మరో శాఖ ప్రక్షళన దిశగా తెలంగాణా ప్రభుత్వం.. పునర్వ్యవస్థీకరణగా జలవనరుల శాఖ

మరో శాఖ ప్రక్షళన దిశగా తెలంగాణా ప్రభుత్వం.. పునర్వ్యవస్థీకరణగా జలవనరుల శాఖ
x
KCR (File Photo)
Highlights

Telangana Government: పలు ప్రభుత్వ శాఖల్లో పనితీరు మెరుగుపర్చడం, వాటిలో అవినీతిని రూపుమాపేందుకు తెలంగాణా ప్రభుత్వం ఖచ్చితమైన విధానాలతో ముందుకు వెళుతోంది.

Telangana Government: పలు ప్రభుత్వ శాఖల్లో పనితీరు మెరుగుపర్చడం, వాటిలో అవినీతిని రూపుమాపేందుకు తెలంగాణా ప్రభుత్వం ఖచ్చితమైన విధానాలతో ముందుకు వెళుతోంది. ఇంతవరకు రెవెన్యూ వ్యవస్థ రూపురేఖలు మార్చిన ప్రభుత్వం తాజాగా జలవనరుల శాఖను పునర్వ్యవస్థీకరణ చేసేందుకు నడుం బిగించింది. దీనికి సంబంధించి విస్తరించిన శాఖలను అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. దీనిని అసెంబ్లీ వేదికగా ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్ర జల వనరుల శాఖ సంపూర్ణ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కొలిక్కి తెచ్చింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో పాటు చెరువులు, ఐడీసీ పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చేలా చేసిన కసరత్తు పూర్తవగా, పునర్వ్యవస్థీకరణ అవసరాన్ని అసెంబ్లీ వేదికగానే ప్రజా ప్రతినిధులు, ప్రజల ముందుంచాలని సీఎం కె,చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దీనిపై అసెంబ్లీలోనే ప్రకటన చేసి, వివరణ ఇవ్వాలనే నిశ్చయానికి వచ్చారు.ఇటీవల జల వనరుల శాఖపై సమీక్ష చేసిన సీఎం వివిధ అంశాలపై ఇంజనీర్లకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండాలన్నదానిపై కీలక సూచనలు చేశారు.

ఇవీ కొత్త నిర్ణయాలు..: ప్రాజెక్టుల పరిధిలో ఉన్న కాల్వలు, పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, ఐడీసీ పథకాలు, చెరువులను దృష్టిలో పెట్టుకుని ఇంజనీర్లకు పని విభజన చేయాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒక్కో చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) పరిధిలో ప్రస్తుతం 10 నుంచి 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, కొందరు సీఈల పరిధిలో 2 నుంచి 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తాజాగా ఒక్కో సీఈ పరిధిలో 5 నుంచి 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండేలా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం 13 సీఈ డివిజినల్‌ కార్యాలయాలుండగా, వాటి సంఖ్యను 19కి పెంచనున్నారు. నిజానికి ఇంజనీర్లు 17 డివిజన్లను సూచించినా, సీఎం కొత్తగా కామారెడ్డి, కొత్తగూడెం డివిజన్లను ప్రతిపాదించారు. ఇప్పటికే పంప్‌హౌస్‌ల నిర్వహణకు ఒక ఈఎన్‌సీని ప్రత్యేకంగా నియమించడంతో పాటు బేసిన్ల వారీగాకృష్ణా, గోదావరికి ఒక్కో సీఈని కొత్తగా నియమించే అవకాశాలున్నాయి.

ఇక ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న లష్కర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, ఫిట్టర్లు, ఆపరేటర్ల అంశాలు ప్రస్తావనకు రాగా, అవసరం మేరకు ఎంతమందినైనా నియమించేందుకు సిద్ధమని సీఎం హామీనిచ్చారు. ఒక జేఈఈ పరిధిలో ఇద్దరు లష్కర్లు, ఒక వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉండేలా నియామకాలుండాలని సూచించినట్లు తెలిసింది. ప్రతి ప్రాజెక్టు కింద చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడం, ప్రతి చెరువు రెండు కాలాల్లోనూ నిండుగా ఉండటం, రిజర్వాయర్లన్నీ నీటికళ తో ఉట్టిపడేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం మరోమారు పునరుద్ఘాటించారు. శాఖ పునర్వ్యవస్థీకరణ అవసరంపై అసెంబ్లీలో సైతం ప్రకటిస్తానని కేసీఆర్‌ తెలిపారు. అంతకుముందే ఈఎన్‌సీ నుంచి ఈఈ స్థాయి ఇంజనీర్లతో వర్క్‌షాప్‌ నిర్వహించాలని, దానికి తానే హాజరవుతానని సీఎం తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories