Telangana Elections 2023: హామీలు సరే.. అమలు ఎలా..?

Telangana Assembly Elections 2023 News
x

Telangana Elections: హామీలు సరే.. అమలు ఎలా..?

Highlights

Telangana Elections: ఏడాదికి 4 ఉచిత సిలిండర్లతో పాటు ఫ్రీ విద్య, వైద్యం అందిస్తామన్న బీజేపీ

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో ఓటర్లపై హామీల వర్షం కురిసింది. పార్టీల వాగ్దానాల కింద తడిసి ముద్ధైపోయారు ప్రజలు. తాము గెలిపిస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అంటూ మేనిఫెస్టోల రూపంలో హామీల వరద పారించాయి పార్టీలు. నువ్వు ఒకటి ప్రకటిస్తే.. తాను రెండు ప్రకటిస్తాను అన్నట్టు పోటా పోటాగా సంక్షేమ పథకాలను గుప్పించారు. పార్టీలు ప్రకటించిన సంక్షేమ హామీలను చూసి జనాలే ఆశ్చర్యపోయారు. ఇక మనం ఏం చేయాల్సిన పని ఏమీ లేదు. తిని కూర్చుంటే చాలు...అన్నీ గెలిచిన ప్రభుత్వమే తెచ్చి పెడుతుంది అన్నంతగా హామీలు కుమ్మరించాయి.

ప్రజలకు సంక్షేమ పథకాలు అందాల్సిందే. కానీ అవి అవసరం అయిన మేరకు ఉంటేనే..ఆర్థిక సమతుల్యత ఉంటుంది. అభివృద్దికి కూడా నిధులు కేటాయిస్తేనే..రాష్ట్రం పురోగతి చెందుతుంది. కానీ ఎన్నికల్లో గెలుపే లక్ష‌్యంగా హామీల వరద పారించడంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

పార్టీలు హామీల వర్షం కురిపించాయి సరే. కానీ వాటికి నిధులు ఎక్కడి నుంచి సమకురుస్తారు అనేది ఏ ఒక్క పార్టీ కూడా చెప్పలేదు. రాష్ట్ర బడ్జె‌ట్‌ను దృష్టిలో పెట్టుకునే పార్టీలు మేనిఫెస్టోను రూపొందించాయా లేక గాలిలో మేడలు లాగా ఊరికే వాగ్దానాలు ప్రకటించాయా అనే డౌట్స్ వస్తున్నాయి. ఈ విషయంలో ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదు అన్ని పార్టీలదీ ఇదే తీరు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలు అయిందని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.

రాష్ట్రం నెత్తిపై 5లక్షల కోట్ల అప్పులు ఉందని ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. కానీ అవే పార్టీలు.. అంతకు మించిన సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డాయి. మరి ప్రకటించిన మేనిఫెస్టోను ఎలా అమలు చేస్తాయని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆయా పార్టీల వల్ల అవుతుందా కాదా అనే చర్చ జరుగుతోంది.

ఇప్పుడు పార్టీలు ప్రకటించిన సంక్షేమ పథకాలతో.. బడ్జెట్‌పై విపరీతమైన భారం పడుతుంది. ఇప్పుడున్న సంక్షేమాలకే నిధులు సమకూర్చేలేక బీఆర్ఎస్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతుంది. వాటి కోసం భూములు కూడా అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది. మరి కొత్త హామీలకు ఎక్కడి నుంచి డబ్బు తెస్తారు. కొత్తగా అప్పులు చేస్తారా లేక ప్రజలపై పన్నుల భారం మోపుతారా అనే చర్చ నడుస్తోంది. కొత్తగా అప్పులు చేయాల్సి వస్తే.. రాష్ట్ర అప్పుల చిట్టాల ఇంకాస్త పెరిగి.. ఆర్ధిక సమతుల్యం దెబ్బ తిని,, తెలంగాణ అధోగతి పాలు అవుతుంది.

ఇక ప్రజలపై పన్నుల భారం మోపితే.. వారి ప్రజలు ఎక్కడి నుంచి తెస్తారు. వారి డబ్బునే ఒక చేత్తో తీసుకుని..మరో చెత్తో ఇచ్చినవారు అవుతారు.ఇక ఉన్న బడ్జెట్ అంతా.. సంక్షేమాలకే ఖర్చు అవుతే.. ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు ఎలా.. అభివృద్ధి పరిస్థితి ఏంటి అనే డౌన్స్ ఉత్పన్నం అవుతున్నాయి. 2023లో తెలంగాణ బడ్జెట్ 2లక్షల 90వేల కోట్లు.. అందులో రెవెన్యూ బడ్జె‌టే 2లక్షల 11వేల కోట్లకు చేరింది.

కేవలం 37వేల కోట్లనే కేపిటల్ వ్యయం కింద ఖర్చు చేస్తున్నారు. బడ్జెట్‌లో 40 నుంచి 50వేల కోట్ల వరకు బడ్జెట్ లోటు ఉంటోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రంగంపైనా పన్నులు పెంచకుండా, భూములు అమ్మకుండా మేనిఫెస్టో హామీలు అమలుచేయగలరా? అని మేధావుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2023-24లో అన్ని రాబడులు కలిపి 2,59,861 కోట్లు ఉంటాయని సర్కారు అంచనా వేసింది. ఆగస్టు నాటికి 99,108 కోట్లు మాత్రమే ఖజానాకు సమకూరాయి. దానితో ప్రభుత్వ భూముల అమ్మకం, మరికొన్ని మార్గాల ద్వారా 19,553 కోట్ల రూపాయలు సమకూర్చుకోగలిగింది. అందుకు చాలా కష్టపడాల్సి వ చ్చింది. బీజేపీ పాలితప్రాంతాల్లో మాదిరిగా తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ సర్కారు గ్రాంట్లు ఇవ్వడం నిలిపివేసింది.

అసలు తెలంగాణకు నికర రాబడి 1.51 లక్షల కోట్ల రూపాయలు. వివిధ వర్గాలకిచ్చే సబ్సిడీలకు చెల్లింపులు, ప్రభుత్వోద్యోగుల జీతాలు, ఉద్యోగులకు రుణాలు, పెన్షన్లు 60 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. వీటి చెల్లింపులతోపాటు.. పార్టీలు కొత్తగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే.. వచ్చే కొత్త ప్రభుత్వం ఏదైనా.. పాలకులు ఎవరైనా.. పార్టీలు ఏవైనా కనీసం మూడున్నరలక్ష కోట్లకు పైగా బడ్జెట్‌ ప్రవేశపెట్టడం అనివార్యం. లేకపోతే ఇచ్చిన హామీలఅమలు దుర్లభం.

పదేళ్లు అధికారంలో ఉంటూ.. అటు సంక్షేమం-ఇటు అభివృద్ధిలో సమతుల్యం పాటిస్తున్న కేసీఆర్‌ సర్కారే.. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు, ఖజానాను పరిపుష్ఠం చేసేందుకు శివారు ప్రాంతాల్లో భూములు అమ్మాల్సివచ్చింది. అంటే రానున్న రోజుల్లో ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీల కోసం, ఇంకెన్ని భూములు తెగనమ్ముతారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. భావితరాల కోసం- ప్రభుత్వ భవిష్యత్తు అవసరాల కోసం దాచి ఉంచాల్సిన ప్రభుత్వ భూములను తెగనమ్ముకుంటే, ఇక ప్రభుత్వ భూములు కనుమరుగవడం ఖాయమన్నది పౌరసమాజం ఆందోళన.

ఈ ఎన్నికల్లో అందరికంటే ఖరీదైన హామీలిచ్చిన కాంగ్రెస్‌.. తాను అధికారంలోకి వస్తే హామీలకు సంబంధించిన ఆర్ధిక సవాళ్లు ఎలా అధిగమిస్తుందో చెప్పలేదు. ఇందిరమ్మ ఇళ్లకు ఐదేసి లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం రాష్ర్టంలో అర్హుల సంఖ్య 10 లక్షల మంది. ఆ ప్రకారం 50వేల 250 కోట్లు ఆ పథకానికి సమకూర్చాల్సి ఉంది.

ఆసరా పెన్షన్లను 4 వేల రూపాయల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రస్తుతం 44 లక్షల మంది ఆ పథకానికి అర్హులున్నారు. ఆ ప్రకారంగా ఆ పథకం కింద 21వేల 120 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పథకానికి ఏడాదికి 11,918 కోట్లు చెల్లిస్తున్నారు. రేపు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే, ఈ పథకానికి అదనంగా 9,202 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఆ నిధులు ఎక్కడి నుంచి.. ఎలా సమకూరుస్తారో కాంగ్రెస్‌ పార్టీ వివరించలేదు.

రైతుభరోసా కింద ప్రతి రైతుకూ ఏడాదికి, 15 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. గణాంకాల ప్రకారం తెలంగాణలో కోటిన్నర ఎకరాలుంటే.. కాంగ్రెస్‌ హామీ ప్రకారం ఆ హామీ అమలుకు 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. రైతు కూలీలకు ఏడాదికి 12 వేల భృతి ఇస్తానని ప్రకటించింది. ప్రస్తుతం ఉపాథి హామీ పనులు చేసే జాబ్‌ గ్యారెంటీ హోల్డర్ల సంఖ్య 52.92 లక్షల మంది. వారికి ఇచ్చిన కొత్త హామీ ప్రకారం 2,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంది.

ఇక గ్యాస్‌ సిలిండరు 500 రూపాయలకే ఇస్తామన్నది కాంగ్రెస్‌ మరో హామీ. దానికి ఏడాదికి 3వేల కోట్లకుపైనే ఖర్చు అవుతుంది. బీఆర్ఎస్‌ అయితే 400లకే ఇస్తామంటోంది. ఆ భారం ఇంకాస్త ఎక్కువే ఉండనుంది. నిరుద్యోగ భృతి కింద ఏడాదికి 4,800 కోట్లు ఖర్చు చేయడం ఖజానాకు కత్తిమీద సామే. అలాగే 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించింది. ఆ రకంగా 70 లక్షల మందికి ఏడాదికి 2,500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల ఖరీదు 68వేల 652 కోట్లు. ఇది ఇప్పటి ఖర్చులకు అదనం. కేసీఆర్‌ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌.. కొత్తగా 52 వేల కోట్ల విలువైన అదనపు ఆర్ధిక భారం మోస్తామని ప్రకటించింది. పేదలకు 5 లక్షల బీమా, ఆసరా పెన్షన్లు 5,106 రూపాయలకు పెంపు, రైతుబంధు సాయం 16 వేలకు పెంపు, అర్హులైన మహిళలకు నెలకు 3 వేల రూపాయల భృతి హామీలు గుప్పించింది. వాటిని అమలు చేయాలంటే అదనంగా 52 వేల కోటల రూపాయల భారం అవుతుంది. ఇవన్నీ నెరవేర్చాలంటే ప్రజలపై బాదుడు తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories