Telangana: కాంగ్రెస్‌లో సీనియర్లకు ఆ వ్యూహకర్త చుక్కలు చూపిస్తున్నారా?

Sunil Kanugolu Key Report On T Congress Leaders To Rahul Gandhi
x

Telangana: కాంగ్రెస్‌లో సీనియర్లకు ఆ వ్యూహకర్త చుక్కలు చూపిస్తున్నారా?

Highlights

T Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లకు ఆ వ్యూహకర్త చుక్కలు చూపిస్తున్నారా?

T Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లకు ఆ వ్యూహకర్త చుక్కలు చూపిస్తున్నారా? నా మాటే శాసనమన్నట్టు కత్తులు దూసిన నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారా? గాంధీభవన్‌లో సీనంతా ఇప్పుడు తారుమారవుతోందా? హస్తంలో ఆయనదే హడావిడి, ఆయన రాసిందే రాత, గీసిందే గీతలా మారిందా? కురువృద్ధులకు కూడా చుక్కలు చూపిస్తున్న ఆ వ్యూహకర్త ఎవరు? సిట్టింగ్‌ల సీటు కిందికి నీళ్లు తెస్తున్న ఆ స్ట్రాటజిస్టు ఎవరు?

తెలంగాణ కాంగ్రెస్‌లో మొన్నటి వరకు నాదే హవా అంటూ కొందరు... లేదు లేదు... మేము చెప్పిందే వేదమంటూ మరికొందరు.. ఇలా ఎవరికి వారు కత్తులు దూసుకుంటున్న నేతలకు మూడో వ్యక్తి ముచ్చెమటలు పట్టిస్తున్నారట. ఆయనే వ్యూహకర్త సునీల్‌ కనుగోలు.! మాదంతా ఒకే పార్టీ... మేమంతా ఒక్కటే అంటూ రెండు వర్గాలను ప్రోత్సహిస్తున్న నేతలకు సునీల్‌ కనుగోలు చుక్కలు చూపిస్తున్నారట. రాష్ట్ర పార్టీలో ఇప్పుడంతా ఈయనదే హడావిడట. ఈయన చెప్పిందే వేదం ఆయన రాసిందే రాత ఆయన గీసిందే గీతట. ఎంతటి స్థాయిలో ఉన్న నాయకులైనా సునీల్‌ను గుడ్డిగా ఫాలో అవడం మినహా చేసేదేమీ లేదని ఫీలవుతున్నారట.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పడు ఒక్కటే మాట వినిపిస్తోంది. రాష్ట్ర పార్టీని రాజకీయ వ్యూహాకర్త సునీల్ కనుగోలు శాసిస్తున్నాడని! సునీల్ కనుగోలును తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు రాజకీయ వ్యూహాకర్తగా కాంగ్రెస్ అధిష్టానం నియమించినప్పటి నుంచీ పార్టీలో సీను స్లోగా సితారవుతోందట. ఎలాగైనా ఈసారి తెలంగాణలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా సునీల్ వ్యూహాలు రచిస్తుండటం, ఇందుకోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుండటం పార్టీ సీనియర్లకు నచ్చడం లేదన్న టాక్‌ వినిపిస్తోంది.

ఇప్పటికే సునీల్ తెలంగాణలో పర్యటించి పార్టీ పరిస్థితులపై రాహుల్‌గాంధీకి ఓ రిపోర్ట్ ఇచ్చాడట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 7 ఎంపీ సీట్లు, 40 ప్లస్ అసెంబ్లీ సీట్లను గెలిచే అవకాశం ఉందని రిపోర్ట్‌లో తేలిందట. మరింత కష్టపడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారట. రాహుల్‌గాంధీ కూడా మొన్నటి తెలంగాణ పర్యటనలో పార్టీ నేతలకు ఈ విషయంపై గట్టిగానే మందలించారట. అంది వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని భావిస్తున్న అధిష్టానం తెలంగాణపై ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేసి పంపాలని సునీల్‌కు కంప్లీట్‌ ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చిందట.

దీంతో సునీల్ కనుగోలు ఫుళ్లు యాక్టివ్‌ అయ్యారట. ఈయన ఇచ్చిన నివేదికను బేస్‌ చేసుకొని అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుందట. కాంగ్రెస్ నేతలను అంటే వాళ్లు జూనియర్లైనా, సీనియర్లైనా ఎవరైనా వాళ్ల ముందుడి నడిపించాలని సునీల్‌కు చెప్పినట్టు సమాచారం. అంతేకాదు సునీల్‌కు పార్టీలో ఇంపార్టెంట్ రోల్ కూడా ఇచ్చిన హైకమాండ్‌ పెద్దలు రీసెంట్‌గా ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలుకోసం ఎనిమిది మంది సీనియర్ నేతలతో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేసింది. ఆ కమిటీలో సునీల్ కనుగోలుకు చోటు కల్పించిందట. కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు సునీల్‌కు కూడా అందులో అవకాశం ఇవ్వడం చూసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు షాక్‌కు గురైనట్టు సమాచారం.

హస్తిన పెద్దలు సునీల్‌కు ఇస్తున్న ఇంపార్టెన్సీ చూసి హస్తం పార్టీలోని సీనియర్ నేతలు కూడా సైలెంట్ అవుతున్నారట. అధిష్టానం ఆదేశాలతోనే రాష్ట్ర పార్టీని, నేతలను సునీల్‌ డైరెక్షన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇతర సీనియర్‌ నేతలతో పాటు ఇతర నాయకుల్ని కూడా సునీల్ మానిటరింగ్ చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. సునీల్ డైరెక్షన్ మేరకే హస్తం నేతలు పని చేస్తున్నారని, నేతల స్థాయిని బట్టి వారికి దిశానిర్దేశం చేస్తున్నారని గాంధీభవన్‌లో ఓ చర్చ జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసమస్యలు, సర్కార్‌పై విమర్శలు, కేసీఆర్‌పై తిట్ల దండకం, బర్నింగ్‌ ఇష్యూస్‌తో పాటు ఇతర అంశాలను విభజించి సునీల్ కనుగోలు నేతలకు అసైన్ చేస్తున్నారట. అందులో భాగంగానే రచ్చబండ కార్యక్తమాలు, హస్తం నేతల ప్రెస్‌మీట్లు, పోరాటాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ సొంతూరులో ప్రారంభించాలని చెప్పింది కూడా సునీలేనట. ఇలా ప్రతి కాంగ్రెస్ ప్రోగ్రామ్‌ను డిసైడ్‌ చేస్తున్న సునీల్ ఆదేశాలతోనే ఈ మధ్య నేతలు గాంధీభవన్‌లో, జిల్లా కేంద్రాల్లో ప్రెస్‌మీట్లు పెడ్తున్నట్లు టాక్. ఆ మధ్య మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇద్దరు కలిసి రాష్ట్రంలో వైద్యం కరువైందని గళమెత్తడం, అంతకుముందు రాజ్యసభ సభ్యుల ఎంపికలో కేసీఆర్ డబ్బున్న వాళ్ళకే ఇచ్చారని విమర్శలు గుప్పించడం, ధాన్యం కొనుగోలు, పోడు భూములపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దాసోజు శ్రవణ్‌ దుమ్మురేపడం వెనుక కూడా సునీల్‌ ఆదేశాలే ఉన్నాయని వినికిడి.

దీంతో పాటు, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల్లో బలమైన నేతలను కూడా సునీలే గుర్తిస్తున్నట్టు సమాచారం. ఒకే నియోజకవర్గంలో ఒక్కరే కాకుండా ఇద్దరు ముగ్గురు నేతలను పరిశీలిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ ఇన్ఫర్మేషన్‌తో ఇప్పటికే సునీల్ కనుగోలు 60పైగా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై పూర్తి నివేదిక తయారు చేశారని చెప్పుకుంటున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో పని పూర్తైన తర్వాత పీసీసీకి నివేదిక ఇవ్వనున్నారని తెలుస్తుంది. దీంతో చాలా మంది నేతలు సునీల్ రిపోర్ట్‌లో మంచి మార్కులు కొట్టేందుకు తమ నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంతగా శ్రమిస్తున్నారట. ఎన్ని వీలైతే అన్ని పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారట. ఎలాగైనా తమ గురించి హైకమాండ్‌కు పాజిటివ్ రిపోర్ట్ వెళ్లేలా జాగ్రత్తపడుతున్నారట కొందరు నేతలు.

ఇన్ని రోజులు హైకమాండ్ ఆశీస్సులతో టిక్కెట్ తెచ్చుకున్న నేతలు ఈసారి అదిష్టానం కంటే ముందు సునీల్ కనుగోలును సాటిస్‌ఫై చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఏమైనా, ఒకవైపు పార్టీలో కొత్త నిబంధన, మరోవైపు పనితీరుతోనే టికెట్ల కేటాయింపు జరుగుతుండటంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో గతంలో పోటీ చేసిన చాలామంది నేతల టికెట్లు గల్లంతు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో కింది స్థాయి నాయకులకు సైతం పని విభజన చేస్తున్న సునీల్‌ కాంగ్రెస్ నేతలపై ఎవరైన విమర్శలు చేస్తే.. ఎవరు మాట్లాడాలి, ఎలా జనాల్లోకి వెళ్లాలని కూడా ఆయనే డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఏఐసీసీ ఆదేశాలతో సీనియర్ నేతలు కూడా గుడ్డిగా సునీల్‌ను ఫాలో అవుతున్నారట. మరి హస్తం నేతలు ఈ పరిస్థితులను ఎలా తమకు అనుకూలంగా మలుచుకుంటారో సునీల్‌ సూచనలతో అధిష్టానం వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories