Bouncers: బౌండరీలను దాటేస్తున్న బౌన్సర్లు.. వీళ్లకు చట్టాలు పనిచెయ్యవా..!?

Representational Image
x

Representational Image

Highlights

Bouncers: నల్ల సఫారీ దుస్తులు వేస్తారు కనబడ్డ వాళ్ళందరిపై దాదాగిరి చేలాయిస్తారు. ప్రశ్నిస్తే మన మీదే దాడి చేస్తారు. చట్టాలు ఉన్న అవి మాకు జాన్తానయ్ అంటారు వాళ్లు.

Bouncers: నల్ల సఫారీ దుస్తులు వేస్తారు కనబడ్డ వాళ్ళందరిపై దాదాగిరి చేలాయిస్తారు. ప్రశ్నిస్తే మన మీదే దాడి చేస్తారు. చట్టాలు ఉన్న అవి మాకు జాన్తానయ్ అంటారు వాళ్లు. షాపింగ్ మాల్, సినిమాలు, పబ్బులు, ఎవరైనా ప్రముఖ వ్యక్తులు వస్తే.. వీళ్లదే హడావుడి. కండబలం చూపిస్తూ ఎవరిపై అయినా దాడికి దిగేందుకు సిద్ధమవుతుంటారు. వాళ్లనే బౌన్సర్స్ అంటారు. అస్సలు బౌన్సర్స్ ఎవరు..? ఎందుకొస్తున్నారు..? వీళ్లకు చట్టాలు పనిచెయ్యవా..!?

హైదరాబాద్‌ నగరంలో తరుచూ పబ్బులు, షాపింగ్‌మాల్స్, ప్రముఖుల పర్యటనల సందర్భంగా టిప్‌టాప్‌గా కనిపిస్తూ బౌన్సర్స్ హడావుడి సృష్టిస్తుంటారు. అడ్డొచ్చిన వారందర్నీ ఈడ్చి పారేయడం.. ప్రశ్నిస్తే చితకబాదెయ్యడం.. ఇదీ వ్యక్తిగత భద్రత పేరుతో బౌన్సర్లు చేస్తున్న అరాచకాలు. ఈ నేపథ్యంలో అసలు బౌన్సర్ల నియామకం, బౌన్సర్స్ విధులు ఏమున్నాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే సామాన్య ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, అడ్డుకున్న సమయాల్లో బెదిరించి చితకబాదిన సందర్భాలు చాలా ఉన్నాయి. అచ్చం పోలీసుల్లాగే సఫారీ డ్రెస్సులు వెయ్యడం ఎక్కడ చూసినా హంగామా చెయ్యడం, వీళ్లకు పరిపాటిగా మారింది. తమకు అధికారం ఉందన్నట్టు షాడో పోలీసుల్లాగా వ్యవహరిస్తున్నారు కొందరు బౌన్సర్స్.

బౌన్సర్లు పోలీసుల తరహాలో సఫారీ దుస్తులు ధరిస్తుంటారు. కొందరు షాడో పోలీసుల తరహాలో ప్రవర్తిస్తూ దాడి చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో అధికమయ్యాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ ఏజెన్సీలు బౌన్సర్ల పేరుతో రౌడీలు, నేర చరిత్ర ఉన్నవారిని అడ్డగోలుగా నియమించుకుంటున్నాయి. దేహదారుఢ్యం, ఎత్తు ఉంటే చాలన్నట్లు ఎంపిక చేస్తూ జనాలపైకి వదిలేస్తున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ పరిధిలో బౌన్సర్లుగా చలామణి అవుతూ సెటిల్‌మెంట్లు చేసేవారు వందల సంఖ్యల్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. లక్షల్లో ఆదాయం, ఉచిత ఆహారం, వసతి కల్పించడంతో నేరచరిత్ర ఉన్నవారూ దీన్ని ఆసరాగా తీసుకుని.. ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. కొన్ని ఏజెన్సీలకు పోలీసులతో సంబంధాలు కూడా ఉండడం లేదు. పోలీసులకు శ్రమ లేకుండా ప్రముఖులకు భద్రత కల్పిస్తున్నారనే ఉద్దేశంతో చూసీచూడనట్లు పోలీసులు సైతం వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ వివాహిత మృతి చెందింది. హీరో అల్లు అర్జున్‌కు రక్షణగా వచ్చిన బౌన్సర్లు అభిమానులను తోసుకెళ్తూ చేసిన హడావుడి తొక్కిసలాట జరగడానికి ఓ కారణంగా మిగిలింది. తాజాగా మంచు కుటుంబం వివాదం నేపథ్యంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌ వర్గాలు పదుల సంఖ్యలో బౌన్సర్లను మోహరించాయి. అయితే వ్యక్తి గత భద్రత కోసం ఇద్దరు ముగ్గురు ఉంటారు. కానీ ఇలా పదుల సంఖ్యలో బౌన్సర్స్ పెట్టుకోవడం వల్ల పోలీసుల విధులకు ఒక్కోసారి ఆటంకం కలుగుతుండటంతో అధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

బౌన్సర్లు చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకపోవడం బౌన్సర్స్ పట్ల సామాన్య ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల బౌన్సర్లు రెచ్చిపోతున్నారు. బౌన్సర్ల దాదాగిరితో సామాన్య జనం చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలున్నాయి. బౌన్సర్లు దాడి చేస్తే కేసులు నమోదు చేయొచ్చని పోలీసులు చెబుతున్నారు. బౌన్సర్‌ పేరుతో భద్రతను వాడడానికి వీల్లేదని వారిని ఎంపిక చేసినవారిని, వారి సేవల్ని పొందుతున్నవారి మీద చర్యలు తీసుకోవచ్చంటున్నారు పోలీసులు. బౌన్సర్స్ యూనిఫామ్‌ మీద కంపెనీ పేరుతో పాటు PSLN లెసైన్సు నంబరు, దాని పక్కన రాష్ట్రం కోడ్‌ తప్పనిసరిగా ఉండాలని.. ఈ కోడ్‌ను పసారా వెబ్‌సైట్లో తనిఖీ చేస్తే సిబ్బంది వివరాలన్నీ వస్తాయని తెలంగాణ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ అసోసియేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి తెలిపారు.

కానీ బౌన్సర్లు మాత్రం ప్లైన్ గా ఉన్న సఫారీ డ్రెస్ వేసుకొని ఎక్కడ కూడా యూనిఫామ్‌ మీద కంపెనీ పేరు కనిపించదని.. PSLN లెసైన్సు నంబరు, దాని పక్కన రాష్ట్రం కోడ్‌ ఎక్కడ కనిపించదన్నారు. ఇలా ఇష్టానుసారంగా బౌన్సర్లు ఎలాంటి కోడ్ లేని సఫారీ డ్రెస్ వేసుకొచ్చి సామాన్య ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నరు. వీరి పైన ఫిర్యాదు చేస్తే తక్షణమే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. కానీ సామాన్య ప్రజలకు బౌన్సర్ల పట్ల ఏమీ తెలియకపోవడంతో ఎవరు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది.

పసారా చట్టం ప్రకారం ప్రముఖులు అంగరక్షకుల్ని నియమించుకోవచ్చు. బౌన్సర్ల ప్రవర్తనపై స్పష్టమైన నిబంధనలున్నాయి. ఇవేవీ లేకుండా బౌన్సర్ల పేరుతో కొందరు ప్రజల్ని భయపెడుతున్నారు. ఇది సమాజంలో ఇప్పుడు ఓ పెద్ద సమస్యగా మారింది. బౌన్సర్లపై ప్రభుత్వం, పోలీసులు దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. పోలీసులు దృష్టి పెట్టకపోతే మాత్రం ప్రజలు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల బౌన్సర్ల దాదాగిరి పెరిగిపోయింది. దీని వల్ల పోలీసులకే మరింత ప్రమాదం జరుగే అవకాశం ఉందని భాస్కర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి బౌన్సర్ల నియామకం, విధులపై ప్రత్యేక నిబంధనలంటూ లేవు. అసలు బౌన్సర్ల వ్యవస్థ చట్టవిరుద్ధం.. ది ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీస్‌ రెగ్యులరేషన్ చట్టం- 2005 ప్రకారం వీరిని భద్రతా సిబ్బందిగానే పరిగణించాలి. రిజిస్టర్‌ అయిన ఏజెన్సీలు నేరచరిత్ర, ప్రవర్తన ఆధారంగానే భద్రతా సిబ్బందిని ఎంపిక చేయాలి. వీరు ప్రవర్తించాల్సిన తీరు, ఇతర అంశాలపై శిక్షణ ఇవ్వాలి. కేవలం భద్రత కల్పించడమే తప్ప.. ఇతరుల మీద దాడి చేయడానికి వీల్లేదు. పబ్బులు, ఈవెంట్ల దగ్గర వీరి ఆగడాలు హద్దు అదుపులేకుండా మితి మీరుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు.. ప్రభుత్వం స్పందించి.. దీనిపై చర్యలు తీసుకోవాలని.. వెంటనే ఒ నియమావళిని.. ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. తెలంగాణ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ అసోసియేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories