బావి ఆత్మకథ..ఆ ఆత్మకథ ఏమిటో మీరూ చూడండి

బావి ఆత్మకథ..ఆ ఆత్మకథ ఏమిటో మీరూ చూడండి
x
Highlights

ఆత్మకథలు అలరిస్తాయా? ఆత్మకథలు ఆకట్టుకుంటాయా? అసలు ఆత్మకథలు మనుషులే రాస్తారా? జంతువులు పక్షులు చారిత్రక కట్టడాలు ప్రదేశాలు కూడా ఆత్మకథలు రాస్తాయా?...

ఆత్మకథలు అలరిస్తాయా? ఆత్మకథలు ఆకట్టుకుంటాయా? అసలు ఆత్మకథలు మనుషులే రాస్తారా? జంతువులు పక్షులు చారిత్రక కట్టడాలు ప్రదేశాలు కూడా ఆత్మకథలు రాస్తాయా? వాటికొచ్చిన భాషల్లో అవి ఆత్మకథలు రాస్తాయి. అవును అలాగే ఓ బావి కూడా తన ఆత్మకథను రాసింది. ఆ ఆత్మకథ ఏమిటో మీరూ చూడండి.

నేను హాజీపూర్‌ బావి. గుర్తుపట్టారా? గుర్తుకొచ్చిందా? నేను ఊరికి బాగా దూరంగా ఉండేదాన్ని. చక్కని గాలి మంచి మనసున్న మనుషులు కల్తీ అంటే తెలియని నీళ్లు విప్లవ వీరులు పోరాటయోధులు, సామాన్య మనుషుల గొంతలు తడిపాను. నా చుట్టూ ఉన్న పంట పొలాలకు నా నీళ్లు పారించి పచ్చగా మార్చాను. నిజానికి అదంతా జరుగుతున్నప్పుడు నా గుండెలు గర్వంతో ఉప్పొంగేవి. నా దగ్గరకు వచ్చిన వాళ్లను తలచుకుని నా అదృష్టానికి మురిసిపోయే దాన్ని. నేననుభవిస్తున్న ఆనందానికి నా వాళ్లయిన నా చుట్టుపక్కల బావులు కుళ్లుకునేవి.

అప్పుడు నేను ఊరికి కాస్త దగ్గరగా వచ్చాను. లేదు లేదు ఊరే నా దగ్గరకు వచ్చింది. జనాభా పెరిగింది. జనాలు రావడం తగ్గింది. కరువు తాండవించింది. నన్ను నిలువునా ఎండబెట్టేసింది. నేను మనసులోనే బాధపడేదాన్ని. ఎలాంటి దాన్ని ఎలా అయిపోతున్నాను అని కుమిలిపోయేదాన్ని. అయితే ఇందులో కూడా కొంత సంతోషకరమైన అంశాన్ని వెతుక్కునే దాణ్ని. నన్ను ఇన్నాళ్లు కాపాడిన నా వాళ్లకు ఏదో రకంగా ఉపయోగపడుతున్నానన్న సంతృప్తి నాకు ఏ మూలో కలిగేది. అలాంటి చిన్న పాటి సంతోషానికే నేను ఎవరెన్ని తప్పులు చేసినా భరించే దాన్ని.

పచ్చటి పైర్లు లేవిప్పుడు. నా గుండెల నిండా నీళ్లు లేవిప్పుడు. కన్నీళ్లు తప్పించి. మంచి గాలి తగిలి చాలా ఏళ్లే అయింది. మంచి నీళ్లు తాగి కాదు చూసి దశాబ్దాలే అయ్యింది. ఇక నా దగ్గరకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. రోజురోజుకు నన్ను పట్టించుకోవడమే మానేశారు. లోకం పూర్తిగా మారిపోయిందన్న భావనతో అల్లాడిపోతున్నాను. నేరమయమైపోయిందనే బాధతో కుమిలిపోతున్నాను. ఇంతకుముందు పిల్లల ఈతలతో, నా గుండెల నుంచి నీళ్లు తోడేస్తున్నా ఆనందంతో కనిపించే నేను కొన్నాళ్ల కింద జరిగిన ఘోరాలను, నేరాలను తలుచుకొని నాలో నేనే గుక్కపట్టి ఏడ్చాను. చెప్పుకునే వారు లేక చేష్టలుడిగి చూస్తుండిపోయాను.

శ్రీనివాసరెడ్డి వీడి పేరు. సైకో కిల్లర్‌ అంటున్నారు. అభంశుభం తెలియని అమాయకుల ప్రాణాలు తీశారని ప్రజలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. నాకు అదే కోపంగా ఉంది. నాతో పాటు ఉండి నన్ను, నా నీటిని వాడుకొని ఇప్పుడు ఇతగాడు చేసిన దుర్మార్గాలను తలుచుకుంటే ఒళ్లు మండిపోతోంది. అప్పుడే నా ఆరోగ్యం పాడవుతోందని నాకు అర్థమైపోయింది. నన్ను నిలువునా ముంచేస్తున్నాడని తెలిసిపోయింది. కానీ ఏం లాభం? ఇలా చెప్పుకొని బాధపడటమే కానీ చేసేదేమీ ఉండదు కద!

నా మీద ఇంతటి దుర్మార్గమైన గాలి వీస్తుందని, ఇంతటి ఘోరమైన పేరు వస్తుందని నేనేనాడూ అనుకోలేదు. చెప్పానుగా ఆరోగ్యం సరిగా లేకపోతే అన్ని వైపుల నుంచి కష్టాలొస్తాయని. ఇప్పుడొచ్చిన కష్టం మా ఊరి నుంచే వచ్చింది. మా ఊరుకే చెందిన, నాకే చెందిన సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాసరెడ్డి చిన్నారుల దోచేసుకున్నాడు. ఛండాలమైన తన నీచమైన కోరికను తీర్చకుంటే ఇక్కడే చంపి నాలో కప్పి ఉంచి తన ఉన్మాదాన్ని చాటుకున్నాడు. నన్ను, నాకున్న పేరును నిట్ట నిలువునా ముంచేశాడు. ఇదంతా చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. పాపం ఆడకూతుళ్లు. ఎంత నరకం అనుభవించి ఉంటారోనని భోరున ఏడ్వాలని అనిపిస్తుంది. అన్నట్లు చెప్పడం మరచిపోయాను. ఇప్పుడా బాధంతా కరిగిపోయింది. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాను.

నన్ను మూసేస్తున్నందుకు బాధ కాదు చాలా సంతోషంగా ఉంది. సైకో కిల్లర్‌ దుర్మార్గాలకు చెక్‌ పెట్టినందుకే కాదు భవిష్యత్తులో ఇలాంటి దురాగతాలు జరగకుండా అధికారులు తీసుకున్న నిర్ణయానికి ఎగిరి గంతేయ్యాలనిపిస్తోంది. ఇదంతా చూసిన తర్వాత మీకు కూడా బాధగా ఉంది కదా ఎలాంటి స్థితిలో ఉండేదాన్ని ఏ స్థితికి వచ్చానో అని బాధపడుతున్నారు కదా. బాధ పడకండి. నా సంతోషంలో మీరూ భాగస్వాములు కండి. నీచ నికృష్ట దుర్మార్గులకు నా నుంచే అంకురార్పణ జరగాలి. మీరూ నాలాగే కోరుకుంటారనీ, ఆలోచిస్తారని ఆశిస్తూ నేను మీ హాజీపూర్‌ బావి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories