దసరా టు దసరా.. తెలంగాణా సచివాలయ నిర్మాణానికి గడువు

దసరా టు దసరా.. తెలంగాణా సచివాలయ నిర్మాణానికి గడువు
x
Telangana New Secretariat Design
Highlights

Deadline for construction of Telangana Secretariat: తెలంగాణా సచివాలయం నిర్మాణ పనులను వీలైనంత తొందరలో ప్రారంభించి, మరింత తొందర్లో ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Deadline for construction of Telangana Secretariat: తెలంగాణా సచివాలయం నిర్మాణ పనులను వీలైనంత తొందరలో ప్రారంభించి, మరింత తొందర్లో ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఈ దసరాకు పనులు ప్రారంభించేలా, మళ్లీ దసరాకు భవనాన్ని ప్రారంభించేలా గడువు విధించుకున్నారు. దీనికి సంబంధించిన అన్ని రకాల అనుమతులను త్వరితగతిన పూర్తిచేయడంతో పాటు అవసరమైన నిధులను సైతం వెంటనే మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణ కొత్త సచివాలయ భవనాల నిర్మాణ పనులు వచ్చే దసరా రోజున ప్రారంభించి తదుపరి దసరా వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. దాదాపు 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడంతస్తుల భారీ భవనం, చుట్టూ పచ్చికబయళ్లు, రోడ్లు.. ఇంత పెద్ద ప్రాజెక్టు 12 నెలల్లో పూర్తి చేయటం అంత సులభం కానప్పటికీ, వీలైనంత తొందరలో ప్రధాన భవనాన్ని సిద్ధం చేయాలని ఆదేశించింది. భవన నిర్మాణానికి వీలుగా 4 రకాల విభాగాల నుంచి అనుమతులు పొందాల్సి ఉండటంతో అధికారులు ఆ కసరత్తు ప్రారంభించారు. అనుమతులు వచ్చేలోపు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.

డెక్కన్‌–కాకతీయ శైలిలో రూపుదిద్దుకోబోతున్న తెలంగాణ సచివాలయ భవనం ఎత్తు 278 అడుగులు. ఇందులో మధ్యభాగంలో ఉండే ప్రధాన గుమ్మటం ఎత్తే ఏకంగా 111 అడుగులు కావటం విశేషం. మొత్తం ఏడంతస్తులుగా ఉండే భవనంలో.. ఈ గుమ్మటం ఎత్తు ఇంచుమించు 4 అంతస్తులతో సమానంగా ఉండనుందంటే దాని ఆకృతి ఎంత పెద్దదో ఊహించవచ్చు. ఇక గుమ్మటంపై 11 అడుగుల ఎత్తుతో నాలుగు సింహాలతో కూడిన అశోకముద్ర అలరారనుంది. భవనం పైభాగం మధ్యలో విశాలమైన స్కైలాంజ్‌ నిర్మిస్తున్నారు. ఇది గుమ్మటం దిగువ భాగమన్నమాట. ఈ స్కైలాంజ్‌ 50 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దానిపైన 50 అడుగుల ఎత్తుతో గుమ్మటం పైభాగం ఉంటుందని మీడియాలో కధనాలు వచ్చాయి.

తెలంగాణ మంత్రివర్గం కొత్త సచివాలయ భవన తుది నమూనాకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భవన నిర్మాణానికి గాను గురువారం రూ.400 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేయనుంది. అంతేకాక ఒకటి, రెండు రోజుల్లో అధికారులు టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ క్రమంలో అధికారులు చెన్నైకు చెందిన ఆర్కిటెక్ట్స్ ఆస్కార్, పొన్ని సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

కొత్త సచివాలయ భవనంలో మార్పులు చేర్పులను కేసీఆర్ ఇటీవల వరుస సమీక్షలు నిర్వహించి సూచించారు. ఈ మేరకు నిపుణులు ఖరారు చేసిన తుది డిజైన్‌ను నాటి కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా సకల సౌకర్యాలూ ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లు అన్ని సౌకర్యాలతో ఉండాలని స్పష్టంచేశారు. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్‌ హాలు, సమావేశాల కోసం మీటింగ్‌ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్‌ హాల్, అన్ని వాహనాలకు పార్కింగ్‌ వసతి ఉండేలా చూడాలని కేసీఆర్ సూచించారు. ఆ మేరకు నిపుణులు తుది నమూనాను డిజైన్ చేశారు

Show Full Article
Print Article
Next Story
More Stories