తెలంగాణ బడ్జెట్ 2024-25: 10 ముఖ్యాంశాలు..

తెలంగాణ బడ్జెట్ 2024-25: 10 ముఖ్యాంశాలు..
x

తెలంగాణ బడ్జెట్ 2024-25: 10 ముఖ్యాంశాలు..

Highlights

Telangana Budget 2024 Highlights: మల్లు భట్టి విక్రమార్క రూ.2,91,191 కోట్లతో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ సమర్పించారు.

మల్లు భట్టి విక్రమార్క రూ.2,91,191 కోట్లతో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ సమర్పించారు. హైద్రాబాద్ అభివృద్దికి అధిక నిధులతో పాటు వ్యవసాయానికి బడ్జెట్ లో సింహాభాగం కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కార్.

1. హైద్రాబాద్ అభివృద్దికి రూ. 10 వేల కోట్లు

హైద్రాబాద్ అభివృద్దికి బడ్జెట్ లో రూ.10 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో కోటి జనాభాకు మౌలిక వసతుల కల్పనకు రూ. 3,065 కోట్లు, హెచ్ఎండీఏ పరిధిలో రూ.500 కోట్లు ప్రతిపాదించారు. మెట్రో వాటర్స్ వర్క్స్ కు రూ.3,385 కోట్లు, హైడ్రాకు రూ.200 కోట్లు , శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు‎ మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, హైద్రాబాద్ మెట్రో రైలుకు రూ.500 కోట్లు, పాతబస్తీలో మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, ఎంఎంటీఎస్ కు 50 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు ప్రతిపాదించారు.

2. గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్లు

గృహజ్యోతి పథకం కింద గృహా విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితం. ఈ పథకాన్ని ఈ ఏడాది మార్చి 1 నుంచి అమలు చేస్తున్నారు. ఇందుకు బడ్జెట్ లో రూ.2418 కోట్లు కేటాయించారు. మరో వైపు మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. దీనికి బడ్జెట్ లో రూ. 723 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 39లక్షల57వేల637 కుటుంబాలకు లబ్ది చేకూరింది. ఇందుకోసం రూ. 200 కోట్లను చేశారు.

3. రీజినల్ రింగ్ రోడ్డుకు రూ. 1,525 కోట్లు

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి బడ్జెట్ లో రూ. 1,525 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. హైద్రాబాద్ కు ఉత్తరాన 158.6 కి.మీ పొడవున్న సంగారెడ్డి-తూఫ్రాన్ -గజ్వేల్-చౌటుప్పల్ రోడ్డును, దక్షిణాన ఉన్న చౌటుప్పల్-షాద్ నగర్-సంగారెడ్డి 189 కి.మీ. రోడ్డును జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేస్తారు. హైద్రాబాద్ నగరానికి ఉన్న ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నెట్ వర్క్ తో రీజినల్ రింగ్ రోడ్డు అనుసంధానం చేయనుంది.

తొలుత నాలుగు లేన్లతో ఈ రోడ్డు ప్రారంభిస్తారు. ఆ తర్వాత దీన్ని ఎనిమిది రోడ్లకు విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య పలు పరిశ్రమలు, వాణిజ్య సేవలు, రవాణ పార్కులు అందుబాటులోకి వస్తాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర ప్రాంతం అభివృద్దికి రూ.13,522 కోట్లు, దక్షిణ ప్రాంతానికి రూ.12,980 కోట్లు ఖర్చు అవుతోందని అంచనా.

4. తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్

రాష్ట్ర తలసరి ఆదాయం 3 లక్షల 47 వేల 299 రూపాయాలు. జాతీయ తలసరి ఆదాయం 1లక్షా 83 వేల 236. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1లక్షా 64 వేల 063 రూపాయాలు ఎక్కువ. తలసరి ఆదాయంలో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం ఉంది. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 9 లక్షల 46 వేల 862 రూపాయాలు. వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం 1లక్షా 80 వేల 241 రూపాయాలు. ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ దిశగా కార్యాచరణకు అమలు చేస్తామని రేవంత్ సర్కార్ తెలిపింది.

5. ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం

ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న 1672 చికిత్సలలో 1375 చికిత్సలకు ప్యాకేజీ ధరలను సగటున 20 శాతానికి పెంచారు. ఆరోగ్యశ్రీలో 163 వ్యాధులను కొత్తగా చేర్చారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. వైద్య ఆరోగ్యశాఖకు ఈ బడ్జెట్ లో రూ.11,468 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

6. ఇందిరా మహిళా శక్తి పథకం కింద రూ. 1లక్ష కోట్ల సాయం

రాష్ట్రంలో 63 లక్షల మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేశారు. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం చేయడం ద్వారా 1లక్ష కోట్లను ఆర్ధిక సహాయం చేస్తారు. మహిళలకు ఆసక్తి ఉన్న అన్ని రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తారు. ఈ పథకం ద్వారా ఏటా 5 వేల గ్రామీణ సంఘాలకు, ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ది చేకూరేలా కార్యాచరణ చేపడుతామని ప్రభుత్వం ప్రకటించింది.

7. భూమిలేని రైతు కూలీలకు ప్రతి ఏటా రూ. 12 వేలు

భూమిలేని రైతు కూలీలకు ప్రతి ఏటా రూ. 12 వేలను ఈ ఆర్ధిక సంవత్సరం నుంచి అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరో వైపు అర్హులైన రైతులకు రైతుభరోసా అందించాలనే ఉద్దేశ్యంతో కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ కమిటీ రిపోర్ట్ అసెంబ్లీలో చర్చకు పెట్టి రైతు భరోసాను అమలు చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ పథకం కింద ప్రతి ఏటా రూ. 15 వేలు అందిస్తారు. గత ప్రభుత్వం రైతుబంధు కింద 80,440 కోట్లు ఖర్చు చేసినా... ఇందులో అనర్హులు, సాగులోలేని భూ యజమానులు, రియల్ ఏస్టేట్ వ్యాపారులు ఎక్కువగా ఉన్నారని భట్టి విమర్శించారు. సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించి వాటిని పండించేందుకు రైతుకు క్విటాలుకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో 72,659 కోట్లు కేటాయించారు.

8. ఇందిరమ్మ పథకం కింద రూ. 5 లక్షలు

ఇందిరమ్మ పథకం కింద నూతనంగా ఇల్లు నిర్మించుకునే లబ్దిదారులకు 5 లక్షల సాయం చేస్తారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు 6 లక్షలు అందిస్తారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున రాష్ట్రంలో 4లక్షల 50 వేల ఇళ్లకు సాయం అందిస్తారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ ఇళ‌్లను త్వరలోనే లబ్దిదారులకు అందించనున్నారు.

9. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు

స్వయం సహాయక మహిళా సంఘాలకు ప్రతి ఏటా 20 వేల కోట్లకు తగ్గకుండా వడ్డీలేని రుణాలు అందించనున్నారు. రానున్న ఐదేళ్లలో లక్ష కోట్లు రుణాలుగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరో వైపు స్త్రీ, శిశు సంక్షేమం కోసం బడ్జెట్ లో 2,736 కోట్లు కేటాయించారు. అంగన్ వాడీ కేంద్రాలను ఫ్రీ స్కూల్స్ గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమ్మ ఆదర్శ పాఠశాల కమటీలను ఏర్పాటు చేసి పాఠశాలల నిర్వహణను ఆ కమిటీలకు అప్పగిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు.

10. కాళేశ్వరంపై రిపోర్ట్ ఆధారంగా చర్యలు

నీటి పారుదల రంగానికి ఈ బడ్జెట్ లో 22,301 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం 24 భారీ, 7 మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం డిజైన్ల లోపాలు, నాణ్యత లేకుండా నిర్మించిందని భట్టి ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో అవకతవకలను గుర్తించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

రేవంత్ సర్కార్ బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్ గా బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ బడ్జెట్ లో కొత్త పథకాల ప్రస్తావన లేదంది. బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. అన్ని వర్గాలకు బడ్జెట్ లో కేటాయింపులున్నాయని ఆ పార్టీ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories