Summer Effect: పేదవాడి ఫ్రిజ్ గా ఆదిలాబాద్ రంజన్లు ప్రసిద్ధి

Adilabad Ranjan pots selling like Hot Cakes
x
ఆదిలాబాద్ రంజన్స్ (ఫోటో ది హన్స్ ఇండియా)
Highlights

Summer Effect: నీళ్లను చల్లగా ఉంచడంతో పాటు రుచిగా ఉండడంతో డిమాండ్

Summer Effect: ఆదిలాబాద్ రంజన్లు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వారుండరు. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఇవి గుర్తుకు వస్తాయి. పేదవాడి రిఫ్రిజిరేటర్ గా చెప్పుకునే వీటికి సౌత్ ఇండియాలోనే మంచి డిమాండ్ ఉంది. నీటిని చల్లగా ఉంచడంతో పాటు చూడటానికి అందంగా ఉండడం వల్ల వీటికి మంచి ఆదరణ లభిస్తోంది.

పేదవాడి ఫ్రిజ్ గా పిలువబడే ఆదిలాబాద్ రంజన్లు చాలా పేరు గాంచినవి. మట్టి చల్లదనాన్ని ఇస్తుండటంతో ఇక్కడ తయారైన రంజన్లు తెలుగు రాష్ట్రలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర లోని పలు ప్రాంతాలకు దిగుమతి చేసుకుంటారు. వీటి తయారీ గురించి, వాటిని వాడుతున్న చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడి కుమ్మరి వారు రంజన్ల తయారీలో ఉపయోగించే మట్టి సేకరణ నుంచే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వీటి తయారీలో నాణ్యత కలిగిన బంకమట్టిని సేకరించి పొడిగా కలుపుతారు. నీళ్లతో తడిపిన మిశ్రమాన్ని అలాగే కొద్ది రోజుల పాటు ఉంచుతారు. తర్వాత గుర్రపు లద్ది కలిపి రంజన్లను చేతితో తయారు చేసి ఆరబెడతారు. అలా ఓ క్రమ పద్దతిలో పేర్చి మంటల్లో కాలుస్తారు. కాల్చిన తర్వాత ఏర్పడే రంధ్రాల నుంచి నీరు బయటకు రానప్పటికీ వాటి గుండ గాలి తగలడంతోనే అతి తక్కువ సమయంలో వాటిలోని నీరు చల్లగా ఔతుంది.

వేసవి వచ్చిందంటే రంజన్ ను కొనుక్కొని చల్లటి నీటు తాగుతారు. దీంతో ఇవి పేదోడి ఫ్రిజ్ గా ప్రసిద్ధి చెందింది. విడిగా 80 రూపాయల నుంచి 300 రూపాయల వరకు లభించే ఈ రంజన్లకు ఎండాకాలంలో మాత్రం బాగా గిరాకీ ఉంటుంది. సీజన్ లో తప్పించి ఏడాది పొడవునా తమకు మరో ఉపాధి లేక బ్రతుకు భారంగా మారిందని కుమ్మరులు వాపోతున్నారు.

ప్రభుత్వం రంజన్ల తయారిని కుటీర పరిశ్రమగా గుర్తించి, ముడిసరుకు తక్కువ ధరకు అందించాలని, ఆర్థిక సహయం చేసి రంజన్ల విక్రయానికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కుమ్మరులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories