Telangana: ఈనెల 24 నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర

Sammakka Saralamma Mini Festival from This Month 24th
x

 సమ్మక్క సారలమ్మ (ఫైల్ ఇమేజ్ ది హన్స్ ఇండియా)

Highlights

* ఈనెల 24 నుంచి నాలుగు రోజుల పాటు జాతర కొనసాగుతుంది

Telangana: మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర సమీపిస్తోంది. ఈనెల 24 నుంచి నాలుగు రోజుల పాటు జాతర కొనసాగుతుంది. 20 లక్షల మందికి పైగా అమ్మవార్లను దర్శించుకుంటారని అంచనాలున్నాయి. ఇప్పటికే భక్తుల రాక మొదలైంది. ముందస్తు దర్శనాలు జోరందుకున్నాయి. అయితే చిన్న జాతరకు నిధుల కొరత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా మంజూరు చేయలేదు. దీంతో భక్తులకు కనీసం తాగునీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. మరుగుదొడ్లు మరమ్మతులకు నోచుకోలేదు. రోడ్ల పరిస్థితి ఆధ్వానంగా తయారైంది. కలెక్టర్‌ తన కోటా నుంచి నామమాత్రంగా రూ.2కోట్లు కేటాయించినప్పటికీ అవి ఏ మూలకూ సరిపోవనే విమర్శలు వస్తున్నాయి. ఇంతకూ మినీజాతరకు సంబంధించి మేడారంలో ఏం జరుగుతోంది.

మేడారం మహాజాతర తర్వాత వచ్చే ఏడాది మాఘశుద్ధ పౌర్ణమి రోజు కూడా మినీ జాతరను గిరిజన పూజారులు వైభవంగా నిర్వహిస్తున్నారు. వనం నుంచి దేవతలు గద్దెలపైకి రానప్పటికీ పూజలు మాత్రం మహాజాతర తరహాలోనే నిర్వహిస్తారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలతో పాటు పగిడిద్దె రాజు, గోవిందరాజులు గద్దెల వద్ద కూడా పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈనెల 24 నుంచి 27 వరకు మిని జాతర నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ పూజారులు ప్రకటించారు.

కరోనా నేపథ్యంలో గత ఏడాది మేడారం వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో మినీ జాతరకు ఈ నెల మొదటి వారం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారంలో మొక్కులకు బారులు తీరుతున్నారు. 20 లక్షలకు పైగా భక్తులు తల్లులను దర్శించుకునేందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు మినీ జాతరకు నిధులు కేటాయించకపోవడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత మహాజాతరకు ప్రభుత్వం రూ.85 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది.

ఆ సమయంలో చేపట్టిన పనులన్నీ ప్రస్తుతం నామరూపాలు లేకుండా పోయాయి. రోడ్లు, నీటి సరఫరా పైపులు, నల్లాలు, బోర్లు, క్యూలైన్‌లు అన్నీ కూడా తాత్కాలిక ప్రాతిపాదికనే చేపట్టారు. ప్రస్తుతం మళ్లీ వాటిని పునరుద్ధరించేందుకు నిధులు అవసరం ఏర్పడింది. అలాగే గత మహాజాతర సమయంలో సుమారు 12 వేల మరుగుదొడ్లను తాత్కాలిక పద్ధతిలో చేపట్టారు. జాతర ముగిసిపోగానే అవి నామరూపాల్లేకుండా పోయాయి. శాశ్వతంగా నిర్మించిన మరుగుదొడ్లు కూడా శిథిలమయ్యాయి. మరమ్మతులు చేస్తే 200 మరుగుదొడ్ల వరకు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. వీటికి కూడా నిధుల కొరతే వేధిస్తోంది. ఇక మట్టి రోడ్లు వాటి రూపురేఖలను కోల్పోయాయి. ఈసారి నిధులు కేటాయించి జాతరకు వచ్చే భక్తులకు కనీస సదుపాయాలు కల్పించాలనేఅభిప్రాయం ఆదివాసీ సంఘాలు, పూజారుల నుండి వ్యక్తమవుతోంది

మినీ జాతరకు సమయం సమీస్తుండటంతో అధికారులు ఏర్పాట్లకు రంగంలోకి దిగకపోవటంపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాగునీరు, మరుగుదొడ్లు, అంతర్గత రోడ్ల నిర్మాణం, భక్తులకు బస చేసే షెడ్లలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. జాతరలో కీలకమైన పారిశుధ్యం కోసం భారీగా నిధులు అవసరం ఉంది. ఆర్టీసీ, పోలీసు శాఖలకు కూడా ప్రత్యేకంగా నిధుల అవసరం ఉంది. మొత్తంగా కనీసం రూ.20 కోట్ల నిధులైనా కేటాయిస్తే భక్తులకు సౌకర్యాలు సమకూరుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నయాపైసా నిధులు కూడా మంజూరు కాకపోవటంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.మినీ జాతరకు రూ.2 కోట్లు కేటాయిస్తున్నట్లు ములుగు కలెక్టర్‌ కృష్ణఆదిత్య ప్రకటించారు. ఆ నిధులు దేనికి ఖర్చు చేస్తారో.. ఏ శాఖకు సంబంధించినవో కూడా వివరించలేదు. జాతర సమీపిస్తుండటంతో కలెక్టర్‌ కేటాయించే నిధులు ఏ మూలకు కూడా సరిపోవని భక్తులు అంటున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు ప్రభుత్వం చీఫ్‌విప్ గా వినయ్‌భాస్కర్‌లు ప్రాతినిథ్యం వహిస్తుండటంతో వారిపై భక్తులు ఆశలు పెట్టుకున్నారు. సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి మినీ జాతరకు నిధులు తీసుకొస్తారనే ఆశతో ఉన్నారు. ఇప్పటి వరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మేడారం వైపు దృష్టిసారించలేదని తెలుస్తోంది. పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించిన పనులే జాతరలో కీలకం కావటంతో ఆయన దృష్టిపెడితే భక్తులకు కష్టాలు తీరటమే కాకుండా మినీ జాతరకు మనీ టెన్షన్‌ తగ్గుతుంది.

బుధవారం సమ్మక్క సారలమ్మ ఆలయాలను శుద్ధి చేసి ప్రత్యేకపూజలు నిర్వహించిన ఆదివాసీ పూజారులు ఇక మినీజాతరకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయారు. సమ్మక్క సారలమ్మలు గద్దెపైకి కొలువుదీరకున్నా.. మేడారంలో గద్దెలకు దండం పెట్టుకుంటే చాలన్న ఒక నమ్మకం లక్షలాది భక్తులను మినిజాతరవైపు నడిపిస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం అధికారులు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories