CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం

Telangana CM KCR Took Another Sensational Decision For SC Poor Families
x

సీఎం కెసిఆర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

CM KCR: ఎస్సీల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు దశలవారీగా కార్యాచరణ * తొలి దశలో రూ.1200కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందజేత

CM KCR: తెలంగాణ ముఖ‌్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులే పీడిత వర్గాలుగా ఉన్నారన్న సీఎం కేసీఆర్‌..... ఎస్సీల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు దశలవారీగా కార్యాచరణ అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా దళితుల సామాజిక, ఆర్ధిక బాధలు తొలగించేందుకు పెద్దఎత్తున నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. దళితుల సాధికారతే లక్ష్యంగా తొలి దశలో 12వందల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఫస్ట్‌ ఫేజ్‌లో నియోజకవర్గానికి వంద దళిత కుటుంబాల చొప్పున మొత్తం 10వేల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేస్తామన్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే సొమ్ము జత చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీమ్‌ విధివిధానాల రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. అన్ని పార్టీల దళిత ప్రజాప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్‌.... సూచనలు సలహాలు స్వీకరించారు. పైరవీలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన ఎస్సీల బాధలు పోవాల్సిన అవసరముందన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాబోయే మూడేళ్లలో 40వేల కోట్లను దళితుల అభివృద్ధికి ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

దళితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సామాజిక, ఆర్ధిక సమస్యలుగా విడదీసి పరిష్కార మార్గాలను అన్వేషించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి స్కీమ్‌లు ప్రవేశపెట్టాలో అధ్యయనంచేసి నివేదిక ఇవ్వాలన్నారు. ముఖ్యంగా స్వయం ఉపాధి కోసం ప్రత్యేకమైన మెకానిజం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఉన్నత చదువులు, పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల సాధన కోసం అవసరమైన శిక్షణను, ఆర్ధిక సహాయాన్ని అందించాలన్నారు. జులై ఒకటి నుంచి జరగనున్న పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో దళిత సమస్యలపై వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే, రాష్ట్రంలో దళిత కుటుంబాల ప్రొఫైల్ తయారు చేయించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సీఎం కేసీఆర్ సూచించారు.

ఇక, పెండింగ్‌లో ఉన్న దళిత ఉద్యోగుల ప్రమోషన్లను పది పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే, దళిత సాధికారత అమలు కోసం సీఎంవోలో ప్రత్యేక అధికారిని నియమిస్తామని తెలిపారు. అంతేకాదు, దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీమ్‌ ఇంప్లిమెంట్‌‌పై జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రైతుబంధు పొందుతున్న దళిత రైతులకు కూడా దళిత సాధికారత పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. అలాగే, భూమి లేని దళితులకు బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇకపై దళితులపై పోలీస్ దాడులు జరిగితే, ఉద్యోగం నుంచి తొలగించాలన్న అఖిలపక్ష డిమాండ్‌‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. అలాగే, దళితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories