టీఎస్ ఎస్ పోలీస్ లకు శిక్షణ షురూ.. తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం

టీఎస్ ఎస్ పోలీస్ లకు శిక్షణ షురూ.. తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం
x
Telangana State Police
Highlights

Training for Special Police in Telangana: ఎట్టకేలకు తెలంగాణా స్టేట్ స్పెషల్ పోలీస్ శిక్షణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

Training for Special Police in Telangana: ఎట్టకేలకు తెలంగాణా స్టేట్ స్పెషల్ పోలీస్ శిక్షణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న గడియ సమీపించింది. వచ్చే నెల మొదటి వారంలో వీరందరికీ శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సంకల్పించింది.

తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌(టీఎస్‌ఎస్‌పీ) కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎదురుచూపులు త్వరలో ఫలించనున్నాయి. 10 నెలల నిరీక్షణకు తెరపడనుంది. అక్టోబర్‌ మొదటివారంలో దాదాపు 4,200 మంది అభ్యర్థులకు శిక్షణ మొదలుకానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పీటీసీ/డీటీసీల్లో కానిస్టేబుళ్లుగా శిక్షణ పొందుతున్న సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌(ఏఆర్‌) అభ్యర్థులకు అక్టోబర్‌ 5 నుంచి 7వ తేదీ వరకు పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌(పీవోపీ) జరగనుంది. ఆ వెంటనే టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థుల శిక్షణను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పదినెలలుగా మానసిక వేదన అనుభవిస్తున్న అభ్యర్థులు, వారి కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఫలితాలు వచ్చిన ఇన్నాళ్లకు.. వాస్తవానికి తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) 2018లో 17,156 కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. 2019 సెప్టెంబర్‌లో సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లకు పరీక్షలు నిర్వహించగా అక్టోబర్‌లోనే ఫలితాలు వచ్చాయి. అయితే, 12 వేల మందికిపైగా సివిల్, ఏఆర్‌ కేడెట్లకు 2020 జనవరిలో శిక్షణ ప్రారంభమైనా స్థలాభావంతో సుమారు 4,200 మంది టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థులకు ఇంకా శిక్షణ మొదలుకాలేదు. ఈ మధ్యకాలంలో టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ అభ్య ర్థులు అనేక కష్టాలు అనుభవించారు. ఇద్దరు అభ్యర్థులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాదాపు ఆరుగురు అభ్యర్థులు వివిధ ప్రమాదాల్లో గాయపడ్డారు. కొందరు కరోనా బారినపడ్డారు. మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు జాబులకు రాజీనామా చేశారు. శిక్షణకు పిలుపు రాకపోవడంతో చాలామంది కూలీ పనులకు వెళ్తున్నారు.

ఆరోగ్యం జాగ్రత్త..

అక్టోబర్‌లో శిక్షణ ప్రారంభం కానుండటంతో అభ్యర్థులంతా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలని, జ్వరాలు, అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలంటున్నారు. శిక్షణ ప్రారంభానికి ముందు అభ్యర్థులందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించనున్నారు. ఎవరికైనా కోవిడ్‌ పాజిటివ్‌ వస్తే, వారిని క్వారంటైన్‌కు పంపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories