విచారణ జరిపారు. చిన్నచిన్న సమస్యలుంటే యాజమాన్యాలను మందలించి విడిచిపెడుతున్న అధికారులు.. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రులపై లోతైన విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారం మంత్రి కేటీఆర్‌ దృష్టికి రావడంతో వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగం మొత్తం కదిలింది. అమానుషంగా వ్యవహరిస్తున్న కొన్ని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నెల క్రితం కొన్ని ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఇష్టారాజ్యంగా, నాసిరకంగా కరోనా పరీక్షలు చేసినప్పుడు వాటికి నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం... ఇప్పుడు కొన్ని ఆస్పత్రులకు కరోనా చికిత్స చేసే వెసులుబాటును రద్దు చేయనుంది. దీనిపై ఇప్పటికే వాటికి నోటీసులు పంపింది.

చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నంబర్‌కు ప్రైవేటు ఆస్పత్రులపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటన్నింటినీ పరిశీలిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికైనా కరోనా బాధితులు వేలాది పడకలు అందుబాటులో ఉన్న, ఉచితంగా వైద్యం అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నా.

Show Full Article
Print Article
Next Story
More Stories