Kavitha Gets Bail in Delhi Liquor Scam Case: ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు

Kavitha Gets Bail in Delhi Liquor Scam Case
x

Kavitha Gets Bail in Delhi Liquor Scam Case: ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు

Highlights

166 రోజుల తర్వాత కవితకు బెయిల్ లభించింది. ట్రయల్ కోర్టుతో పాటు, దిల్లీ హైకోర్టు కూడా గతంలో ఆమెకు బెయిల్ నిరాకరించాయి. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Supreme Court: దిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ, సీబీఐ కేసుల్లో మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ల సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈడీ తరపున ఏఎస్ జీ వాదించారు. గంటన్నరపాటు ఇరువర్గాలు వాదనలు వినిపించాయి. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం కవితకు బెయిల్ ను మంజూరు చేశారు. రూ. 10 లక్షల పూచీకత్తుతో కోర్టు ఆమెకు బెయిల్ ను మంజూరు చేశారు.

విదేశాలకు వెళ్లాలంటే మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తన పాస్ పోర్టును మేజిస్ట్రేట్ ముందు సరెండర్ చేయాలని కూడా కోరింది. సీబీఐ తుది చార్జీషీట్ దాఖలు చేసింది. ఈడీ విచారణ పూర్తి చేసింది. ఈ తరుణంలో ఆమె జైల్లో ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

166 రోజుల తర్వాత కవితకు బెయిల్

166 రోజుల తర్వాత కవితకు బెయిల్ లభించింది. ట్రయల్ కోర్టుతో పాటు, దిల్లీ హైకోర్టు కూడా గతంలో ఆమెకు బెయిల్ నిరాకరించాయి. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చి 15న ఆమెను ఈడీ అధికారులు హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు. జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్న ఆమెను 2024 ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. 15 రోజులకు లేదా నెలకు ఒకసారి విచారణకు రావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని కూడా కవితను ఉన్నత న్యాయస్థానం కోరింది.

దిల్లీ లిక్కర్ స్కాం ఏంటి?

2021 వరకు దిల్లీలో ప్రభుత్వమే మద్యం విక్రయించేది. అయితే, దీన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు 2021లో దిల్లీలోని ఆప్ సర్కారు కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది.ఈ కొత్త విధానం రూపకల్పనలో దిల్లీ ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోదియా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, మొత్తంగా ఈ కొత్త విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.580 కోట్ల కంటే ఎక్కువే నష్టం జరిగిందని అప్పటి దిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ధిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు నివేదిక పంపారు.

కొంతమంది లిక్కర్ వ్యాపారులకు డిస్కౌంట్లు, లైసెన్సు ఫీజుల్లో మినహాయింపులు లాంటి మేలు చేసేందుకు వారి నుంచి ఆప్ నాయకులు ముడుపులు తీసుకున్నారని నివేదికలో ఆరోపించారు. ఈ విషయమై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ వివాదంపై 2022 ఆగస్టులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ విషయమై దిల్లీకి చెందిన బీజేపీ నాయకులు మంజీందర్ సింగ్ సిర్పా .. ఆప్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేశారు. ఈ విషయమై ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేశారు. ఈ కేసులో తొలుత కవితకు 2022 డిసెంబర్ లో ఈడీ అధికారులు సాక్షిగా సమన్లు పంపారు. ఏడాదిన్నర తర్వాత ఈ ఏడాది మార్చి 15న ఆమెను అరెస్ట్ చేశారు.

ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం

సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు కాపీని జైలు అధికారులకు అందించడంతో పాటు అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తే ఇవాళ సాయంత్రం ఆమె జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని ఆమె తరపు న్యాయవాదులు చెప్పారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పూచీకత్తు బాండ్లను ట్రయల్ కోర్టులో ఇవాళ నాలుగు గంటలకు సమర్పించనున్నారు. ఆ తర్వాత కోర్టు నుంచి జైలుకు మెయిల్ వెళ్తుంది. దీని ఆధారంగా జైలు నుంచి ఇవాళ రాత్రికి ఆమె విడుదలయ్యే అవకాశం ఉందని న్యాయవాదులు చెప్పారు.ఆ తర్వాత కవిత విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే దిల్లీకి చేరుకున్న మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, హరీష్ రావులు సహా ఆ పార్టీకి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ కు తిరిగి రానున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories