కరోనా పరీక్షలు పెంచండి.. తెలంగాణాకు హైకోర్ట్ ఆదేశం

కరోనా పరీక్షలు పెంచండి.. తెలంగాణాకు హైకోర్ట్ ఆదేశం
x
Highlights

తెలంగాణలో జరుగుతున్న కరోనా పరీక్షలపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా మృతదేహాలకు కొవిడ్ టెస్టులు అవసరం లేదన్న ప్రభుత్వ...

తెలంగాణలో జరుగుతున్న కరోనా పరీక్షలపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా మృతదేహాలకు కొవిడ్ టెస్టులు అవసరం లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరీక్షలు ఎందుకు ఎక్కువగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మార్చ్ 11 నుంచి నిర్వహించిన పరీక్షల వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

తెలంగాణలో సరైన సంఖ్య కరోనా పరీక్షలు జరగడం లేదని డాక్టర్లకు మాస్కులు ఇవ్వడం లేదని రాష్ట్రానికి తిరిగివచ్చిన వలస కార్మికులకు సరిపడా వసతి కల్పించడం లేదంటూ హైకోర్టులో మొత్తం 5 రకాల పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కరోనా విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించరాదంటూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు వేసింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎందుకు తక్కువ పరీక్షలు జరుగుతున్నాయని అన్ని రాష్ట్రాలు కూడా ఐసీఎంఆర్ నిబంధనలు పాటిస్తుండగా ఇక్కడెందుకు అమలు కావడం లేదని అడిగింది. ఒక మిలియన్ జనాభాకు రాష్ట్రంలో కేవలం 545 పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయని నిలదీసింది. అలాగే రాష్ట్రానికి తిరిగొస్తున్న వలసకార్మికులకు ఎంతమందికి కరోనా పరీక్షలు నిర్వహించారని ప్రశ్నించింది. హైరిస్క్‌ అవకాశం ఉన్న వారికి లక్షణాలు లేకపోతే పరీక్షలు ఎందుకు నిర్వహించరని అడిగింది. ఇప్పటివరకు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ కేసులకు ఎందరికి పరీక్షలు నిర్వహించారో తెలిపాలంది. కరోనా పరీక్షలపై కేంద్రం రాసిన లేఖలను సమర్పించాలని ఆదేశించింది.

ఈ సందర్భంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 24 వేల 443 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అడ్వకేట్‌ జనరల్‌.. హైకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. పరీక్షలు చేయకపోతే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తికి ప్రభుత్వమే కారణమవుతుందని స్పష్టం చేసింది. మార్చి 11 నుంచి ఇప్పటివరకు చేసిన కరోనా పరీక్షల వివరాలన్నీ సమర్పించాలని ఆదేశించింది. అలాగే కరోనా రక్షణ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో ఎంతమంది వైద్య సిబ్బందికి అందజేశారో తెలియజేయాలని స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో మరణించిన వారి మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాలన్న హైకోర్టు జూన్ 4 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమెరికా లాంటి దేశంలో ఇప్పటికే లక్ష మంది ప్రాణాలు కోల్పోయారని తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దనే ఆశిస్తున్నామని ధర్మాసనం తెలిపింది.

మరోవైపు కరోనా పరీక్షల విషయంలో కేంద్రం నుంచి సరైన సహకారం అందడం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వెయ్యి వెంటిలేటర్లు కావాలని కేంద్రాన్ని కోరితే ఇంతవరకు స్పందన లేదని స్పష్టం చేశారు. అమెరికన్ ఇండియా ఫౌండేషన్‌, గ్రేస్ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మైక్రాన్ సంస్థ 100 వెంటిలెటర్లను అందజేసిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని.. అందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని.. మంత్రి ఈటల తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories