కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. కారు దిగి వచ్చే వాళ్లకు రెడ్ కార్పెట్..

Telangana Congress Operation Akarsh Started
x

కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. కారు దిగి వచ్చే వాళ్లకు రెడ్ కార్పెట్..

Highlights

పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు సగానికి పైగా కాంగ్రెస్ లోకి వస్తున్నారని కాంగ్రెస్ ప్రచారం చేసింది

తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసింది. ఫలితాలు క్లియర్ గా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది. వీటితో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే వాళ్లను ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న ముఖ్య నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ అధినాయకులు. పార్టీ మారాలనుకునే నేతల ఇంటికి వెళ్లి మరి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగనే ఇతర పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేల కోసం తమ పార్టీ గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయని కాంగ్రెస్ అగ్ర నేతలు స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటే తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ వేరే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకోవాలని చూస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు సగానికి పైగా కాంగ్రెస్ లోకి వస్తున్నారని కాంగ్రెస్ ప్రచారం చేసింది. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ కావడానికి ఎమ్మెల్యేలు మాత్రం పెద్దగా కాంగ్రెస్ వైపు చూడడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది.. దీంతో మరోసారి తమ పార్టీ గేట్లు తెరిచే ఉన్నాయి.. ఎప్పుడైనా.. ఎవరైనా... పార్టీలోకి రావచ్చు అంటూ మరొక సారి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి రమ్మనడానికి చాలా కారణాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

సీనియర్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో కొంత పాలనా పరంగా సలహాలు సూచనలు తీసుకోవడం కలిసొచ్చే అంశంగా కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలలో మెజార్టీ ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు కావడం దానికి తోడు ప్రభుత్వం కూలీ పోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదే పదె అనడంతో వేరే పార్టీల ఎమ్మెల్యేలను తీసుకుని బలం పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. వీటన్నింటి కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకుని కేసీఆర్‌ను నైతికంగా దెబ్బతీయాలన్న ఆలోచనలో ఉన్నట్టు శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు పార్టీ మారాలని ఆలోచనలో ఉన్న కొందరు నేతలు కాంగ్రెస్‌కు ఆశించినన్ని సీట్లు రాకపోవడంతో.. వెళ్లాలా.. వద్దా అన్న డైలమాలో ఉన్నారట.. అలా డైలమాలో ఉన్న నేతలు బీజేపీ వైపు మళ్లకుండా.. ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ పదేపదే తమ పార్టీ గేట్లు తెరిచే ఉన్నాయని సంకేతాలు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఏది ఏమైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ ఎమ్మెల్యేలను సంతల్లో పశువులు కొన్నట్టు కొన్నారని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని సొంతపార్టీ వారిని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని హార్ట్ కోర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు. బయటికి చెప్పుకోలేక ధైర్యంగా ప్రశ్నించలేక లోలోపల మధనపడుతున్నారని టాక్ వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories