ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు సుప్రీం పచ్చజెండా: ఎంఆర్ పీఎస్ పాత్ర ఏంటి?

Supreme green flag for sub-categorization of SC and ST reservations What is the role of MRPS?
x

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు సుప్రీం పచ్చజెండా: ఎంఆర్ పీఎస్ పాత్ర ఏంటి?

Highlights

ఎస్సీ సామాజికవర్గాన్ని జనాభా దామషా ప్రకారంగా వర్గీకరించి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో 1994 జూలై 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఈదుమూడిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆగస్టు 1న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఆడ్మిషన్ల కోసం కేటాయించిన రిజర్వేషన్లను రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఎస్సీల వర్గీకరణకు అవకాశం కల్పించనుంది. ఏడు నెలల క్రితం మోదీని పట్టుకొని భావోద్వేగానికి గురైన మందకృష్ణ కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి మందకృష్ణ మాదిగ దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఎస్సీల్లోని మరింత వెనుకబడిన వర్గాలున్నాయని, వారికి కూడా న్యాయం జరగాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తూ వచ్చారు.


ఎంఆర్ పీఎస్ ఎలా పుట్టింది?

ఎస్సీ సామాజికవర్గాన్ని జనాభా దామషా ప్రకారంగా వర్గీకరించి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో 1994 జూలై 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఈదుమూడిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది. మందకృష్ణ మాదిగ వ్యవస్థాపక అధ్యక్షులుగా, కృపాకర్ మాదిగ ఈ సంస్థకు కార్యదర్శిగా పనిచేశారు. ఎస్సీలకు ఉన్న 15 శాతం రిజర్వేషన్ ను 59 కులాలకు దామాషా ప్రకారంగా కల్పించాలనేది డిమాండ్. ఈ డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. అయితే ఈ డిమాండ్ ను ఎస్సీల్లోని మాల సామాజిక వర్గం వ్యతిరేకించింది. ఎంఆర్ పీఎస్ కు పోటీగా మాల మహానాడు కూడా ఉద్యమాన్ని ప్రారంభించింది.


ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరిస్తూ చంద్రబాబు సర్కార్ జీవో జారీ

ఎస్సీ కులాల మధ్య ఉన్న అసమానతలను నివారించేందుకు గాను 1996 సెప్టెంబర్ 10న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రామచంద్రరాజు కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా ఈ కమిషన్ 1997 మేలో రిపోర్ట్ ఇచ్చింది. ఈ కమిషన్ రిపోర్ట్ కు అనుగుణంగా 1997 జూన్ 6న ఎస్సీ వర్గీకరణ కోటాపై జీవోను జారీ చేసింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం. ఎస్సీలను ఎ,బి,సి,డి గ్రూపులుగా వర్గీకరించారు. కేటగిరి ఏలో రెల్లితో పాటు 12 ఉపకులాలకు 1 శాతం, బీ కేటగిరిలో మాదిగలతో పాటు 18 కులాలకు 7 శాతం, సి కేటగిరిలో మాలలతో 25 ఉప కులాలకు 6 శాతం, డికేటగిరిలో ఆదిఆంధ్రులతో పాటు మరో నాలుగు కులాలకు 1 శాతం రిజర్వేషన్ కల్పించారు.


ఏపీ హైకోర్టులో ఎస్సీ వర్గీకరణకు చుక్కెదురు

చంద్రబాబు సర్కార్ జారీ చేసిన రిజర్వేషన్ల జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో మాల మహానాడు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు 1997 సెప్టెంబర్ 18న ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని తెలిపింది. షెడ్యూల్డ్ కులాల్లో మార్పులు చేర్పులు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది.


ఎస్సీ ఏబీసీడీ రిజర్వేషన్లకు అనుకూలంగా చట్టం చేసిన ఏపీ అసెంబ్లీ

ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరిస్తూ 2000లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చట్టం చేసింది. వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారంగా ఆయా కులాలకు కోటాలను నిర్ణయించారు. ఈ చట్టం మేరకు విద్యా సంస్థల ప్రవేశాలతో పాటు ఉద్యోగాల్లో ఏ,బీ,సీ,డీ రిజర్వేషన్లను అమలు చేశారు. దీంతో సుమారు 20 వేలకు పైగా మాదిగ,ఉపకులాలకు ఉద్యోగాలు లభించాయని ఎంఆర్ పీఎస్ నాయకులు చెబుతున్నారు. అయితే వర్గీకరణకు వ్యతిరేకంగా 2004 నవంబర్ లో సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. దీంతో ఈ రిజర్వేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది.


తెరపైకి వచ్చిన ఉషా మెహ్రా కమిషన్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2004లో బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఈ రిజర్వేషన్లకు అనుకూలంగా ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. అంతేకాదు అప్పట్లో ఉషా మెహ్రా కమిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ 2008 మేలో అప్పటి కేంద్ర మంత్రి మీరాకుమార్ కు నివేదికను సమర్పించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ను సవరణ చేసి, 3వ క్లాజ్ ను చేర్చితే రిజర్వేషన్లకు ఇబ్బంది లేదని మెహ్రా కమిషన్ తెలిపింది.


ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని మోదీ హామీ

ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రతి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి. కానీ, అమలు విషయమై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లలేదు. అదే సమయంలో 2014లో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇదే డిమాండ్ ను ఎంఆర్ పీఎస్ తెరమీదికి తెచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయినా... అడుగు ముందుపడలేదు. 2023 నవంబర్ 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అణగారిన వర్గాల విశ్వరూప సభలో మోదీ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన మోదీని పట్టుకొని మందకృష్ణ మాదిగ వేదికపైనే భావోద్వేగానికి గురయ్యారు.

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అధికారులతో కమిటీ

ఎస్ సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం 2024 జనవరి 19న కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా నేతృత్వంలో పనిచేసింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక, న్యాయశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మోదీ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.


20 ఏళ్ల తర్వాత ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం తీర్పు

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా 20 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. 2004లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను వర్గీకరించేందుకు రాష్ట్రాలకు అధికారం ఉంటుందని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఆరుగురు జడ్జిలు ఈ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పును వెల్లడించారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పును వ్యతిరేకించారు. ఈ తీర్పుతో ఎస్సీ వర్గీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి.

ధర్మమే గెలిచిందన్న మందకృష్ణ మాదిగ

సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్ పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పందించారు. ధర్మమే గెలుస్తుందని తమ నమ్మకం నిజమైందని ఆయన చెప్పారు. తమ జాతికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా 30 ఏళ్లుగా పోరాటం చేశామన్నారు. ఈ పోరాటంలో కొందరు అమరులయ్యారని ఆయన గుర్తు చేశారు. వర్గీకరణకు అనుకూలంగా చంద్రబాబు చట్టం చేశారన్నారు. ఈ చట్టం ఆధారంగానే ఇవాళ సుప్రీం తీర్పు వెల్లడించిందన్నారు. వర్గీకరణకు అనుకూలమని చెప్పిన చంద్రబాబు ఏపీ రాష్ట్రంలో కూడా ఈ రిజర్వేషన్లను అమలు చేస్తారని విశ్వాసం ఉందన్నారు.


ఉద్యోగ నోటిఫికేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ అమలు చేస్తాం: రేవంత్ రెడ్డి

ప్రస్తుత ఉద్యోగ నియామాక నోటిఫికేషన్లలో ఏబీసీడీ వర్గీకరణను అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. వర్గీకరణపై ఉన్నత న్యాయస్థానంలో బలమైన వాదనను విన్పించినట్టుగా ఆయన చెప్పారు. అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి మాదిగలకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.


సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు

ఉన్నత న్యాయస్థానం తీర్పుపై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా 2014 నవంబర్ 29న తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ తీర్మానం కాపీని అప్పట్లో ప్రధాని మోదీకి అందించినట్టు చెప్పారు. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఆయన విమర్శించారు.

ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎంఆర్ పీఎస్ నాయకులు చేసిన పోరాటం ఫలించింది. ఇప్పటివరకు ఎన్నికల వాగ్దానాలకే పరిమితమైన ఈ డిమాండ్ కోర్టు తీర్పుతో అడ్డంకులు తొలగాయి. ఆచరణలో పెట్టడమే ప్రభుత్వాల ముందున్న కర్తవ్యం. అయితే ఈ దిశగా పాలకులు నడుస్తారా లేదా అనేది చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories