ఆ మాజీ మంత్రికి అంత తొందరెందుకు?

ఆ మాజీ మంత్రికి అంత తొందరెందుకు?
x
Highlights

ఆ మాజీ మంత్రి ఉన్న పార్టీని వీడి అధికార పార్టీలోకి జంప్ అవుతారని జరుగుతున్న ప్రచారం నిజమేనా..? ఆయన వస్తానంటే వద్దంటూ అక్కడి నాయకులు ఎందుకు...

ఆ మాజీ మంత్రి ఉన్న పార్టీని వీడి అధికార పార్టీలోకి జంప్ అవుతారని జరుగుతున్న ప్రచారం నిజమేనా..? ఆయన వస్తానంటే వద్దంటూ అక్కడి నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? ఇంతకీ ఏదా నియోజకవర్గం..? ఎవరా నాయకుడు..?

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఇప్పుడు ఆ జిల్లాలో జరుగుతున్న చర్చ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైద్య,ఆరోగ్య శాఖా మంత్రిగా ఓ వెలుగు వెలిగిన కొండ్రు మురళీ, 2014 ఎన్నికల అనంతరం చాలాకాలం సైలెంట్ అయిపోయారు. కాగా 2019 ఎన్నికలకు స్వల్ప వ్యవధి ముందు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కొండ్రు మురళి, తెలుగుదేశం గూటికి చేరారు.

అయితే రాష్ట్రంలో తుఫానును తలపించేలా వీచిన ఫ్యాన్ గాలికి కొండ్రు అడ్రస్ గల్లంతయ్యిందట. దీంతో మహామహులకే రాజకీయాల్లో ఓటములు తప్పలేదు తానెంత అనుకుని మరోసారి మౌనదీక్ష చేపట్టారట మురళి. కాగా కొద్దిరోజులుగా కొండ్రు మురళి తెలుగుదేశం పార్టీ వీడనున్నారు అంటూ జరుగుతున్న ప్రచారం, రాజాం నియోజకవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తోందట.

వాస్తవానికి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న రాజాం నియోజవకర్గంలో, బలమైన నాయకుడిని పోటీలో ఉంచి ఎన్నికల్లో ఉనికిని చాటుకోవాలని టిడిపి భావించింది. అందులో భాగంగా 2019 ఎన్నికల ముందు అడ్డంకులను పక్కకుపెట్టి మరీ, పార్టీలోకి కొండ్రు రాకను స్వాగతించింది. అయితే ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన మురళి, కొంతకాలంగా స్తబ్దుగా ఉంటున్నారట. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ క్రియాశీలక పాత్ర పోషించిన దాఖలా కనిపించలేదట. అయితే రాజకీయంగా ఎదగాలంటే సైలెంట్‌గా ఉండకూడదనే సూత్రాన్ని అవపోసన పట్టిన మురళి, అడపాదడపా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారట.

ఇంతవరకు బాగానే ఉన్నా, ఇటీవల జరుగుతున్న పరిణామాలు కొండ్రు మురళిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయట. ఇటీవల రాజధాని మార్పు విషయంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మురళీ వ్యవహరించారట. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, మురళీ స్వాగతించారు. అంతేకాకుండా టిడిపి అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న నిర్ణయం తీసుకోవటంతో, కొండ్రు మురళి పార్టీ మారాలనే ఆలోచనలో పడ్డారట. దీనిలో భాగంగా వైసీపీ నేతలతో సదరు నాయకుడు టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ తరుణంలో కొండ్రు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవ్వాలనే ఆలోచన చేస్తున్నారన్న చర్చ జరుగుతున్నా, ఆయన రాకను రాజాం అధికార పార్టీ నాయకులు వ్యతిరేకిస్తుండటంతో, వెనకాముందు ఆడుతున్నారట కొండ్రు.

ముఖ్యంగా కొండ్రు రాకను రాజాంలోని వైసిపి ముఖ్య, ద్వితీయ శ్రేణి నాయకులూ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారట. అవకాశవాద రాజకీయాల కోసమే కొండ్రు వైసిపి లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని చర్చించుకుంటున్నారట. మరికొందరు నాయకులైతే, ఒక అడుగు ముందుకేసి, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జగన్ ని, నాయకులని బహిరంగంగా తిట్టడమేకాక తమను ఇబ్బందులకు గురిచేసి ,ఇప్పుడు తమ పార్టీలోకి ఎలా వస్తారంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారట.

ఇదిలావుంటే, కొండ్రు వైసిపిలో చేరుతారనే వార్తలతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సైతం గుర్రుగా ఉన్నారట. కొండ్రు చేరిక పార్టీకి చేటు చేస్తుందే తప్ప మేలు చేయదని పార్టీ పెద్దల దగ్గర చెప్పుకొస్తున్నారట. అదేకాక కొండ్రుపై నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల సమయంలో పెద్దదెబ్బగా మారే అవకాశం లేకపోలేదని, ఈ నేపథ్యంలో కొండ్రుమురళిని పార్టీలోకి ఆహ్వానించే విషయంలో హైకమాండ్ ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలని కోరుతున్నారట. ఇవన్నీ ఒకవైపయితే, కొండ్రు చేరిక వల్ల పార్టీలో చీలిక కూడా ఏర్పడుతుందని, ప్రధానంగా మొదటి నుంచి పార్టీ జెండాను భుజాన మోసిన నాయకులు పార్టీని వీడినా ఆశ్చర్యం లేదని పలువురు నాయకులు పార్టీ పెద్దల దగ్గర తెగేసి చెబుతున్నారట. మొత్తం మీద రాజకీయ భవితవ్యం కోసం ఆలోచనలు చేస్తున్న కొండ్రు మురళి, నిజంగానే టిడిపిని వీడుతారా వీడినా మురళికి వైసిపిలోకి లైన్ క్లియర్ అవుతుందా స్థానిక నాయకుల వ్యతిరేకత నేపథ్యంలో వైసిపి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories