TS News: తెలంగాణలో జోరందుకున్న జంపింగ్స్.. ఆపరేషన్ ఆకర్ష్ మరింత పదునెక్కే ఛాన్స్
TS News: గేమ్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్
TS News: గులాబీ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. గతంలో కేసీఆర్ అనుసరించిన ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం..ఇప్పుడు బీఆర్ఎస్‌కే రివర్స్ కొడుతోంది.ఒకే ఒక్క ఓటమి కారు పార్టీని కల్లాస్ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలు వరుసగా గుడ్‌బై చెప్పేస్తున్నారు. కాంగ్రెస్, కమలం తీర్థం పుచ్చుకుంటున్నారు. గేట్లు తెరిచానంటూ సీఎం రేవంత్ హెచ్చరిండంతో బీఆర్ఎస్ నుంచి ఆపరేషన్ ఆకర్ష్ మరింత పదునెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి పడే నెక్ట్స్ వికెట్ ఎవరనే చర్చ జరుగుతోంది.
లోక్‌సభ ఎన్నికల ముందు జంపింగ్ జపాంగ్‌లతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్‌హాట్‌గా మారాయి. గతంలో చేరికలతో ఫుల్ అయిన కారు పార్టీకి ఇప్పుడు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎంపీలు, తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా గులాబీ పార్టీకి గుడ్ చెప్పి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి కారు పార్టీ నేతలకు గాలం వేస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో సీటు హామి ఇస్తూ పార్టీలో చేర్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండేటంతో.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఫైట్ అంటూ.. కారు పార్టీని సైడ్ చేసే ఎత్తులతో ముందుకు వెళ్తున్నారు.ఫలితంగా మొన్నటి వరకు బలంగా కనిపించిన బీఆర్‌ఎస్ ఒకే ఒక్క ఓటమితో కీలక నేతలు చేజారుతూ బలహీనంగా మారుతోంది.
అసెంబ్లీ ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడవకుండానే ఎమ్మెల్యేల జంపింగ్ జపాంగ్‌లు స్టార్ట్ అయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ పక్షాన గెలిచిన మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానంతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు టచ్‌లోకి వెళ్లినట్టు జరుగుతున్న ప్రచారం గులాబీ పార్టీలో గుబులు పెట్టిస్తోంది. గేట్లు తెరిచానని, ఇకపై తన రాజకీయం చూస్తారంటూ సీఎం రేవంత్ హెచ్చరించడం కారు పార్టీని కకావికలం చేస్తోంది. రానున్న రోజుల్లో ఇంకెంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతారో అనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చావు దెబ్బకొట్టాలనే వ్యూహంతో.. కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వక భేటీ పేరిట కలిసినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ పార్టీ మారలేదు. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ పార్టీలోకి, నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే రావడంతో రాజకీయం రసకందాయంలో పడిందని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా, ఏమైనా జరగవచ్చనే ఆలోచనతోనే ఎమ్మెల్యేలను అధికారికంగా పార్టీలో చేర్చుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని, ఆపరేషన్ ఆకర్ష్‌కు ఇక మరింత పదును పెట్టే క్రమంలో గేమ్ స్టార్ట్ చేసిందని చెబుతున్నారు.
ఇటీవల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పక్షాన మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆ సంఖ్య 38 అయ్యింది. అయితే వీరిలో మూడింట రెండొంతుల మంది అంటే 26 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు, రంగారెడ్డి నుంచి ఇద్దరు, మేడ్చల్ నుంచి ఇద్దరు, కొత్తగూడెం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వీరంతా కాంగ్రెస్‌లో చేరతారా లేక మర్యాదపూర్వకంగానే కలిశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే తాము అండగా నిలుస్తామని తనను కలిసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హామీ ఇస్తున్నారని రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు ఈ రోజే గేట్లు తెరిచానని, అవతలివైపు ఎంతమంది ఉంటారో తనకు తెలియదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠకు తావిస్తున్నాయి.
ఓటుకు కోట్లు వ్యవహారం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తమై భవిష్యత్తులో ప్రభుత్వానికి ప్రమాదం లేకుండా ఉండేందుకు అనే కారణం చూపుతూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతూనే ఉంది. ఒక పార్టీలో గెలిచిన వారిని మరో పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా గతంలో పలుమార్లు నిలదీశారు. ఐతే త్వరలోనే కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందంటూ ఇటీవల బీఆర్ఎస్, బీజేపీ నేతలు కామెంట్స్ చేయడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. వారి వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని, అందుకే చేరికలు తప్పడం లేదని కౌంటర్ ఇస్తున్నారు రేవంత్.
బీఆర్‌ఎస్‌కు చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిలు సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అంతకు ముందు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో, రంజిత్‌రెడ్డితో కలిసి మొత్తం ముగ్గురు బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టయింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవాలనే లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. ముందు గ్రేటర్ హైదరాబాద్‌పై దృష్టి పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాలేదు. దీంతో హైదరాబాద్‌లో కాంగ్రెస్ బలాన్ని పెంచుకునేందుకు.. ఇక్కడ లీడర్లకు గాలం వేస్తోంది. ఇప్పటికే ప్రస్తుత జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, వికారాబాద్ జిల్లా ఛైర్ పర్మన్ పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు దానం, రజింత్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో.. భవిష్యత్తులో ఇంకేం జరగబోతోంది అనే ఆసక్తి నెలకొంది. పార్టీ నేతలను కాపాడుకునేందుకు.. ఓ వైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. నేతల గోడ దూకుళ్లు మాత్రం ఆగడం లేదు. ఓ వైపు జంపింగ్‌లు, మరోవైపు కవిత అరెస్టుతో బీఆర్ఎస్ నేతలు, కేడర్‌లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire