Free Vaccine: ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు: సీఎం కేసీఆర్​

Telangana Government Announce the Free Vaccine to people
x

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Free Vaccine: రాష్ట్రంలో అందరికీ కొవిడ్ టీకా ఉచితంగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు

Free Vaccine: రాష్ట్రంలో అందరికీ కొవిడ్ టీకా ఉచితంగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు. రాష్ట్రవాసులతో పాటు ఇక్కడ పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల వారందరికీ వయస్సుతో సంబంధం లేకుండా వ్యాక్సినేషన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. సుమారు నాలుగు కోట్లలో ఇప్పటి వరకు 35 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారని మిగతా అందరికీ టీకాలు వేయించనున్నట్లు తెలిపారు. అందరికీ వ్యాక్సినేషన్ కోసం 2వేల 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందన్న సీఎం ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. అందరికీ టీకాలు వేస్తామన్న ఆయన... ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య-ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న వారందరికీ టీకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

భారత్ బయోటెక్ ఇప్పటికే టీకాలు తయారు చేస్తోందని రెడ్డీ ల్యాబ్స్ సహా మరికొన్ని సంస్థలు సైతం వ్యాక్సిన్ల తయారీకి ముందుకు వచ్చినందున ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరాక సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానన్న సీఎం కేసీఆర్ పటిష్టంగా, విజయవంతంగా అమలు చేసేందుకు జిల్లాల వారీగా ఇన్‌ఛార్జులను నియమిస్తామని చెప్పారు. రెమిడెసివిర్ తదితర కరోనా సంబంధిత ఔషధాలు, ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రజలు అధైర్య పడవద్దని, భయభ్రాంతులకు గురికావద్దని ఇదే సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండవద్దని సీఎం కోరారు. కరోనా సోకినవారికి పడకలు, ఔషధాల విషయంలో ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తుందని... కొవిడ్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. పెద్ద ఎత్తున శానిటైజేషన్ చేస్తామని చెప్పారు. గుంపులు కూడవద్దని, ఊరేగింపుల్లో పాల్గొనవద్దని, అత్యవసరమైతేనే తప్ప బయట తిరగవద్దని సూచించారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి విషయంలో చేయాల్సినదంతా పటిష్టంగా చేస్తుందన్న సీఎం కేసీఆర్... స్వయం క్రమశిక్షణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories