ఆ నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా

ఆ నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా
x
Highlights

వందల కోట్ల ఇసుక నిల్వలు తరలిపోతున్నాయి. కానీ సర్కారుకి దమ్మిడి లాభం లేదు. పాతలలోకం కనిపించేలా జేసీబీలు, ప్రోక్లయినర్లు తమ పనులు చేసుకుపోతున్నాయి....

వందల కోట్ల ఇసుక నిల్వలు తరలిపోతున్నాయి. కానీ సర్కారుకి దమ్మిడి లాభం లేదు. పాతలలోకం కనిపించేలా జేసీబీలు, ప్రోక్లయినర్లు తమ పనులు చేసుకుపోతున్నాయి. దాంతో ప్రభుత్వానికి రాబడికి శూన్యం. అనుమతులుండవ్. కానీ దర్జాగా ఇసుక కొల్లగొడుతూ వందల కోట్లు దోచుకుంటున్న కొమ్రంభీమ్ జిల్లా ఇసుక మాఫియాపై హెచ్ఎమ్టీవీ స్పెషల్ రిపోర్ట్.

కొమ్రంభీమ్ జిల్లా సర్పూర్ టి నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా దందా విచ్చలవిడిగా నడుస్తోంది. ఈ ప్రాంతంలో దట్టమైన అడవుల నడుమ పెద్దవాగు, ప్రాణాహితతో పాటు పలు నదుల పాయలు ప్రవహిస్తున్నాయి. దీంతో సహజంగానే ఇక్కడ కోట్లు విలువ చేసే ఇసుక సంపద లభిస్తుంది. ఏ అవకాశాన్ని చేజార్చుకునేందుకు చూడరు అక్రమార్కులు. అదే పని ఇక్కడ కూడా చేస్తున్నారు. విచ్చలవిడిగా ఇసుకను దోచేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడా ఇసుక క్వారీలకు అనుమతులు లేవు. కానీ అనధికారికంగా మాత్రం పది వెలిసాయి.

ఈ ప్రాంతంలో దొరికే ఇసుక గోదావరి నదిలో లభించే ఇసుక కన్నా నాణ్యమైనది. దీన్నే అదునుగా చేసుకొన్న అక్రమార్కులు అడ్డగోలుగా దోచేసుకుంటున్నారు. బెజ్జూర్, చింతలమానెపల్లి, కాగజ్ నగర్, దహేగాం ప్రాంతాల్లోని నదుల పాయల్లో దొరికే ఇసుకను రాత్రిపగలు తేడా లేకుండా అడ్డగోలుగా తోడేస్తున్నారు. ఇక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకు ప్రతినిత్యం వందల లారీలలో ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ఇక్కడ నాణ్యమైన ఇసుక దొరకడంతో హైదరాబాద్ లో ఈ ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. దాంతో ముప్పై టన్నుల ఇసుకను ఏబై వేలకు విక్రయిస్తున్నారు. ఒక్క ‌రాష్ట రాజధానికే ప్రతీరోజు రెండు కోట్లు విలువ చేసే ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు.

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు వీరి గుట్టు రట్టు కాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రక్కు లోపల ఇసుకను నింపి పైన ఇటుకల్ని సర్దుతారు. అంటే చూసేవారికి ఇది ఇటుకలు రవాణా చేసే లారీలా కనిపిస్తుంది. ఎవ్వరి కంట పడకుండా ఉండేందుకు వీరి దందా అర్ధరాత్రుల్లో నిర్వహిస్తుంటారు. ఇలా కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతం నుంచి ఇసుకను తవ్వి వందల లారీలల్లో అక్రమంగా తరలించేస్తున్నారు. ఇంత భారీస్థాయిలో ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతున్నా, ప్రభుత్వాదాయానికి గండి పడుతున్నా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహారిస్తున్నారు. అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం కానీ, ఆ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు వాడుతున్న ప్రోక్లెయినర్, జేసీబీలను సీజ్ చేయడం కానీ చేయడం లేదు. దీనికి కారణం అక్రమార్కులందరూ అధికార పార్టీకి చెందిన వారు కావడమే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories