Rythu Bharosa Scheme: పంట వేసే రైతులకే రైతు భరోసా... దరఖాస్తు తేదీలు ఖరారు?

Rythu Bharosa Scheme: పంట వేసే రైతులకే రైతు భరోసా... దరఖాస్తు తేదీలు ఖరారు?
x
Highlights

Rythu bharosa scheme guidelines, rules, regulations: రైతు భరోసా పథకం విధివిధానాలపై చర్చించేందుకు గురువారం తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది....

Rythu bharosa scheme guidelines, rules, regulations: రైతు భరోసా పథకం విధివిధానాలపై చర్చించేందుకు గురువారం తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఏయే కేటగిరీ రైతులకు రైతు భరోసా ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగింది. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. తాజాగా క్యాబినెట్ సబ్-కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నివేదిక సీఎం రేవంత్ రెడ్డికి చేరాల్సి ఉంది. జనవరి 4 నాడు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ క్యాబినెట్ భేటీలోనే సీఎం రేవంత్ రెడ్డి మిగతా మంత్రులతో చర్చించి రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రభుత్వం మారడం, పథకం పేరుతో పాటు విధివిధానాలు కూడా మారిన నేపథ్యంలో రైతు భరోసా పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం కొత్తగా రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రస్తుతం అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం జనవరి 4న కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే దీనిపై ఒక ప్రకటన చేయనున్నారు. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి 7 నుండి 13వ తేదీ వరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 14 నుంచి రైతుల ఖాతాల్లో ఆ డబ్బులు జమచేయనున్నట్లు సమాచారం అందుతోంది.

రైతు భరోసాపై 'కాంగ్రెస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్'

సంక్రాంతి నుండి రైతులకు రైతు భరోసా సాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అందుకే జనవరి 4న భేటీ ముగిసిన వెంటనే ఆ తరువాతి మూడు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించి ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ తరువాత వారం రోజుల్లో దరఖాస్తుదారుల వివరాలు వెరిఫై చేసుకుని లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేయనున్నారు. ఆ తరువాత సంక్రాంతి నుండి రైతుల ఖాతాల్లో ఆ డబ్బులు జమ చేసేలా సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి సర్కారు రైతులను పట్టించుకోవడం లేదంటున్న బీఆర్ఎస్

ఇప్పటికే ప్రభుత్వం మారి ఏడాది దాటినప్పటికీ రైతులకు అందాల్సిన రైతు భరోసా సాయం మాత్రం అందివ్వడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు పంట వేయడానికి ముందే రైతు బంధు సాయం అందించామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక రైతులను పట్టించుకోవడం మానేశారనేది బీఆర్ఎస్ చేస్తోన్న వాదన. తెలంగాణ రైతులు ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్స్‌లో వాచ్ మెన్ డ్యూటీలు చేసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, రైతులను రోడ్డుపాలు చేసి అపార్ట్‌మెంట్స్‌లో వాచ్ మెన్లను చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ నేతలు ప్రత్యారోపణలు గుప్పిస్తున్నారు.

ప్రభుత్వం మా ప్రశ్నకు సమాధానం చెప్పాలన్న బీజేపి

రైతు భరోసా పథకం అమలుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ వాదనలు ఇలా ఉంటే... బీజేపి వాదన మరోలా ఉంది. రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేకనే కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ భేటీలు, సబ్-కమిటీలతో కాలయాపన చేస్తోందని బీజేపి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రైతు భరోసా పథకం విధివిధానాలు ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పడి 5 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి సర్కారు రైతు కూలీలకు ఇస్తామన్న రూ. 12 వేలు ఇవ్వలేదు. రాష్ట్రంలో 15 లక్షల మంది రైతు కూలీలకు ఇచ్చేందుకు రూ. 900 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 2024 డిసెంబర్ 28 నాటికే రైతు కూలీల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఇప్పటివరకు ఆ పని ఎందుకు చేయలేదని మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న సాయం (Rythu bharosa Scheme) ఇవ్వకుండా ప్రభుత్వానికి అడ్డం పడుతోంది ఎవరని ఆయన నిలదీశారు. ఎల్లుండి జరిగే క్యాబినెట్ భేటీలోనైనా అంతిమ నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories