Sri Rama Navami 2022: ఘనంగా శ్రీ రామ నవమి వేడుకలు...

Sri Rama Navami 2022 Celebrations in AP and Telangana | Live News
x

Sri Rama Navami 2022: ఘనంగా శ్రీ రామ నవమి వేడుకలు... 

Highlights

Sri Rama Navami 2022: ఘనంగా శ్రీ రామ నవమి వేడుకలు...

Sri Rama Navami 2022: హైదరాబాద్‌లో శ్రీరామ నవమి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. రెండేళ్ల తర్వాత నగరంలో నవమి శోభయాత్ర జరగనుంది. సీతారాంబాగ్ నుండి హనుమాన్ వ్యాయమశాల వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. భారీ హనుమంతుడు, భరత మాత, ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఊరేగించనున్నారు. ధూల్‌పేట్‌, జాలీ హనుమాన్, చుడీ బజార్, గౌలిగూడ మీదుగా యాత్ర సాగనుంది. శోభయాత్ర సందర్భంగా పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బలగాలను మోహరించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారాములకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నాన లోకాభిరాముడి కల్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రామతీర్థంలో నవమివేడుకల్లో కల్యాణోత్సవంపై మా ప్రతినిధి నరసింహా మరింత సమాచారం అందిస్తారు.

వేద మంత్రోచ్ఛారణలు.. మంగళవాద్యారావాలు... శ్రీరామ నామస్మరణతో ఒంటిమిట్ట కోదండరాముని దివ్యసన్నిధిలో ధ్వజారోహణంతో శ్రీరామ నవమి వేడుకలకు నాందీప్రస్తావన జరిగింది. శ్రీరామ నవమి పర్వదినాన శాస్త్రోక్తంగా హనుమద్వజ సంకేతంతో కోదండరాముని బ్రహ్మో్త్సవాలకు సర్వదేవతలను ఆహ్వానించారు. వృషభ లగ్నంలో హనుమ ధ్వజపటాన్ని ఆరోహింపజేయడంతో కోదండరాముని బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో ఈ నెల 15 తేదీన సీతారామ కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. లోక కళ్యాణార్థం నిర్వహించే జగదభిరాముడి కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పిస్తారు.

రాములోరి కల్యాణం ఘడియలు దగ్గర పడుతున్న వేళ భద్రాద్రి ఆలయం శ్రీరామ నామస్వరంతో మార్మోగిపోతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కల్యాణ వైభవాన్ని కనులారా చూసేందుకు భద్రాద్రికి భక్తులు పోటెత్తారు.

భద్రాచలం శ్రీరామనామంతో పులకిస్తోంది. కళ్యాణరాముడి వైభవంతో భద్రాద్రి ఆధ్యాత్మిక వాతావరణంలో అలరారుతోంది. సీతారామ కళ్యాణానికి బంధుమిత్రులుగా వేలాదిమంది భక్తులు చేరుకున్నారు. పొరుగు రాష్ట్రానుంచి జగదభిరాముని కళ్యాణోత్సవంలో భాగస్వామ్యమయ్యారు.

కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండి పుష్కరిణిలో నీరు తెచ్చి స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తున్నారు.

శ్రీరామనవమి పర్వదినాన జగదభిరాముడి కళ్యాణోత్సవానికి సంగారెడ్డి ముస్తబైంది. రామునిపట్ల అత్యంత భక్తివిశ్వాసాలతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం జరిపిస్తున్నారు. భద్రాద్రి తర్వాత అత్యంత వైభవంగా సంగారెడ్డిలో రాములోరి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీ పాటిస్తున్నారు. మాధవానంద సరస్వతి సారథ్యంలో జగ్గరెడ్డి దంపతులు సీతారామకళ్యాణం నిర్వహిస్తున్నారు. లోకాభిరాముడి దివ్యకళ్యాణఘట్టాన్ని కళ్లారా చూసి తరించేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories