రూరల్‌ రూలర్‌పై సొంత పార్టీ స్కెచ్చేంటి?

రూరల్‌ రూలర్‌పై సొంత పార్టీ స్కెచ్చేంటి?
x
Highlights

ఆ ఎమ్మెల్యేను అధికార పార్టీ టార్గెట్ చేసిందా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, ఆయన్ను పక్కనపెట్టి జూనియర్‌కు మంత్రి పదవి కట్టబెట్టి చెక్ పెట్టిన...

ఆ ఎమ్మెల్యేను అధికార పార్టీ టార్గెట్ చేసిందా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, ఆయన్ను పక్కనపెట్టి జూనియర్‌కు మంత్రి పదవి కట్టబెట్టి చెక్ పెట్టిన అధిష్ఠానం మరోసారి ఆ సీనియర్ ఎమ్మెల్యేక్ షాక్ ఇచ్చింది. తన రాజకీయ వారసునిగా తనయున్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం ఎక్కించేందుకు సదరు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలకు గులాబీ నేతలు గండి కొట్టారు. ఆయన్ను ఒంటరి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యేను అధిష్ఠానం ఎందుకు టార్గెట్ చేసింది సీనియర్ ఎమ్మెల్యేను పక్కన పెట్టేందుకు స్కెచ్ వేస్తున్నదెవరు..?

నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో మాస్ లీడర్‌గా గుర్తింపు పొందిన నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వై.ఎస్. హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత. 2014లో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు బాజిరెడ్డి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలో సీనియర్ శాసన సభ్యునిగా బాజిరెడ్డికి పేరుంది. పైగా బలమైన బీసీ సామాజికవర్గం నేత కావడంతో, ఆయనకు కేసీఆర్ క్యాబినెట్ లో తొలి విడతలో మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరిగింది. ఆయన కూడా ఆశలు పెట్టుకున్నారు. ఏం జరిగిందో తెలియదు బాజిరెడ్డిని కాదని రెండోసారి గెలిచిన ప్రశాంత్ రెడ్డిని అదిష్ఠానం మంత్రి పదవి కట్టబెట్టింది.

సీనియారిటీ, బలమైన సామాజిక వర్గం ఉన్నా మంత్రి పదవికి తాను అర్హుడిని కాదా అంటూ తన ఆవేదనను అధినేతకు వివరించారు బాజిరెడ్డి గోవర్ధన్. ఐతే మరో రకంగా న్యాయం చేస్తానని పార్టీ హామి ఇవ్వడంతో ఆయన తన తనయుని కోసం జడ్పీ పీఠంపై కన్నేశారు. జడ్పీపీఠం జనరల్‌కు రిజర్వ్ కావడంతో, తనయున్ని ధర్పల్లి జడ్పీటీసీగా ప్రత్యక్ష ఎన్నికలలో గెలిపించారు. జడ్పీ ఛైర్మన్ కోసం పోటీలో ఉన్న బాజిరెడ్డి తనయుడు చివరి నిమిషం వరకు ఛైర్మన్ పీఠం కోసం పట్టుబట్టారు. తాను ఒకటి తలిస్తే, దైవం ఇంకోటి తలచిందన్నట్లుగా ఛైర్మన్ పీఠాన్ని దాదన్నగారి విఠల్‌కు అధిష్ఠానం ఫైనల్ చేసి, బాజిరెడ్డికి మరోసారి షాక్ ఇచ్చింది.

రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు మాస్ లీడర్ గా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఏ పార్టీలో ఉన్నా రెబల్ గా తన మాటను నెగ్గించుకోవడంలో తిరుగులేని నేతగా గుర్తింపు ఉంది. ఆ ముక్కుసూటితనం, ఎవరికీ తలొగ్గని వైనం ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డాయని పార్టీలో ఒక ప్రచారం జరుగుతోంది.

వీటికి తోడు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మూడో అత్యధిక మెజార్టీ రూరల్ నియోజకవర్గం నుంచి రావడంతో, పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. రూరల్ నియోజకవర్గంలో కొందరు టీఆర్ఎస్ నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే ఫిర్యాదులు అందాయి. ఫలితంగా ఆయన కుమారునికి జడ్పీపీఠం దక్కలేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం ఆశించిన ఎమ్మెల్యే కుమారుడు బాజిరెడ్డి జగన్‌తో, జడ్పీ ఛైర్మన్ విఠల్ పేరు ప్రతిపాదింపచేసేలా చేసింది. ఫలితంగా ఎమ్మెల్యే కుమారుడు సాధారణ జడ్పీటీసీగా పరిమితం అయ్యారు. మంత్రి పదవి రాకుండా రిక్తహస్తం, జడ్పీ ఛైర్మన్ పీఠం దక్కకుండా చేయడం వెనుక బాజిరెడ్డి వ్యతిరేకుల కుట్ర ఉందని ఆయన అనుచరులు అనుమానిస్తున్నారు. ఆయన్ను పార్టీలో ఒంటరి చేసేలా జిల్లాకు చెందిన ఇతర నేతలు ఏకమయ్యారనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.

పార్టీలో జరుగుతున్న వరుస పరిణాణాలు, ఆ మాస్ లీడర్‌ను మనస్ధాపానికి గురిచేస్తున్నాయి. తన మాటే శాసనంగా గంభీరంగా ఉండే సదరు ఎమ్మెల్యే, వరుస షాకులతో ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. ఐతే పార్టీ అధినేత సదరు ఎమ్మెల్యేకు రాష్ట్రస్ధాయి నామినేటెడ్ పోస్టు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీ ఛైర్మన్ పదవిని బాజిరెడ్డికి కట్టబెట్టొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచన ఎలా ఉందో, రాబోయే రోజల్లో బాజిరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచిచూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories